Toor Dal : కందిసాగులో సస్యరక్షణ

ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది ముదురు బూడిద రంగులో ఉంటాయి. ఇవి ఆకులు, కాయల మీద గుడ్లను గుంపులు గుంపులు పెడతాయి.

Toor Dal : కందిసాగులో సస్యరక్షణ

Toor Dal Cultivation

Toor Dal : కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగుచేస్తుంటారు. నీరు త్వరగా ఇంకిపోయే గరప,ఏఱ రేగడి,చల్కా నేలల్లో మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. అయితే కంది సాగు విషయంలో రైతులు సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. కందికి చీడపీడల బెడద అధికంగా ఉంటుంది. సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే పంటను కాపాడుకోవటంతోపాటు దిగుబడి పెంచుకోవచ్చు. రైతులు కంది పంటసాగులో కొన్ని సస్యరక్షణ చర్యలను తప్పనిసరిగా చేపట్టాలి.

కంది సాగులో చీడపీడల నివారణ ;

శనగపచ్చ పురుగు: ఈ పురుగు మొక్కలో మొగ్గ, పూత, పిందెల మీద గుడ్లు పెడుతుంది. వీటి నుండి వచ్చిన లార్వా మొగ్గు పూత, పిందె లను తింటుంది. దీని వల్ల పంట మొత్తం నష్టమవుతుంది. వీటి గుడ్లు పసుపు రంగులో ఉంటాయి. వలయాకారంలో గుడ్లను పెడతాయి. వీటి నివారణకు 2.5 మిల్లీ లీటర్ల క్లోరిపైరిఫాస్‌ లేదా రెండు మిల్లీ లీటర్ల క్వినాల్పాన్‌ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్‌ ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయవచ్చు. దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే 0.4 గ్రాముల ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ లేదా 10 మిల్లీ మీటర్ల ఇండాక్సాకార్చ్‌ లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనో షాద్‌ ను ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేయవలెను.

మరుకా మచ్చల పురుగు: ఈ పురుగు పూత మరియు పిందె లను ఒకదానితో మరొకటి గూడు కడతాయి. వాటిలో లోపలి భాగంలో ఉంటూ వాటి మొత్తాన్ని తినడం వల్ల నష్టం కలుగుతుంది. రెక్కల పురుగు మొగ్గల దగ్గర, వాటి పై భాగంలో గుడ్డు పెడుతుంది. వీటి నివారణ కోసం పూత ప్రారంభ దశలో వేపనూనె లేదా వేప గింజల కషాయం ఐదు శాతం చేసుకొని పిచికారి చేస్తే తొలగిపోతాయి. అంతేకాకుండా 2.5 మిల్లీ లీటర్ల క్లోరిపైరిఫాస్‌ లేదా ఒక గ్రామ్‌ ధయోదికార్చ్‌ లేదా 0.3 మిల్లీలీటర్‌ డైక్లోరోవాస్‌ ను లీటర్‌ నీటిలో కలిపి వారం రోజులకు ఒక సారి పిచికారి చేయాలి.

కాయ ఈగ: ఈ కాయ ఈగ తల్లి ఈగ మాములు ఈగ కంటే చిన్నగా ఉంటుంది. ఈ తల్లి ఈగ లేత పిండ దశలో కాయ కవచం పై తెల్లని గుడ్లు పెడుతుంది. కాళ్లు లేని పిల్ల పురుగులు వృద్ధి చెందుతున్న సమయంలో గింజలను సారలు, గాళ్ళు చేసి తింటాయి. దీనివల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా తల్లి పురుగు కాయలు నిద్రావస్థలో కి వెళ్లి పిల్ల పురుగు చేసిన పొరను రంధ్రం చేసి బయటకు వస్తుంది. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని నివారించడానికి 2.0 మిల్లీలీటర్ల డైమిథోయేట్‌ లేక 2.0 మిల్లీలీటర్ల ప్రొఫెనో ఫాస్‌ ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కాయ రసం పీల్చే పురుగు: ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది ముదురు బూడిద రంగులో ఉంటాయి. ఇవి ఆకులు, కాయల మీద గుడ్లను గుంపులు గుంపులు పెడతాయి. పిల్ల, తల్లి పురుగులు గింజల నుండి రసాన్ని పీల్చుకుంటాయి. వీటి వల్ల అవి ఎండిపోతాయి. దీనివల్ల మొలకెత్తవు. వీటిని నివారించడానికి రెండు మిల్లీ లీటర్ల డైమిథోయేట్‌ ను లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేస్తే ఈ పురుగు తొలగిపోతుంది.

కంది సాగు లో తెగుళ్ళు ;

ఎండు తెగులు: మొక్కలపై ఈ ఎండు తెగుళ్లు ఏర్పడడం వల్ల పూత, కాయ దశలో ఉన్నప్పుడే మొక్క చనిపోతుంది. వీటి నివారణకు ఎటువంటి పిచికారి మందులు లేవు. కానీ ఈ తెగులును తట్టుకునే లక్ష్మీ మరియు ఆశ రకాలను సాగు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వెర్రి తెగులు: ఈ తెగులు సోకిన వెంటనే మొక్కలు లేత ఆకుపచ్చ రంగులో చిన్న ఆకులను తొడగడం వల్ల పూత కూడా ఆగిపోతుంది. కాబట్టి దీనిని గొడ్డు తెగులు అని కూడా పిలుస్తారు. వీటి నివారణకు లక్ష్మీ మరియు ఆశ రకాలను పెంచడం మేలు. అంతేకాకుండా లీటరు నీటిలో మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడి లేదా నాలుగు మిల్లీలీటర్ల డైకోఫాల్‌ లేదా రెండు మిల్లీలీటర్ల ప్రాపర్‌ గైట్‌ ను కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలి.