మొగుడే యముడు…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శరణ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త రోహితే చంపాడని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరణ్య తల్లిదండ్రులు హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు. కామారెడ్డి జిల్లాకు చెందిన 25 ఏళ్ల శరణ్య ఏడాది కిందటే తన క్లాస్ మేట్ రోహిత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. శరణ్య బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తోంది.

రోహిత్, శరణ్య బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే, తన ఇంట్లో శరణ్య విగతజీవిగా పడివుండగా, ఆ సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే బెంగళూరు పయనమయ్యారు. రోహిత్ వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం శరణ్య కామారెడ్డి వెళ్లింది. బాగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో రోహిత్ ప్రమాణం చేసి శరణ్యను తిరిగి బెంగళూరు తీసుకెళ్లాడు.

మద్యానికి బానిసైన రోహిత్ శరణ్యను నిత్యం వేధించేవాడని శరణ్య తల్లిదండ్రులు చెబుతున్నారు. హత్య చేయడమో, లేక ఆత్మహత్య చేసుకునేంత స్థాయిలో వేధించడమో కారణం అయివుంటుందన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే రోహిత్ తమ కుమార్తెపై చేయి చేసుకునేవాడని వెల్లడించారు.

ఇటీవలే శరణ్య పుట్టింటికి వస్తే, పెద్ద మనుషుల సమక్షంలో రోహిత్ తప్పు ఒప్పుకున్నాడని, అతడు మారాడని భావించి శరణ్యను మళ్లీ కాపురానికి పంపామని వివరించారు. ఇంతలోనే తమ కుమార్తె మరణ వార్తను వినాల్సి వస్తుందనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమ కూతురును చంపిన రోహిత్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts