Henna : గోరింటకు పెరిగిన డిమాండ్…సాగుదిశగా రైతాంగం

గోరింటాకు వినియోగం పెరగటంతో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గోరింటాకు సాగు ఉంది. గోరింటాకు పంట అదిక ఉష్ణోగ్రతను తట్టుకోవడమే కాకుండా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. విత్తనాల ద్వారా లేదా మొక్కలు నాటడం ద్వారా పంట సాగు మొదలు పెడతారు. రెండో ఏడాది నుండి ఆకు కోతకు వస్తుంది.

Henna : గోరింటకు పెరిగిన డిమాండ్…సాగుదిశగా రైతాంగం

Henna

Henna : వాణిజ్యపరంగా మంచి అదాయం లభిస్తుండటంతో చాలా మంది రైతులు గోరింట సాగు చేపట్టి అదాయాన్ని పొందుతున్నారు. గోరింటాకు బహువార్షిక మొక్క. ఎత్తు 2మీటర్ల నుండి 4మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని జీవితకాలం 20 నుండి 25 సంవత్సరాలు. మనదేశంలో ముఖ్యంగా రాజస్థాన్‌, పంజాబ్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల్లో గోరింటాకు సాగు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా గోరింట సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.

గోరింట నుండి తీసిన తైలాన్ని ఫర్ ఫ్యూమ్స్ , లేపనాల తయారీలో వాడతారు. ఇటీవలి కాలంలో సహజ రంగుల వాడకం పెరగటంతో గోరింట ప్రాముఖ్యత బాగా పెరిగింది. కస్మాటిక్ రంగంలో దీనిని విరివిగా వినియోగిస్తున్నారు. గోరింట పొడిని అలంకరణ కోసమే కాకుండా ఔషదంగా కూడా వాడుతున్నారు. ఆకులు రక్తస్రావం అరికట్టటం, చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. వైద్య విధానాలైన సిద్ధ, ఆయుర్వేదం మందులు, అయింట్‌మెంట్స్‌ వంటి వాటి తయారీలో కూడా గోరింటాకును ఉపయోగిస్తున్నారు.

చేతులకు, పాదాలకు అలంకారంగా గోరింటాకును పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తున్న అలవాటు. పండుగలకు, శుభకార్యాలకు మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనేది పూర్వం నుంచి వస్తున్న సర్వసాధారణమైన అలవాటు. అయితే దీనివెనుక ఆరోగ్యకరమైన కారణాలు కూడా అనేకమున్నాయి. గోరింటాకు పట్ల మహిళలే కాదు పురుషులు సైతం మక్కువ చూపుతుంటారు. గోరింటాకు ముడి పదార్థంగా రకరకాలైన కాస్మోటిక్‌ ఉత్పత్తులు మార్కెట్‌లో తయారవుతుండటంతో డిమాండ్‌ బాగా పెరిగింది.

పెళ్లి, పండుగ ఏదైనా గోరింటాకు కోన్‌తో రకరకాల డిజైన్లు వేసుకుని ప్రత్యేకంగా మెహందీ పండుగను నిర్వహిస్తున్నారు. దీనిని హెయిర్‌కండీషనర్‌గా ఉపయోగిస్తు న్నారు. గోరింటాకుకు పెరిగిన డిమాండు దృష్ట్యా చిన్న పరిశ్రమగా నెలకొల్పి ఆదాయాన్ని పొందవచ్చు.

గోరింటాకు సాగు వైపు రైతుల దృష్టి ;

గోరింటాకు వినియోగం పెరగటంతో వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గోరింటాకు సాగు ఉంది. గోరింటాకు పంట అదిక ఉష్ణోగ్రతను తట్టుకోవడమే కాకుండా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. విత్తనాల ద్వారా లేదా మొక్కలు నాటడం ద్వారా పంట సాగు మొదలు పెడతారు. రెండో ఏడాది నుండి ఆకు కోతకు వస్తుంది.

గోరింటసాగుకు జులై,ఆగస్టు మాసాలు అనుకూలం. ముందుగా విత్తనాన్ని చల్లుకుని నారుమళ్ళల్లో పెంచుకోవాలి. ఆతరువాత వాటిని సాళ్ళలో 30 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి. మొక్కల ఎదుగుదలకు పశువుల ఎరువుతోపాటు, వారానికి రెండు సార్లు నీటితడులివ్వాలి. సాళ్ళల్లో అంతర పంటలుగా గోరుచిక్కుడు, పెసర, మినుము వంటి పప్పుజాతి పంటలను సాగుచేసుకోవచ్చు.

గోరింటాకు సాగులో సస్యరక్షణ ప్రధానమైనది. చెదలు, ఆకుతినే పురుగులు పంటను ఆశిస్తుంటాయి. చెదల నివారణకు క్లోరిఫైరిఫాస్ పొడి, పురుగులు ఆశించ కుండా క్వినాల్ ఫాస్ పిచికారి చేయాలి. మంచి దిగుబడి రావటానికి 3సంవత్సారాలు పడుతుంది. ఏడాదికి రెండు కోతలు కోయవచ్చు. ఏప్రిల్, మేలో తొలికోత, అక్టోబరు, నవంబరులో రెండో కోత తీసుకోవచ్చు. నెలకు ఒకసారి కొమ్మలను కత్తిరించుకోవాల్సి ఉంటుంది. కత్తిరించుకున్న కొమ్మలను ఎండబెట్టి ఆకులను రాలగొట్టాలి. ఎండిన ఆకులను గోనె సంచుల్లో నిల్వచేసి మార్కెట్లకు తరలించి విక్రయించాలి.

ఎకరానికి ఏడాది 1200 నుండి 1500 కేజిల ఎండిన ఆకు దిగుబడిగా వస్తోంది. గోరింటాకు ఆధారిత ఉత్పత్తుల వినియోగం పెరుగుతుండటం వల్ల వాణిజ్య పరంగా గోరింటాకు సాగు లాభదాయకమని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.రైతుల నుండి సేకరించిన గోరింటాకును శుద్ధి చేసి ఎలక్ట్రికల్‌ ట్రై డ్రయ్యర్స్‌లో ఉంచి తేమను తొలగిస్తారు. దీంతో ఎండు ఆకులు తయారవుతాయి. వీటిని ప్యాక్‌ చేసి హెన్నా తయారీ ఉత్పత్తుల పరిశ్రమలకు మార్కెట్‌ చేస్తారు.

నేచురల్‌ బ్లాక్‌, రెడ్‌, కాపర్‌ బ్రౌన్‌, డార్క్‌, బ్రౌన్‌ మీడియం బ్రౌన్‌ లైట్‌ వంటి హెన్నా, హెయిర్‌ కలర్స్‌ తయారు చేయవచ్చు. హేయిర్‌ కేర్‌ ఉత్పత్తులైన హెన్నా శీకారు పొడి, హెన్నా హెయిర్‌ కేర్‌ పోడి, హెన్నా షాంపు, హెన్నా కండిషనింగ్‌ షాంపు, హెన్నా హెయిర్‌ ఆయిల్‌ తయారు చేయవచ్చు. హెన్నా స్కీన్‌ కేర్‌ ఉత్పత్తులైన హెన్నా కోన్‌, హెన్నా స్టెన్సిల్‌, హెన్నా ఫేస్‌ మాస్క్‌, హెన్నా బాడి పెయింటింగ్‌ ఉత్పత్తుల తయారీలో గోరింటాకు వాడుతున్నారు. హెన్నా ఎండు ఆకులు, హెన్నా ఆకు పొడి, హెన్నా ఆయిల్‌ వంటి వాటికి కూడా వాణిజ్య పరంగా మంచి డిమాండ్‌ ఉంది.

గ్రామీణ ప్రాంత రైతులు గోరింటసాగు ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. పండించిన గోరింటాకును బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేస్తున్నారు. అనంతరం జల్లెడలో జల్లించి డ్రమ్ముల్లో నిల్వవుంచుకుంటున్నారు. అకర్షణీయమైన లేబుల్స్ కలిగిన ప్యాకింగ్ లలో పట్టణాల్లోనే కాస్మోటిక్స్ విక్రయ దుకాణాల వారికి అమ్ముతున్నారు. సగటున కిలోకు 60 రూపాయల నుండి 100 రూపాయల వరకు నికర అదాయం పొందవచ్చు.