Pesticide Spraying : పురుగు మందుల పిచికారీలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

మందు ద్రావణం తయారు చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి స్పేయర్ లోని ఫిల్టర్లను, నాజీలను, పైపులను తరచుగా శుభ్రపరుచుకోవాలి.

Pesticide Spraying : పురుగు మందుల పిచికారీలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

Pesticide Spraying

Pesticide Spraying : గ్రామీణ ప్రాంతంలో నిరక్ష్యరాశ్యులైన రైతాంగం, రైతు కూలీలకు పంటలకు పురుగు మందుల పిచికారీ సమయంలో సరైన అవగాహన లేకపోవటంతో జాగ్రత్తలపై ఏమాత్రం శ్రద్ధపెట్టటంలేదు. పురుగు మందుల పిచికారీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పంటపొలాల్లో పురుగు మందులు పిచికారీ సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించటం మంచిది.

పురుగుమందు పిచికారీలో సూచనలు ;

పురుగు మందు పిచికారి చేసే సమయంలో రక్షణగా దుస్తులు, చేతికి గ్లౌజులు, ముక్కుకి, కళ్ళకు, రక్షణగా కవచాలు ధరించాలి. సస్యరక్షణ మందులు మానవ శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపలికి ప్రవేశిస్తాయి కాబట్టి రక్షణ దుస్తులు తప్పనిసరిగా వాడాలి. వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి బిగుతుగా ఉండే దుస్తులను ధరించరాదు. పిచికారీ చేసిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ధరించిన దుస్తులను, కవచాలను, ఉతికి ఆరబెట్టుకోవాలి.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి వేగంగా విస్తున్నప్పుడు, మంచు కలిగిన వాతావరణం ఉన్నప్పుడు, వర్షం కురిసే ముందు ఎలాంటి మందులు పంటలపై పిచికారి చేయరాదు. వాతావరణ పరిస్థితులను గమనించి మందు పిచికారి చేసిన తర్వాత కనీసం నాలుగు గంటల వరకు వర్షం కురవదు అని నిర్ధారణకు వస్తే మందు పిచికారి చేసుకోవాలి.

మందులు పిచికారి చేసే సమయంలో నీరు త్రాగడం, ఏవైనా ఆహారాలు తినడం, గుట్కాలు నమలడం, పాన్ పరాకులు నమలడం, పొగ త్రాగడం, చేతి వేళ్లతో కళ్ళను నలపడం, చేయరాదు. అలాగే పిల్లలతో పురుగుమందుల పిచికారి చేయించకూడదు. సస్యరక్షణ మందులు పిచికారి చేసిన పొలములో గాని పొలం చుట్టూ ఉన్న గట్ల పైగాని పశువులను మేపటం చేయకూడదు. అలాగే గట్ల పై ఉన్న గడ్డిని పశువులకు మేతగా 6 నుండి 8 రోజుల వరకు వేయకూడదు.

పైరుకు చీడపీడలు ఆశించినప్పుడు మొక్కను లేదా పైరును అనుభవం, పరిజ్ఞానం ఉన్న వ్యవసాయం, ఉద్యాన అధికారికి చూపించి వారు సిఫార్సు చేసిన మందును వాడాలి. సిఫార్సు చేసిన మొతాదులో వాడాలి. రెండు మూడు రకాల మందులు వాడేటప్పుడు వాటి యొక్క కలిసిపోయే తత్వాన్ని గమనించి మాత్రమే వాడుకోవాలి. పురుగు మందులు విషపూరితాలు కావున, చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి.

ఆహార పంటలపై, కూరగాయ పంటలపై, మరియు పశుగ్రాస పంటలపై, సస్యరక్షణ మందులు పిచికారి చేసినప్పుడు 8 నుండి10 రోజుల వరకు వేచిఉండి తర్వాత పంటలు కోయడం గాని కూరగాయలు కోయడం గాని, పశుగ్రాసం కోయటం గాని, చేపట్టాలి. పురుగుమందు వాడేసిన కాళీ డబ్బాలను పొలములో చిందరవందరగా వదిలేయకుండా గుంత తీసి పూడ్చి వేయాలి ప్లాస్టిక్ డబ్బాలను కాల్చివేయాలి.

మందు ద్రావణం తయారు చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి స్పేయర్ లోని ఫిల్టర్లను, నాజీలను, పైపులను తరచుగా శుభ్రపరుచుకోవాలి. నాజిల్ లో చెత్త చేరినప్పుడు నోటితో ఊదడం చేయకూడదు. మందు ద్రావణం తయారు చేసేటప్పుడు 200 మిల్లీలీటర్ల నీటి సామర్థ్యం కలిగిన కొలత డబ్బాను ఎంచుకొని మందు ద్రావణం తయారు చేసుకోవాలి. మందు ద్రావణం తయారు చేసేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదును మాత్రమే తయారు చేసుకోవాలి. ఎక్కువ తయారుచేసుకుని వాడితే మందులు పనిచేయవు. అదేవిధంగా ఎక్కువ మోతాదులో మందు తీసుకొని వాడినట్లయితే పురుగు లేదా తెగులు తొందరగా రోగనిరోధకశక్తిని పెంపొందించుకొని మందుకు లొంగ కుండా అలవాటు పడుతుంది.

నిత్యావసరాల లో వినియోగించే కూరగాయల పంటల పై మోనోక్రోటోఫాస్ మరియు గడ్డి మందు లను ఎట్టి పరిస్థితులలో పిచికారి చేయకూడదు. స్ప్రేయర్ ని వాడిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగి భద్రపరుచుకోవాలి సాధారణంగా నాజిల్ లో చెత్తాచెదారం చేరి పిచికారి సరిగా పడనప్పుడు మందు ద్రావణం వృధాగా పోతుంది ఎప్పటికప్పుడు నాజిల్ ను శుభ్రపరిచి మందును పిచికారి చేసుకోవాలి. విచక్షణా రహితంగా పురుగుమందులు వాటం ఏమంత మంచిది కాదు. అలా పిచికారి చేయడం వల్ల పంట ఉత్పత్తులో వాటి అవశేషాలు పేరుకుపోయి నాణ్యతా ప్రమాణాలకు నిలువలేక మంచి ధర లభించదు.

మందుల పిచికారీ చేసేటప్పుడు చర్మం, నోరు, శ్వాసకోశం, కనుగుడ్ల ద్వారా విషం శరీరంలోకి ప్రవేశించి ప్రమాదం వాటిల్లవచ్చు. విష ప్రభావానికి గురైన వ్యక్తులు తలనొప్పి, అలసట, బలహీనత, తలతిరగడం, చర్మం, కండ్లు మంట కల్గించడం, కనుచూపు మందగించడం, కనుగుడ్డు చిన్నగవడం, స్పృహ తప్పడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని వైద్యశాలకు వెళ్ళి తగిన చికిత్స పొందటం మంచిది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది.