Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ.. ముందుకుపోతున్నారు.

Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు

Innner Crop (1)

Agriculture: రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ.. ముందుకుపోతున్నారు. ఎక్కువగా మామిడి, బొప్పాయి, అరటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటున్నారు. అధిక లాభాలను పొందుతున్నారు.

ఈ విధానాలనే పాటిస్తూ.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ రైతు మామిడిలో అంతర పంటలుగా కూరగాయలను సాగుచేస్తూ ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం , ఎర్రగుంటపల్లి గ్రామంలో ఉంది. చాలా మంది రైతులు మామిడి తోటలను వేసి సీజన్ లో దిగుబడులు తీసుకొని వదిలేస్తుంటారు. కానీ రైతు దెబ్బ రామన్న తనకున్న ఎకరన్నర మామిడి తోటలో అంతర పంటలుగా ఎకరంలో 10 రకాల కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు.

భూమిలో తేమ తొందరగా ఆవిరైపోకుండా, కూరగాయలు నేలను తాకి చెడిపోకుండా, మొక్కలకు వైరస్‌ సోకకుండా ఉండేందుకు బోదెలపై మల్చింగ్‌ షీట్‌ను పరిచారు. డ్రిప్‌ను అమర్చి మొక్కలకు నీరందించే ఏర్పాటు చేశారు. తీగ జాతి మొక్కలు కావడంతో అన్ని పంటలను స్టేకింగ్ విధానంలోనే సాగుచేస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, కాయలు నాణ్యంగా ఉండేందుకు జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్ ను క్రమం తప్పకుండా అందిస్తున్నారు. దీంతో నాణ్యమైన దిగుబడులు పొందుతునారు.

ప్రకృతి విధానంలో పంటల సాగు చేస్తుండటంతో పంట కాలం కూడా పెరుగుతోంది. ఇటు వచ్చిన దిగుబడులను స్థానికంగా ఉన్న మార్కెట్ లో అమ్ముతున్నారు. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా, అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయడం లేదు. కూరగాయల పంటలు కావడంతో రోజు మార్చి రోజు కోతకు వస్తున్నాయి.

కోసిన ప్రతి సారి టమాట 10 బాక్సుల దిగుబడి వస్తుంది. మరోవైపు అన్ని కూరగాయలు కలిపి 50 -60 కిలోల దిగుబడి వస్తున్నాయి. బహుళ పంటల పద్ధతిలో ప్రకృతి విధానంలో కూరగాయలను సాగు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న రైతు రామన్న తోటి రైతులకు ఆదర్శమే.