Chicken : కాకపుట్టిస్తున్న నాటుకోడి ధర

మాంసం ప్రియులు నాటుకోడిపై మక్కువ చూపుతున్నారు. దీంతో నాటుకోడి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కేజీ నాటుకోడి మాంసం రూ.600లకు చేరింది.

Chicken : కాకపుట్టిస్తున్న నాటుకోడి ధర

Chicken

Chicken : బ్రాయిలర్ రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఊపందుకుంటోంది. రోడ్డుపక్కన అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పూర్వం రోజుల్లో నాటుకోళ్లను అధికంగా పెంచేవారు. 2000 సంవత్సరానికి ముందు గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం అధికంగా ఉండేది. ఇంట్లో ఖాళీ జాగ ఉంటే నాటుకోళ్లనే పెంచేవారు. ఎవరైనా బంధువులు వస్తే నాటుకోడినే కోసేవారు.

గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పండుగలకు గ్రామదేవతల దగ్గర నాటుకోళ్లనే నైవేద్యంగా ఇచ్చేవారు. మార్కెట్లోకి బ్రాయిలర్ ఎంట్రీ ఇవ్వడంతో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గింది. నాటుకోళ్ల మార్కెట్ ను బ్రాయిలర్ ఆక్రమించింది. గుడ్డు తక్కువ ధరకు రావడం, మాంసం కూడా మెత్తగా ఉండటంతో మాంసం ప్రియులు బ్రాయిలర్ వైపు మొగ్గు చూపారు. దీంతో నాటుకోళ్ల పెంపకం క్రమంగా తగ్గింది.

20 ఏళ్ల తర్వాత మళ్లీ నాటుకోడి వైపు మాంసాహారులు చూపు.

బ్రాయిలర్ కోడి త్వరగా బరువు పెరిగేందుకు హార్మోన్లు ఇంజక్షన్లు ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి హానిచేస్తాయని భావన ప్రజల్లో పెరిగింది. దీంతో తమకు దగ్గర్లో నాటుకోళ్లు లేకపోయినా, తెలిసిన వారితో తెప్పించుకుంటున్నారు. నాటుకోడి మాంసం వినియోగం పెరగడంతో ధర అమాంతం పెరిగింది. కేజీ లైవ్ కోడి రూ.600 పలుకుతుంది. ఇక చికెన్ అయితే రూ.700 పైమాటే.. బోనాల సమయంలో పలు ప్రాంతాల్లో కిలో రూ.800 లకి కూడా అమ్మారు.

మాంసంపై ప్రజల్లో పెరిగిన అవగాహన.. నాటుకోడి వలన ఎటువంటి అనర్దాలు ఉండవనే ఉద్దేశం.. దీని డిమాండ్ ను అధికం చేసింది. అటు ఇటుగా మటన్ ధరతో పోటీ పడుతుంది నాటుకోడి.. ఇక లేయర్ కోడిగుడ్డుతో పోల్చితే నాటు కోడి గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే ఈ గుడ్డు ధరకూడా అంతే రేంజ్ లో ఉంటుంది. ఒక నాటుకోడి గుడ్డు రూ.20 రూపాయలుగా ఉంది.

డిమాండ్ పెరగడంతో నాటుకోళ్లు పెంచేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఒకప్పుడు ఇళ్లలో పెంచుకునే నాటుకోళ్లను ఇప్పుడు షెడ్లు వేసి భారీగా స్థాయిలో చెంచుతున్నారు. గత రెండేళ్ల కాలంలో నాటుకోళ్ల పెంపకం చేపట్టిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నాటుకోళ్ల పెంపకం చేపడుతున్న వారిలో యువతే అధికంగా ఉన్నారు. ఊరు చివర వ్యవసాయానికి పనికిరాని ప్రాంతాల్లో, తోటల్లో నాటుకోళ్ల పెంపకం అధికంగా చేస్తున్నారు.