Aqua : వాతావరణంలో మార్పులు… అక్వాకు ఆక్సిజన్ గండం

దీనికి తోడు చేపల ధరలు తగ్గిపోవటంతో ఎకరానికి 30వేల నుండి 50వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చేప ధర 85 రూపాయలు పలుకుతుంది.

Aqua : వాతావరణంలో మార్పులు… అక్వాకు ఆక్సిజన్ గండం

Fish

Aqua : వాతావరణంలో మార్పులు అక్వా రైతుల పాలిట శాపంగా మారింది. గత పదిరోజులుగా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండటంతో చెరువుల్లో చేపలకు సక్రమంగా ఆక్సిజన్ అందని పరిస్ధితి నెలకొంది. అకాశం మేఘావృతం కావటం, చిరుజల్లులు పడటం, నీరు చల్లబడి ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్ధితుల్లో చెరువుల్లోని మృత్యువాత పడి నీటిపైన తేలాడుతున్నాయి. ఈపరిణామాలతో అక్వా రైతులుతీవ్ర అందోళన చెందుతున్నారు.

ఆక్సిజన్ కొరత నివారణకు రైతులు ఏంచేయాలో పాలుపోని పరిస్ధితుల్లో ఉన్నారు. ఇందుకోసం ఖరీదైన మందులు వినియోగిస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండటంలేదు. లక్షలు పెట్టుబడి పెట్టి చేపల సాగుచేపట్టిన రైతులు ఈ పరిణామాలతో దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. చాలా మంది రైతులు చేపలు చిన్నసైజులో ఉండగానే అమ్ముకుని వచ్చిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు.

దీనికి తోడు చేపల ధరలు తగ్గిపోవటంతో ఎకరానికి 30వేల నుండి 50వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో చేప ధర 85 రూపాయలు పలుకుతుంది. ఈ ధరతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్ధితిలేదంటున్నారు. పగలంతా చెరువుల్లో బాగానే ఉండే చేపలు రాత్రి సమయంలోనే ఎక్కవగా మృత్యువాత పడుతున్నాయి. తెల్లవారు చెరువుల వద్దకు వెళ్ళే రైతులకు చనిపోయి నీటిపై తేలాడుతున్న చేపలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా రాత్రి సమయంలో చేపల చెరువుల్లో ఆక్సిజన్ విలువలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. తెల్లవారు జాము 3 నుండి 4గంటల ప్రాంతంలో ఆక్సిజన్ 2పిపియం కన్నా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల చేపల శ్వాసక్రియ సక్రమంగా జరగక చేపలు నీటి ఉపరితలానికి వచ్చి నోరు పైకి ఎత్తి ఆక్సిజన్ గాలి పీలుస్తుంటాయి. ఆ సమయంలో చేపలు అధికంగా చనిపోతాయి.