Self employment : శాస్త్రీయ విధానంలో జీవాల పెంపకం.. నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి

గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా వున్న సమయాల్లో పచ్చిమేతలను సైలేజీ గా నిల్వచేసుకున్నట్లయితే... వేసవికాలాల్లో వాడుకుని మేతల కొరతను అధిగమించవచ్చు. మేతలతోపాటుగా సమీకృతదాణాలను అందించినట్లయితే జీవాల ఎదుగుదల ఆశాజనకంగా వుంటుంది.

Self employment : శాస్త్రీయ విధానంలో జీవాల పెంపకం.. నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి

animal husbandry

Self employment : వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడిపరిశ్రమ తర్వాత జీవాల పెంపకం రైతుల ఆదరణ పొందుతోంది. పాడిపరిశ్రమ కన్నా జీవాల పెంపకం సులభంగా వుండటం.. అంతేకాక మాంసానికి పెరుగుతున్న డిమాండ్ తో వీటి పెంపకం ఎందరో నిరుద్యోగ యువతకు సైతం లాభసాటి వ్యాపకంగా వుంది. అయితే క్రొత్తగా పెంపకం ప్రారంభించాలనుకునే వారు మేకలు పెంచాలా లేక గొర్రెలను ఎంచుకోవాలా…. అసలు పెంపకంలో ఏయే అంశాలను దృష్ఠిలో వుంచుకోవాలి. నిర్వహణలోఎలాంటి మెలకువలు పాటించాలి.

READ ALSO : Azolla Cultivation : పాడిపశువవులు, కోళ్లు, జీవాలకు మేతగా అజొల్లా.. అజొల్లా సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు

నానాటికీ వ్యవసాయంలో ఎదురవుతున్న ఆటుపోట్లను తట్టుకోవటానికి దాని అనుబంద రంగాలు రైతుకు ఎంతగానో చేయూతనిస్తున్నాయి. వీటిలో పాడిపరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందుతున్న రంగం జీవాల పొషణ. ఒకప్పుడు కులవృత్తిగా వున్న వీటి పెంపకం..నేడు మాంసానికి పెరుగుతున్న డిమాండ్ తో వాణిజ్యరూపును సంతరించుకుంది. అనావృష్ఠి పరిస్థితులను సైతం తట్టుకునే స్వభావం వుండటం వల్ల వీటి పెంపకం చిన్న,సన్నకారు రైతులకే కాదు.. నిరుద్యోగ యువతకు ఒక ఉపాధి మార్గంగా నిలుస్తోంది.

కృషితో నాస్తి దుర్భక్షం అనటానికి చక్కటి ఉదాహరణ జీవాల పోషణ. క్రొత్తగా జీవాల పెంపకం ప్రారంభించాలనుకునే వారు ముందుగా వారి ప్రాంతాలలో వేటి మాంసానికి డిమాండ్ వుందో ఒక అవగాహనకు రావాలి. అటవీ ప్రాంతాలు, బంజరు భూములు ఎక్కువగా వున్న ప్రదేశాల్లో మేకల పెంపకం మంచిది.అదే పశుగ్రాసాలు పెంచుకోవటానకి అనువైన స్థలావకాశం, సమృద్ధిగా నీరు వున్న ప్రాంతాల్లో గొర్రెల పోషణ లాభదాయకంగా వుంటుంది. మేకలు తక్కువ కాలంలో ఎక్కువ సంతతిని వృద్ది చేయగలవు.

అదేవిధంగా గొర్రెలతో పోలిస్తే మేకలలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా వుంటుంది. గొర్రెలలో రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు  నెల్లూరు జాతికి చెందిన పల్లా, జోడిపి, బ్రౌన్ రకాలు అనుకూలంగా వుంటాయి. తెలంగాణా ప్రాంతానికి దక్కని జాతి గొర్రెలు అనుకూలంగా వుంటాయి.వీటితోపాటు మహారాష్ట్రకు చెందిన మాడ్గ్యాల్ అనే గొర్రె జాతిని కొంతమంది పెంపకం చేస్తున్నారు. నెల్లూరు జాతి గొర్రెలు అధిక మాంసోత్పత్తిని ఇస్తాయి. పొట్టేళ్ళయితే 50కిలోలు, ఆడగొర్రెలైతే 40కిలోల వరకు బరువు పెరుగుతాయి.

READ ALSO : Integrated Cultivation : ప్రకృతి విధానంలో.. ఇంటిగ్రేటెడ్ సాగు చేస్తున్న ఎన్నారై

మేకలలో జమునాపరి, బార్బరి, బ్లాక్ బెంగాల్, ఉస్మానాబాది, శిరోహి వంటి జాతులను మన ప్రాంతంలో రైతులు ఎక్కువగా పెంపకం చేస్తున్నారు. వీటిలో బ్లాక్ బెంగాల్, బార్బరీ జాతులను కంచెమేకలుగా పిలుస్తారు. పొట్టిగా వుంటాయి. ఈతకు 3నుంచి 4పిల్లలు వచ్చే అవకాశం వుండటం వల్ల ఈ గొర్రెల బరువు తక్కువగా వున్నా సంతాన వృద్ధి వేగంగా వుండటం వల్ల ఆర్ధికంగా మంచి ఫలితాలు సాధించవచ్చు. జమునాపరి, శిరోహి జాతిలో ఒక్కో పోకు మేక 60-70కిలోల బరువు తూగుతుంది. ఆడ మేకలు 40 నుంచి 50కిలోల బరువుతో అధిక పాల దిగుబడి సామర్ధ్యం కలిగి వుంటాయి.

వీటితో పాటు స్థానికంగా అభివృద్ధిచెంది, వివిధ రంగుల్లో లభ్యమయ్యే మహబూబ్ నగర్ జాతి మేకలను కూడా పెంపకానికి ఎంచుకోవచ్చు. వీటి బరువు 50నుంచి 70కిలోల వరకు వుంటుంది. వ్యాధి నిరోధక శక్తి  ఎక్కువ. జీవాల పెంపకంలో లాభనష్టాలు ఆ మంద యొక్క పునరుత్పత్తి శక్తి మీద ఆధారపడి వుంటుంది. కావున, జీవాల ఎంపిక, పోషణ, పునరుత్పత్తి వంటి విషయాలలో పెంపకందారులు అత్యంత మెలకువగా వ్యవహరించాలి.

మొదటిసారి 50ఆడజీవాలతో  పెంపకం ప్రారంభించి, అనుభవం వచ్చాక సంఖ్యను పెంచుకుంటే పరిశ్రమ లాభాల బాటలో వుంటుంది. ప్రతి 25ఆడ గొర్రెలకు 1పొట్టేలు సరిపోతుంది. మందలో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా వుండాలంటే విత్తన పొట్టేలు కీలకం. కనుక పొట్టేలు ఎంపికలో రైతులు తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలి. విత్తనపోతును ప్రతి 3సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ వుండాలి.మందలో పుట్టిన పోతును కాకుండా వేరే మందలోని విత్తనపోతును ఎన్నుకుంటే మంద వృద్ధి బాగుంటుంది.

READ ALSO : Sheep And Goats : గొర్రెలు, మేకల్లో హిమాంకోసిస్ వ్యాధి

జీవాల ఎంపిక తర్వాత రైతులు దృష్ఠి పెట్టాల్సిన అంశం-వసతి ఏర్పాటు పైన.వున్న ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో పాకను నిర్మించుకోవాలి. షెడ్లపై ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే ముడి సరుకులతో కొట్టాలను ఏర్పాటు చేసుకోవాలి. కొట్టంలో ప్రతి ఆడగొర్రెకు 1చదరపు మీటరు స్థలం వుండేలా…ప్రారంభించబోయే జీవాల సంఖ్యను బట్టి షెడ్లను ఏర్పాటుచేసుకోవాలి. చిన్న పిల్లలకు 0.5చదరపు మీటరు స్థలం సరిపోతుంది.అదే పొట్టేలుకైతే 2చదరపు మీటర్ల స్థలం కోటాయించాల్సి వుంటుంది.

మేకలు ఎత్తైన ప్రదేశంలో వుండటానికి ఇష్టపడతాయి. అందువల్ల స్థోమతను బట్టి ఉత్తరప్రదేశ్ లోని మేకల పరిశోధనా సంస్థ వారు రూపొందించిన విధానంలో షెడ్లు నిర్మించుకుంటే మంచిది. ఈ విధానంలో మొదటి అంతస్థులో మేకలు పెరుగుతాయి. క్రింద ఖాళీస్థలంలో లిట్టరు చేరుతుంది. షెడ్డుతోపాటు జీవాలు తిరగటానికి వీలుగా కొట్టంలో వున్న స్థలానికి మూడింతలు ఖాళీస్థలం ఆరుబయట వుండాలి. వీటికి అవసరమైన నీటితొట్టెలు, దాణా తొట్టెలను నిర్మించుకోవాలి.పాకల చుట్టూ నీడనిచ్చే ఎత్తైన చెట్లను పెంచినట్లయితే వేసవికాలంలో ఉష్ణతాపం నుంచి జీవాలకు రక్షణగా వుంటుంది.

పూర్వం మన గ్రామాలలో మేతకోసం జీవాలను రోజంతా బయట తిప్పేవారు. దీనినే విస్థృత పద్ధతి అనేవారు. తరువాత 6నుంచి7గంటల బయట తిప్పుతూ… మిగిలిన సమయం షెడ్లలో వుంచి దాణాను అందించే పాక్షిక సాంద్ర విధానాన్ని అనుసరించినా…. ప్రస్థుతం పూర్తిగా షెడ్లలోనే వుంచి పచ్చిమేతలను, దాణాలను అందించే సాంద్ర పద్ధతి ఆదరణ పొందుతోంది. సాంద్ర పద్ధతిలో పెంపకం చేపట్టినపుడు జీవాల ఎదుగుదల సామర్థ్యం ఎక్కువగా వుండి, మాంసోత్పత్తి అధికంగా వుందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈవిధానంలో పెంపకం చేపట్టేవారు ప్రతి 100జీవాలకు 3ఎకరాల్లో గ్రాసాల పెంపకం చేపట్టాలి. వీటిలో ఏకవార్షికాలతో పాటు బహువార్షికాలను కలిపి పెంచినట్లయితే గొర్రెలు, మేకల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు.

READ ALSO : Integrated Agriculture : సమీకృత వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి.. రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు

గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా వున్న సమయాల్లో పచ్చిమేతలను సైలేజీ గా నిల్వచేసుకున్నట్లయితే… వేసవికాలాల్లో వాడుకుని మేతల కొరతను అధిగమించవచ్చు. మేతలతోపాటుగా సమీకృతదాణాలను అందించినట్లయితే జీవాల ఎదుగుదల ఆశాజనకంగా వుంటుంది. ఇందుకోసం స్థానికంగా దొరికే ముడి సరుకులను ఉపయోగించుకున్నట్లయితే ఖర్చులను కొంత వరకు ఆదా చేయవచ్చు. ప్రతి 100కిలోల దాణాకు మొక్కజొన్న 25పాళ్లు, వేరుశనగ చెక్క 32పాళ్లు, గోధుమ లేక బియ్యపు తవుడు 40పాళ్లు, ఖనిజ లవణమిశ్రమం 2పాళ్లు, ఉప్పు 1పాళు కలిపి తయారుచేసుకోవాలి.

ఇలా స్వంతంగా తయారు చేసుకున్న దాణాని ప్రతి పొట్టేలుకు జత కలిసే సమయంలో 500గ్రాములు, మిగిలిన సీజనులో 300గ్రాముల దాణా అందిస్తే సరిపోతుంది. అదే ఆడవాటికైతే చూడి కట్టించటానికి 6వారాల ముందు నుంచి రోజుకు 200గ్రాముల దాణాను ఇవ్వాలి. చూలుతో వున్నప్పుడు 300గ్రాముల దాణాను ప్రతి ఆడగొర్రెకు ఇవ్వాలి. అదే ఈనిన తరువాత 90రోజుల వరకు 200గ్రాముల దాణాను అందిస్తే సరిపోతుంది. వీటితోపాటు ఖనిజలవణ మిశ్రపు ఇటుకలను షెడ్లలో వ్రేలాడదీసినట్లయితే మేకలు వీటిని నాకుతూ వుంటాయి. దీనివల్ల లవణ లోపాలు లేకుండా పిల్లలు ఆరోగ్యంగా వుంటాయి.

READ ALSO : Blue Tongue And Muzzle Disease : గొర్రెలు, మేకల్లో నీలి నాలుక, మూతి వాపు వ్యాధి! నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఇవే!

పెంపకదారులు జీవాల ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుని సలహాల మేరకు ఎప్పటికప్పుడు మందను పరిరక్షించుకుంటూ వుండాలి.ప్రతి 3నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులను త్రాగించాలి. జీవాల పెంపకంలో ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే పిల్లలను కొనుగోలు చేసినప్పటి ధర, వాటి పెంపకానికి అయ్యే ఖర్చు,  తిరిగి మాంసోత్పత్తికి విక్రయించేటపుడు పలికేధరపై ఆధారపడి వుంటుంది. ఆడజీవాలను మందవృద్ధి కోసం వుంచుకుని, మగ జీవాలను అమ్మకం చేసినట్లయితే రెండవ సంవత్సరం నుంచి అందే నికర ఆదాయం ఎక్కువగా వుంటుంది.  పక్కాషెడ్లతో  పెంపకం ప్రారంభించినట్లయితే రెండు సంవత్సరాల్లో పెట్టుబడి చేతికివస్తుంది.  మొదటి రెండు సంవత్సరాల్లో పెట్టిని పెట్టుబడి స్థిరాస్తిగా నిలవటమే కాక, 3వ సంవత్సరం నుంచి పెంచే సంఖ్యను బట్టి ఆదాయం ఆశాజనకంగా వుంటుంది.