Chickpea Cultivation : రబీలో నల్లరేగడి నేలల్లో శనగసాగు యాజమాన్యం!
తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 5గ్రా ట్రైకోడెర్మా విరిడి అనే మిత్ర శిలీంధ్రం లేదా 2.5గ్రా థైరమ్ లేదా కాప్టాన్ లేదా కార్బండిజమ్ వాడి విత్తనశుద్ధి చేయాలి.

Chickpea Cultivation : పప్పుధాన్యాలలో సాగులో శనగ ముఖ్యమైన పంట. పోషక విలువలు కారణంగా శనగలో 23శాతం ప్రొటీన్ తోపాటు ప్రతి 100గ్రా శనగ విత్తనాలలో 343 మి.గ్రా , భాస్వరం, 186 మి.గ్రా కాల్షియం, 141 మి.గ్రా, మెగ్నీషియం, 7మి.గ్రా ఇనుప ధాతువు, 3మి.గ్రా జింకు లభిస్తాయి.
సారవంతమైన నల్లరేగడి నేలలు శనగ పంటకు అనుకూలం. నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శీతాకాలంలో మంచుతో మొక్కలు పెరుగుతాయి. చౌడు భూములు పనికిరావు. తొలకరిలో వేసిన పైరును కోసిన తరువాత భూమిని నాగలితో ఒకసారి, గొర్రుతో రెండు సార్లు మెత్తగా దున్ని చదును చేయాలి. శనగలో మనకు దేశవాళీ రకాలు , కాబూలీ రకాలు లభ్యమవుతున్నాయి.
దేశవాళి రకాలకు సంబంధించి అన్నిగెరి, క్రాంతి, భారతి, జెజి11, జెజి 130, కాలూలీ రకాలకు సంబంధించి శ్వేత, కెఎకె 2, విహార్, జెజికె 1, లాంశనగ రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి.
విత్తనశుద్ధి ; తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 5గ్రా ట్రైకోడెర్మా విరిడి అనే మిత్ర శిలీంధ్రం లేదా 2.5గ్రా థైరమ్ లేదా కాప్టాన్ లేదా కార్బండిజమ్ వాడి విత్తనశుద్ధి చేయాలి. రైజోబియం బ్యాక్టీరియా లేని నేలల్లో 200గ్రా రైజోబియం మిశ్రమాన్ని 300మి.లీ 10శాతం బెల్లం ద్రావణాన్ని ఉపయోగించి విత్తనాలపై పోసి బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకుంటే దిగుబడులు పెంచుకోవచ్చు.
ఎరువుల యాజమాన్యం ; ఎకరాకు 8కిలోల నత్రజని 20 కిలోల భాస్వరం , 16 కిలోల గంధకం ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి. అంటే ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేయాలి. శనగ పంట దిగుబడులను పెంచటంలో గంధకం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. గంధకం లోపమున్న నేలల్లో ఎకరాకు 5 నుండి 16కిలోల నీటిలో కరిగే గంధకం విత్తేసమయంలో వేయాలి. ఐరన్ ధాతు లోపం గమనిస్తే లీటరు నీటికి 5గ్రా అన్నబేది, 1గ్రా నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి చివరి దుక్కిలో వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది.
నీటి యాజమాన్యం ; శనగ వర్షాధారపు పంట. అయినా తేలికపాటి నీటి తడులు ముఖ్యంగా పూత దశకంటే ముందు, కాయదశలో ఇచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు. నీరు పెట్టినప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పైరు విత్తిన 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. రసాయనిక కలుపు మందులు ప్లూక్లోరాలిన్ 1 లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.