వాయిస్ మార్చి ప్రభుత్వాన్ని పొగిడినా, జేసీ బ్రదర్స్‌కు తిప్పలు తప్పలేదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అనంతపురం జిల్లాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో జేసీ బ్రదర్స్‌ తీరు తెలియని వారుండరు. వారి మాటల నైజం.. నోటి దురుసుతనం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అన్నదమ్ములిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. కాకపోతే ఈ మధ్య అన్న జేసీ దివాకర్‌రెడ్డి కాస్త స్పీడు తగ్గించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా కాస్త సాఫ్ట్‌గా మాట్లాడడం మొదలుపెట్టారట. కానీ, ప్రభాకర్‌రెడ్డి మాత్రం అదే స్పీడు చూపించడంతో ఇబ్బందుల పాలవుతున్నారని అంటున్నారు. సొంత పార్టీలో అయినా, ప్రత్యర్థి పార్టీ అయినా సరే ఈ అన్నదమ్ముల మాట మాత్రం ఒకే తీరుగా ఉంటుంది. ఆ మాటలే నేడు వారి పాలిట శాపంగా మారాయని జిల్లాలో టాక్‌.

గత ఎన్నికల్లో ఓటమికి కూడా అదే ప్రదాన కారణంగా మారింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా మారతారనుకొంటే అదీ లేదు. తమ ప్రత్యర్థి అయిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జేసీ సోదరులకు కష్టాలు మొదలయ్యాయి. ఇంతవరకు తమ నోళ్లకు పని చెప్పిన జేసీ సోదరులు… ఇప్పుడు జగన్ పొగుడుతూ తమ వాయిస్‌ను మార్చారు. అయితే, జగన్ వద్ద అవేవీ పని చేయలేదు. జేసీ సోదరులు వాహనాల అక్రమాలపై కేసులు నమోదు చేసి, ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేశారు.

54 రోజలుగా జైలులో ఉన్న వారిద్దరూ బెయిల్ మీద బయటకు రాగానే తాడిపత్రి సమీపంలో సీఐపై నోరు పారేసుకొన్నారు. బెయిల్ మీద వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే మళ్లీ అరెస్టయ్యే పరిస్థితులు చేజేతులా కొనితెచ్చుకొన్నారని జనాలు అంటున్నారు. ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న జేసీ కుటుంబం మళ్లీ ప్రభాకర్ అరెస్ట్‌తో డీలాపడింది. అందుకే జెసి పవన్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చి తమను వదిలేయాలంటూ వేడుకొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేధిస్తున్నారన్నారు. ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్నామని తమను వదిలేయాలని, ఇంత రాజకీయ కక్ష సాధింపులు తామెక్కడా చూడలేదని వాపోయారు.

దివాకరరెడ్డి అయితే నోరు విప్పడం లేదు. సైలెంట్‌గా ఉండడం మినహా చేసేదేమీ లేదనే నిర్ణయానికి వచ్చారట. బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా లేని పరిస్థితిని ప్రభాకర్‌రెడ్డి చేజేతులా తెచ్చుకొన్నారన్న అభిప్రాయం జేసీ వర్గీయుల్లో కన్పిస్తోంది. ఇన్నాళ్లూ ఏ నోటి జోరుతో అయితే రాజకీయంగా అత్యున్నత స్థానాల్లోకి వెళ్లారో… ఇప్పుడు అదే దురుసుతనంతో పొలిటికల్‌గా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా వారి వైఖరి మారుతుందో లేదో చూడాల్సిందే.

Related Posts