Watermelon Cultivation : పుచ్చసాగుతో రైతుకు మేలు! సాగులో మెళుకువలు, యాజమాన్య పద్దతులు

ఎరువులు, నీటి యాజమాన్యం ; బాగా చివికిన పశువుల ఎరువు హెక్టారుకు 10 టన్నుల చొప్పున వేసుకోవాలి. 100 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్, 60 కిలోల నత్రజని ఎరువులు వేయాలి.

Watermelon Cultivation :  పుచ్చసాగుతో రైతుకు మేలు! సాగులో మెళుకువలు, యాజమాన్య పద్దతులు

Watermelon

Watermelon Cultivation : శరీరానికి మంచి పోషకాలను అందించటంతోపాటు, శరీర ఉష్ణోగ్రతలను తగ్గించే పుచ్చకాయలను ఆహారంలో భాగం చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. జ్యూసుల రూపంలో వీటిని తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మార్కెట్లో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో పుచ్చకాయలకు ఉన్న డిమాండ్ అంతాఇంతాకాదు. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు పుచ్చసాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. పుచ్చ సాగుకు అధిక ఉష్ణోగ్రత కలిగిన పొడి వాతావరనం అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉంటే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మురుగు నీటి వసతి కలిగిన ఇసుక నేలలు, తేలికపాటి బంక మట్టి నేలలు పుచ్చసాగుకు అనుకూలంగా ఉంటాయి.

పుచ్చసాగు చేపట్టాలనుకునే రైతులు మేలైన రకాలను ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో ఆసాహియమాటా, సుగర్ బేజు, ఆర్క జ్యోతి, ఆర్క మానిక్ వంటి రకాలతోపాటు, నాంధారి 295, పరాన్ అపూర్వ వంటి రకాలను ఎక్కవగా సాగు చేస్తున్నారు. వీటితోపాటు నారింజ రంగు కండ
కలిగిన పూసా వర్ధతి, పూసా మధురసి, పంజాబ్ సున్హేరి కూడా సాగులో ఉన్నాయి. కాయపై సన్నటి గీత కలిగి మంచి బరువు కలిగి ఉంటాయి. తోట పంటగా సాగుచేయాలనుకుంటే 3 నుండి 3.5 మీటర్ల ఎడంలో 60 సెం.మీ వెడల్పు గల నీటి కాలువలను తయారు చేసుకుని ఈకాలువలకు ఇరువైపులా 30,50 సెం.మీ ఎడంలో విత్తనాలు నాటు కోవాలి. ఈ పద్దతి ద్వారా హెక్టారుకు 1.25 నుండి 1.50కిలోల విత్తనం వాడుకోవాలి.

ఎరువులు, నీటి యాజమాన్యం ; బాగా చివికిన పశువుల ఎరువు హెక్టారుకు 10 టన్నుల చొప్పున వేసుకోవాలి. 100 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్, 60 కిలోల నత్రజని ఎరువులు వేయాలి. నాటే సమయంలోనే సగం నత్రజని, మిగిలిన సగం నాటిన 25 రోజుల తరువాత వేసుకోవాలి. నది పరివాహక ప్రాంతంలో సాగు చేసేవారు పుచ్చపంటకు పత్యేకంగా నీరు పెట్టాల్సిన పనిలేదు. అయితే తోటపంటకు మొక్కల ప్రధమ దశలో , కాయ ఎదుగుదల దశలో నీరు ఇవ్వటం అవసరం. కాయలు పక్వానికి వచ్చిన సందర్భంలో నీటి తడులు ఇవ్వకూడదు. ఇలా చేస్తే కాయలు పగిలిపోతాయి.

పుచ్చ పండు పక్వానికి వచ్చినప్పుడు కాయమొదట్లోనున్న తీగ ఎండిపోతుంది. కాయనేలకు తగిలే భాగం పసుపు రంగుకు మారుతుంది. కాయను చేతితో తడితే కంచు శబ్ధం వస్తుంది. పండు తెలుపు నుండి పసుపుకు మారగానే కోసుకోవాలి. పుచ్చసాగులో హెక్టారుకు 25 టన్నుల వరకు దిగుబడి ఉంటుంది. పుచ్చసాగును అంతరపంటగా కూడా చేపట్టవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పుచ్చను బొప్పాయి తోటల్లో అంతరపంటగా సాగుచేస్తున్నారు. అధిక దిగుబడులకోసం మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తూ రైతులు మంచి లాభాలను పొందుతున్నారు.