Manure : పశువుల పేడతో అధిక పంట దిగుబడులు!

Manure : పశువుల పేడతో అధిక పంట దిగుబడులు!

Manure (1)

Manure : వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడి సాధనే లక్ష్యంగా పంటపొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా పెంచారు. అయితే రసాయన ఎరువుల వాడకం వల్ల ఖర్చులు అధికమై పెట్టుబడులు పెరిగాయి తప్ప పంట దిగుబడి ఏమాత్రం పెరగలేదు. దీని వల్ల రైతులు తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సేంద్రీయ విధానంలో పశువుల పేడను పంట పొలాలకు ఉపయోగించటం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ ఎరువులను వాడాలని సూచిస్తున్నారు.

రసాయన ఎరువులు అధిక మొత్తంలో వాడటం వల్ల పంటపొలాల్లో భూసారం క్షీణిస్తుంది. అంతేకాకుండా పంటల దిగుబడి తగ్గుతుంది. పశువుల ఎరువులు వాటం వల్ల భూమి గుల్లబారి భూసారం పెరుగుతుంది. దీంతో పంటల దిగుబడి పెరిగి రైతులకు లాభాలు వస్తాయి. రైతులు దుక్కి దున్నక ముందుగా సేంద్రీయ ఎరువులైన పసువుల పేడను పంట పొలాల్లో వెదజల్లు కోవాలి. భూమిలో సేంద్రీయ ఎరువు పూర్తిగా కలిసి పోయే వరకు దుక్కులు దున్ని భూమిని చదును చేసుకోవాలి. పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్ ఎరువు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఎరువును సేంద్రియ ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. సేంద్రీయ ఎరువులను వేయటం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. దిగుబడులు పెరుగుతాయి.

రసాయన ఎరువుల వల్ల కృత్రిమ పోషక పదార్ధాలు ఉంటాయి. అయితే సేంద్రీయ ఎరువుల్లో సహజసిద్ధమైన లవణాలు, పోషక పదార్ధాలు పంటలకు అందుతాయి. ఎకరానికి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువును వాడటం వల్ల పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది. చీడపీడలను తట్టుకునే శక్తి మొక్కలకు అధికమవుతుంది. సేంద్రీయ ఎరువులతో పండించి పంటలు ఆహారంగా తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.