Aadhaar UIDAI issues notices to 127 people in Hyderabad

మీ పౌరసత్వం నిరూపించుకోండి : 127మంది హైదరాబాదీలకు ఆధార్ నోటీసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ,

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)పై తీవ్ర దుమారం రేగింది. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ, ఎన్ఆర్సీ చట్ట విరుద్ధం అని ప్రతిపక్షాలు, పలు ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి. సీఏఏకి వ్యతిరేకంగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆధార్ సంస్థ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDIA) పలువురు హైదరాబాదీలకు షాక్ ఇచ్చింది. మీ పౌరసత్వం నిరూపించుకోండి అంటూ 127మంది నగరవాసులకు నోటీసులు ఇచ్చింది.

నకిలీ భారత పౌరసత్వం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ ఓ హైదరాబాదీకి ఆధార్ సంస్థ నోటీసులు జారీచేసింది. భారత పౌరుడని నిరూపించుకునేందుకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మహ్మద్ సత్తార్ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. హైదరాబాద్ అడ్రస్‌తో అతడికి ఆధార్ కార్డు కూడా ఉంది. ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఫిబ్రవరి 3న ఖాన్‌కు ఆధార్ సంస్థ UIDIA నుంచి నోటీసులు వచ్చాయి. నువ్వు భారత పౌరుడివి కాదు.. తప్పుడు ధృవపత్రాలను సృష్టించి ఆధార్ కార్డ్ తీసుకున్నట్లు ఫిర్యాదు అందిందని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 20న రంగారెడ్డిలోని బాలాపూర్‌ రాయల్ కాలనీలోని మెగా గార్డెన్స్ లో ఎంక్వైరీ ఆఫీసర్ ఎదుట హాజరై పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించాలని ఆదేశించింది. ఒకవేళ ఈ విచారణకు హాజరు కాకపోయినా, పౌరసత్వం నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోయినా.. భారతీయ పౌరుడు కాదనే ఆరోపణను నిజంగా భావించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ భారత పౌరుడివి కాకుంటే.. దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించినట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుందని UIDIA తేల్చిచెప్పింది. విచారణకు రాకుంటే సుమోటోగా తాము నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని వెల్లడించింది.

UIDIA పంపిన నోటీసులపై ఖాన్ లాయర్ ముజఫరుల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత పౌరులకు సమన్లు జారీచేసే అధికారం, పౌరసత్వాన్ని ప్రశ్నించే అధికారం UIDIAకు లేదన్నారు. ఆధార్ సంస్థ నోటీసులపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అసలు ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని ఒకపక్క చెబుతూనే మరోపక్క ఆధార్ కార్డు తీసుకున్నందుకు పౌరసత్వం నిరూపించుకోవాలని అడగటం ఏమిటని సత్తార్ ఖాన్ లాయర్ ముజఫరుల్లా ఖాన్ ప్రశ్నించారు. ఇలాంటి నోటీసులు చాలామందికి వచ్చాయని, వారి సంఖ్య ఎంత అనేది 20వ తేదీన తేలుతుందని చెప్పారు.

సత్తార్ ఖాన్‌తో నగరంలో 127మందికి ఆధార్ సంస్థ ఇలాగే నోటీసులు పంపింది. భారత పౌరసత్వం నిరూపించుకోవాలని ఆదేశించింది. ఫిబ్రవరి 20న విచారణ అధికారి ముందు హాజరుకావాలని, పౌరసత్వం నిరూపణకు అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలని ఆధార్ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఆ 127మంది పౌరసత్వం గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలను మాత్రం UIDIA బహిర్గతం చేయలేదు.

ఆధార్ కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు ఏ వ్యక్తి అయినా భారత్‌లో 182 రోజులు నివాసం ఉండాలని ఆధార్ చట్టం చెబుతోంది. అయితే, అక్రమంగా నివాసం ఉంటున్నవారికి ఆధార్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న 127మంది తప్పుడు పత్రాలతో ఆధార్ పొందారని, ప్రాథమిక విచారణలో వారు అక్రమంగా నివసిస్తున్న శరణార్థులని చెబుతూ ఆధార్ సంస్థ నోటీసులు జారీచేసింది. వారికి ఆధార్ పొందేందుకు అర్హత లేదని అధికారులు చెబుతున్నారు. ఆధార్ చట్టం ప్రకారం వారి ఆధార్ కార్డును రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. అందువల్ల వారిపై వచ్చిన ఆరోపణలకు వ్యక్తిగతంగా హాజరై బదులివ్వాలని నోటీసులు జారీచేశారని నిపుణులు వివరించారు. వారి వివరణలు విన్న తర్వాత, వాటిని పరిశీలించి.. ఎవరైనా తప్పుడు పత్రాలతో ఆధార్ పొందారని నిర్ధారణ అయితే, ఆ అతిక్రమణ స్థాయిని బట్టి వారి ఆధార్ రద్దు లేదా సస్పెండ్ చేయడంపై ఆధార్ సంస్థ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

Read More>>గజ్వేల్‌లో దారుణం : నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదంటూ యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

Related Tags :

Related Posts :