Mushroom Spawn : పుట్టగొడుగు స్పాన్ ఎలా తయారు చేస్తారో తెలుసా!

పుట్టగొడుగు మదర్ కల్చర్ ను సీసాలోకి కొద్దిగా వేసిన వెంటనే శుభ్రమైన దూదితో మూసివేసుకోవాలి. ఇనాక్యులేషన్ చేసిన సీసాలను 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 రోజులపాటు నిల్వవుంచితే మైసీలియం

10TV Telugu News

Mushroom Spawn : పుట్టగొడుగులు మాంసాహారముతో సమానం. ఆహార ప్రియులు వీటిని ఇష్టంగా తింటారు. ఎన్నో పోషక విలువలుండటం, మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండటంతో చాలా మంది రైతులు, ఔత్సాహికులు పుట్టగొడుగుల సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పుట్టగొడుగుల సాగు చేపట్టాలనుకునే వారికి ముందుగా మేలైన విత్తనం (స్పాన్) ఎంచుకోవటమనేది చాలా ముఖ్యం. చాలా మంది పుట్టగొడుగు స్పాన్ ను సొంతంగా తయారు చేసుకుంటున్నారు.

సులభమైన పద్దతిలో కొద్దిపాటి మెళుకవలు పాటిస్తే మేలు రకమైన పుట్టగొడుగుల స్పాన్ ను రూపొందించుకోవచ్చు. ఇందుకు చేయాల్సింది ముందుగా నాణ్యమైన జొన్నలు లేదంటే గోధుమ విత్తనాలను సేకరించి పెట్టుకోవాలి. సేకరించిన విత్తనాలను అంతే పరిమాణంలో మంచి నీటిలో 30 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన జొన్న విత్తనాలకు కాల్షియం సల్ఫేట్ మందు పొడిని పట్టించాలి.

కేజీ జొన్న విత్తనాలను తీసుకుంటే 5గ్రాముల కాల్షియం సల్ఫేట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలకు బాగా దీనిని పట్టేలా చేయాలి. ఇలా చేయటం వల్ల విత్తనాలకు ఉదజని పిహెచ్7 శాతం చేరుతుంది. దీని వల్ల పుట్టగొడుగుల శిలీంధ్రము ఆరోగ్యంగా, వేగంగా పెరిగేందుకు దోహదపడుతుంది.

ఇలా తయారు చేసుకున్న విత్తనాలను 400 గేజ్ మందం కలిగిన పాలీప్రొపిలిన్ కవర్లో, గాని గ్లూకోజ్ సీసాల్లోగాని నింపుకోవాలి. అనంతరం ఆసీసాల మూతికి నీరు పీల్చని దూదితో గట్టిగా మూసివేయాలి. తరువాత వాటిని ఆటోక్లేవ్లో 15పౌండ్ల పీడనం వద్ద గంటపాటు ఉంచిన అనంతరం గది ఉష్ణోగ్రత వద్ద 24 గంటలపాటు చల్లార్చాలి. ఇలా తయారైన విత్తనాలను మదర్ కల్చర్ ను ఇనాక్యులేషన్ చేసేముందు గదిలో అతినీలలోహిత దీపం వద్ద 30నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే అందులోని సూక్ష్మజీవులన్ని చచ్చిపోతాయి.

పుట్టగొడుగు మదర్ కల్చర్ ను సీసాలోకి కొద్దిగా వేసిన వెంటనే శుభ్రమైన దూదితో మూసివేసుకోవాలి. ఇనాక్యులేషన్ చేసిన సీసాలను 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 రోజులపాటు నిల్వవుంచితే మైసీలియం పెరిగి పుట్టగొడుగుల స్పాన్ సిద్ధమౌతుంది. ఇలా తయారు చేసుకున్న విత్తనాన్ని 30 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వచేసుకోవాలి.

ఒకసారి స్పాన్ బాటిల్ మూత ఓపెన్ చేస్తే అందులోని స్పాన్ మొత్తాన్ని వినియోగించుకోవాలి. స్పాన్ ను ఉపయోగించుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ చేయలేము. అలా చేస్తే స్పాన్ రంగు మారిపోయి నీరు చేరుతుంది. స్సాన్ సీసాలో ఆకుపచ్చ, నల్లని బూజును గుర్తించినట్లైతే ఈసీసాలలోని స్పాన్ చెడిపోయిందని అర్ధం అలాంటి సమయంలో ఆస్పాన్ ను వినియోగించకుండా ఉండటం మంచిది. సీసాలోని స్పాన్ గింజల చుట్టూ తెల్లగా సిల్కీగా ఉంటే అది మంచి పుట్టగొడుగుల స్పాన్ గా గుర్తించవచ్చు.

10TV Telugu News