మల్కాజ్‌గిరి ACP అక్రమాస్తులు రూ.70కోట్లు.. భారీగా డబ్బు, నగదు.. కాంప్లెక్స్‌లు, ఇళ్లు, ప్లాట్లు, భూములు గుర్తింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరమైంది. నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఏసీబీ రైడ్‌లో ఏసీపీ నరసింహారెడ్డి అక్రమాస్తుల చిట్టా బయట పడింది. సోదాల్లో సుమారు రూ.70 కోట్లకు పైగానే అక్రమాస్తులను గుర్తించిన అధికారులు.. దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. సోదాల అనంతరం నరసింహారెడ్డిని అరెస్ట్‌ చేసి.. ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు.

అనంతపురంలో ఏసీపీకి 55 ఎకరాల వ్యవసాయ భూమి:
సోదాల్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఏసీపీ పేరున 3 జీ ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హైదరాబాద్‌లో రెండు ఇళ్లు, 2 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్లు తేల్చారు. అనంతపురంలోనూ ఏసీపీకి 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. నర్సింహారెడ్డికి చెందిన రెండు బ్యాంకు లాకర్లను గుర్తించిన అధికారులు.. లాకర్లను ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఇవాళ(సెప్టెంబర్ 24,2020) నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు.

సైబర్‌ టవర్స్‌ ముందు 4 ప్లాట్లు, హఫీజ్‌పేట్‌లో జీప్లస్‌ 3 కమర్షియల్‌ కాంప్లెక్స్:
నిన్న(సెప్టెంబర్ 23,2020) ఏకాకలంలో 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, అనంతపూర్‌ జిల్లాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఏసీబీ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌ సైబర్‌ టవర్స్‌ ముందు 4 ప్లాట్లు, హఫీజ్‌పేట్‌లో జీప్లస్‌ 3 కమర్షియల్‌ కాంప్లెక్స్‌, మరో రెండు ఇళ్లను గుర్తించింది ఏసీబీ. రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన డాక్యుమెంట్స్‌ లభ్యమయ్యాయి.

ఘట్‌కేసర్ సమీపంలో 30 ఎకరాల వివాదాస్పద భూమి కొనుగోలు:
ఏసీపీ నరసింహారెడ్డిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. చివరికి ఏసీబీ నిన్న(సెప్టెంబర్ 23,2020) దాడులు నిర్వహించింది. నరసింహారెడ్డి బినామీ, బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేసింది. జగిత్యాల జిల్లా గంగాధరం ఎంపీపీ శ్రీరామ్‌ మధుకర్‌ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఏసీపీ నరసింహారెడ్డికి శ్రీరామ్‌ మధుకర్‌కు మధ్య సంబంధాలపై ఏసీబీ టీమ్ ఆరా తీసింది.

ఓ ప్రజాప్రతినిధికి పోలీస్‌ అధికారికి ఉన్న లింక్‌లపై విచారణ చేసిన ఏసీబీ.. చివరకు ల్యాండ్‌కు సంబంధించిన లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. నరసింహారెడ్డికి హైదరాబాద్‌కి చెందిన ఓ ప్రజాప్రతినిధి బినామీలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఘట్‌కేసర్ సమీపంలోని యమాన్ పేట్‌లో.. 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నిజాం కాలం నాటి భూమిని.. రాజకీయ నాయకులతో కలిసి కొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అనేక ల్యాండ్ సెటిల్ మెంట్లు:
నరసింహారెడ్డి గతంలో మియాపూర్, బేగంపేట్, ఉప్పల్ సీఐగా పనిచేశారు. చిక్కడపల్లి ఏసీపీగా పనిచేసి.. ఇప్పుడు మల్కాజిగిరికి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. మియాపూర్, ఉప్పల్, మల్కాజిగిరిలో.. వివిధ భూ వివాదాల్లోనూ తలదూర్చినట్లు ఆరోపణలున్నాయి.

READ  పీహెచ్‌సీల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు...15 నిమిషాల వ్యవధిలో ఫలితం

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో పోలీస్‌శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ఏసీపీ నరసింహారెడ్డిపై భూవివాదాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలోనే ఆయనపై వేటు పడుతుందని భావించారు. చివరికి ఏసీబీ రైడ్స్‌తో ఆయన అవినీతి చిట్టా వెలుగు చూస్తోంది. సోదాల అనంతరం నరసింహారెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఇవాళ(సెప్టెంబర్ 24,2020) రిమాండ్‌కు తరలించే అవకాశముంది.

* ఏసీపీ అక్రమాస్తులు @ రూ.70కోట్లు
* అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి
* మాదాపూర్ లో సైబర్ టవర్స్ ముందు 4 ప్లాట్లు(1960 Sq.yards)
* 2 హౌస్ ప్లాట్లు
* హఫీజ్ పేట్ లో కమర్షియల్ G + 3 బల్డింగ్
* 2 ఇళ్లు
* రూ.15 లక్షల నగదు
* 2 బ్యాంకు లాకర్లు
* రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు
Related Posts