Kolleru: కొల్లేరులో కాసుల దందా.. మాజీ ఎమ్మెల్యే అక్రమ వసూళ్లపై ఆరోపణలు

ఎవరైనా ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు..

Kolleru: కొల్లేరులో కాసుల దందా.. మాజీ ఎమ్మెల్యే అక్రమ వసూళ్లపై ఆరోపణలు

కొల్లేరు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు… ప్రజాప్రతినిధులకు కాసుల కురిపించే ఆదాయ వనరు… ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొల్లేరులో కలెక్షన్స్‌ చాలా కామన్‌. చెరువుకో రేటు… గ్రామానికో కలెక్షన్‌ ఏజెంట్‌.. నీకెంత? నాకెంత? అన్నట్లే సాగుతుంది అక్కడి దందా.. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దందాలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.

మాజీ ఎమ్మెల్యే కలెక్షన్స్‌లో తమ వాటా ఇవ్వలేదని కొందరు గ్రామస్థులు నానా రచ్చ చేస్తున్నారు. కోట్ల రూపాయల సొమ్ములు కాజేశారని సదరు మాజీ ప్రజాప్రతినిధిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే గ్రామస్థులు తనపై దండయాత్ర చేస్తున్నారని ఆ మాజీ ఎమ్మెల్యే రగిలిపోతున్నారట… పక్కా కమర్షియల్‌ సినిమాను తలపించే పొలిటికల్‌ కలెక్షన్‌ స్టోరీ ఇప్పుడు చూద్దాం…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… కొల్లేరులో కాసుల కలెక్షన్స్‌ వివాదాస్పదమవుతోంది. గత ఐదేళ్లు వందల ఎకరాల్లో చేపల చెరువుల నుంచి కలెక్షన్‌ చేసిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి… అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని ఆయన ఒక్కడే మింగేశాడని.. తమ వాటా తమకు ఇవ్వాలని కొల్లేరు వాసులు గొడవకు దిగడం విస్తృత చర్చకు దారితీస్తోంది.

వందల కోట్ల రూపాయలను కలెక్షన్‌ చేశారని… తమ గ్రామాలకు రావాల్సిన మొత్తం.. తమకు దక్కాల్సిన వాటాలను ఆయన ఒక్కడే నొక్కేశాడని కొల్లేరు ప్రాంతానికి చెందిన పలువురు ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడంతో కలెక్షన్స్‌ భాగోతం బయటకు పొక్కింది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేనే గొడవ చేయమని ప్రోత్సహిస్తున్నాడని.. తాను ఇవ్వాల్సిన మొత్తం ఎప్పటికప్పుడు చెల్లించేశానని చెబుతున్నాడట ఆ మాజీ ఎమ్మెల్యే. దీంతో కొల్లేరు ప్రాంతంలోని మూడు నియోజకవర్గాలతోపాటు రాజధాని పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ ఇప్పుడు కొల్లేరు కలెక్షన్స్ ఎపిసోడే చర్చనీయాంశంగా మారింది.

కలెక్షన్‌ చేసుకోవడం పరిపాటి
ఏలూరు జిల్లాలో ఉండే కొల్లేరు సరస్సు దేశంలోనే అతిపెద్దది. దాదాపు 70 వేల ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు సరస్సులో చేపలు, ఆక్వా సాగుతో వేలాది గ్రామస్థులు బతుకు వెళ్లదీస్తుంటారు. దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాలు కొల్లేరు పరిధిలో ఉంటాయి. ఇక జీవవైవిధ్యానికి కేరాఫ్‌ అయిన కొల్లేరు గత కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలకు గురవుతోంది.

సరస్సులో అక్రమంగా రొయ్యిలు, చేపల చెరువులు తవ్వించడం.. ఆ చెరువులను లీజుకిచ్చి.. ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కలెక్షన్‌ చేసుకోవడం పరిపాటి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొల్లేరులో చెరువుల నుంచి కలెక్షన్‌ దందా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా కలెక్షన్‌ చేసిన ఎమ్మెల్యేలు… తమ వాటాగా కొంత తీసుకుని.. మిగిలిన మొత్తంలో కొంత ఆయా గ్రామాల అభివృద్ధికి, గ్రామస్థులకు చెల్లిస్తుంటారు. ఈ దందా ఎప్పటిలా కొనసాగుతున్నా… ఈ మధ్య మాజీ ఎమ్మెల్యేకు కొల్లేరు వాసులకు మధ్య గొడవకు దారితీసింది. సదరు మాజీ ఎమ్మెల్యే తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదని కొల్లేరు ప్రాంతానికి చెందిన వందలాది మంది మాజీ ప్రజాప్రతినిధిని ఇంటిని ముట్టడించడంతో అసలు విషయం బహిర్గతమైంది.

ఏలూరు జిల్లాలో హాట్‌ పాలిటిక్స్‌కు వేదికైన కొల్లేరు సమీప నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆ మాజీ ఎమ్మెల్యే… తన ప్రత్యర్థి, తాజాగా గెలిచిన ఎమ్మెల్యేనే ఈ వివాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. అంతా అక్రమ కలెక్షన్‌ భాగోతమే కనుక ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.

కానీ, తమ వాటా తమకు ఇవ్వాల్సిందేనని పెద్దల పంచాయితీ పెడుతుండటంతోనే కలెక్షన్‌ ఎపిసోడ్‌ హాట్‌ హాట్‌ పాలిటిక్స్‌కు దారితీస్తోంది. అధికారులు ఈ గొడవను ఓ కంట కనిపెడుతూ.. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక పంపుతున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు కలెక్షన్‌ చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి టార్గెట్‌ అయ్యారంటున్నారు. గత ఐదేళ్లు ఆయన దూకుడుగా వ్యవహరించి టీడీపీ క్యాడర్‌ను ఇబ్బందులకు గురిచేశారని…. ఆయన ఎప్పుడు దొరుకుతారా? అంటూ ప్రభుత్వ పెద్దలు ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

వాటా చెల్లించాల్సిందే
కొల్లేరులో వాటాల పంచాయితీ నెల రోజులుగా కొనసాగుతున్నా.. ఎవరూ ఎక్కడా ఫిర్యాదు చేయడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా ఫిర్యాదు చేయమని కొల్లేరు వాసులపై ఒత్తిడి తెస్తున్నా… తమకు రావాల్సిన డబ్బు రాకపోతే అప్పుడు చూద్దామన్నట్లు గ్రామస్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎవరైనా సరే తమ వాటా తమకు చెల్లించాల్సిందేనంటున్నారట… దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. తాను చెల్లించాల్సినది ఎప్పుడో చెల్లించినా.. ఇప్పుడు ఈ పేచీ ఏంటంటూ ఆయన తలపట్టుకుంటున్నాడట. అయితే అంతా అక్రమ కనెక్షన్ల యవ్వారమే కనుక పెద్దల పంచాయితీలో ఏం తేలితే అదే జరుగుతుందని ఎదురుచూస్తున్నాడట ఆ మాజీ ఎమ్మెల్యే.

Also Read: కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల కలకలం.. ఏం జరుగుతోందో తెలుసా?