Jasmine : మల్లెసాగులో సస్యరక్షణ, యాజమాన్యం

మల్లెలో ముఖ్యంగా మొగ్గ తొలచు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. పురుగు యొక్క లార్వా , పువ్వు మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినేస్తూ మొగ్గలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీని నివార

10TV Telugu News

Jasmine : పూలలో మల్లెపువ్వు చాలా ముఖ్యమైనది. సువాసన కలిగి ఉండే మల్లెపువ్వును ఇష్టపడని వారుండరు. భారతదేశంలో వాణిజ్యపరంగా మల్లెపూల సాగును రైతులు చేపడుతున్నారు. స్త్రీల అలంకరణలో మల్లెపూలకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. దేశవ్యాప్తంగా 40 రకాలకు పైగా మల్లె జాతులు ఉన్నాయి. కష్టమైనా ఎంతో ఇష్టంగా చాలా మంది రైతులు మల్లె సాగును చేపడుతున్నారు.

దేశ వ్యాప్తంగా తీసుకుంటే దీని సాగు విస్తీర్ణం 6385 హెక్టార్ల వరకు ఉండగా 32935 టన్నుల వరకు పూల దిగుబడి ఉండవచ్చని అంచనా. విడిపూలుగా, దండలు, బొకేలు, తయారీకి వినియోగిస్తారు. మొత్తం ఉత్పత్తిలో కొంత భాగం పరిమిళ భరితమైన అత్తరు, తలనూనెల తయారీకి వాడతారు.

శీతాకాలంలో చలితక్కువ, వేసవిలో వేడిమిగా, ఒక మోస్తరు వర్షపాతం, సూర్యరశ్మి బాగా ఉండే ప్రదేశాల్లో మల్లె సాగు చేపట్టవచ్చు. జాస్మినం ఆరికులేటం, జాస్మినం గ్రాండి ఫ్లోరం, జాస్మినం సంబాక్ వంటి రకాలను వాణిజ్యపరంగా రైతులు సాగు చేస్తున్నారు. మొక్కల సాంద్రతను బట్టి దిగుబడి అధారపడి ఉంటుంది. మురుగునీరు పారే, నీరు సమృద్ధిగా లభించే నేలల్లో మల్లె సాగు చేపట్ట వచ్చు.

మల్లె సిఫార్సు మోతాదులో ఎరువులు వేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో మొక్కకు 60గ్రా నత్రజని, 120 గ్రాముల భాస్వరం, 120 గ్రాముల పొటాష్ రసాయనిక ఎరువులను వేయడం ద్వారా ఎక్కువ చిగుళ్లు, పూలు పూసే శాఖలు ఏర్పడి పెద్ద మొగ్గలు పూస్తాయి. పూత దశలో 0.25శాతం మోతాదులో మెగ్నీషియం పిచికారి చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది. ప్రతి మొక్కకు సరిపడినంత మేర పశువుల ఎరువును అందించాలి. వారానికి ఒకసారి నీటి తడులు అందించాలి.

మల్లెలో తెగుళ్ళు

మల్లెలో ముఖ్యంగా మొగ్గ తొలచు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. పురుగు యొక్క లార్వా , పువ్వు మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినేస్తూ మొగ్గలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీని నివారణకు మలథియాన్ లీటరు నీటికి 2మి.లీ మందును కలిపి చెట్లపై పిచికారీ చేయాలి.

నల్లి పురుగు ఉధృతి మల్లెలో అధికంగా ఉంటుంది. పొడివాతావరణలో ఈ పురగు పంటను ఆశిస్తుంది. ఆకుల అడుగుబాగానికి చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపురంగుకు మారి రాలిపోతాయి. దీని నివారణకు గంధపు పొడిని ఎకరానికి 10కిలోల చొప్పున చల్లుకోవాలి.

ఆకు ఎండు తెగులు మల్లెలో నష్టాన్ని కలిగిస్తుంది. తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారిపోతాయి. ఆకు భాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పాడతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 3గ్రా, లేదా కార్బెండిజమ్ 1గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎండు తెగులు కారణంగా మల్లెలో మొక్క కింది భాగంలో ఆకులు ఎండిపోవటం తరువాత పైభాగంలో ఆకులు ఎండిపోయి రాలిపోవటం జరుగుతాయి. చివరకు మొక్కంతా ఎండిపోయి చనిపోతుంది. దీనిని గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 2గ్రాములు లీటరు నీటిలో కలిపి భూమిని తడపాలి.