Sapota Cultivation : సపోటా సాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ

సపోటాకు ముఖ్యంగా మొగ్గతొలిచే పురుగు ఆశిస్తుంది. లేత గులాబీ రంగులో ఉండే ఈ పురుగు లేత మొగ్గలను తొలచి తినేస్తుంది.

Sapota Cultivation : సపోటా సాగులో తెగుళ్ళు, చీడపీడల నివారణ

Sapota

Sapota Cultivation : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలనిచ్చే ఉద్యానవన పంటల సాగువైపు రైతులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో సపోటా సాగు రైతులకు మంచి అదాయవనరుగా చెప్పవచ్చు. కొద్దిపాటి మెళుకవలు పాటిస్తే సపోటా సాగులో మంచి దిగుబడిని సాధించవచ్చు. రుచికరంగా గోధుమవర్ణంలో ఉండే ఈ పండ్లు తినేందుకు ఎక్కవగా ఇష్టపడుతుంటారు.

ఏడాదికి రెండు సార్లు కాపునిస్తాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సపోటా సాగును రైతులు విరివిగా చేపడుతున్నారు. సపోటాలో అనేక వెరైటీ రకాలు ఉన్నాయి. వాటిలో కాలిపత్తి రకం, క్రికెట్ బాల్ రకం, కీర్తి బర్తీ రకం, ద్వారాపూడి రకం, పికెయం3, డిహెచ్ఎస్1, డిహెచ్ఎస్2తోపాటు సింగపూర్, విరుధ్, తగరంపూడి, గుత్తి, గువరయ్య వంటి రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎకరం పొలంలో 40 సపోటా మొక్కలు నాటుకోవచ్చు. ఒకసారి మొక్కలు నాటితే వాటి నుండి 50 నుండి 60 సంవత్సరాలపాటు పంట నిస్తుంది. నీరు త్వరగా ఇంకిపోయే తేలకపాటి నేలలు సపోటాకు అనుకూలంగా ఉంటాయి.

సపోటాకు ముఖ్యంగా మొగ్గతొలిచే పురుగు ఆశిస్తుంది. లేత గులాబీ రంగులో ఉండే ఈ పురుగు లేత మొగ్గలను తొలచి తినేస్తుంది. ఆకు గూడు అల్లే పురుగు కూడా సపోటాకు నష్టాన్ని కలుగజేస్తాయి. లేత ముదురు ఆకులను గూళ్ళుగా చేసుకుని ఆకులు తినేస్తుంటాయి. పూతకు హానికలిగించటంతోపాటు కాయలకు నష్టాన్ని కలిగిస్తాయి.

పిండినల్లి పురుగు ఆశిస్తే సపోటా కాయలు ఎదగకుండా పోవటం, పిందెలు రాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పురుగులు విసర్జించే పదార్ధాల వల్ల చెట్టు ఆకులన్నీ నల్లగా కనిపిస్తుంటాయి. కాయతొలిచే పురుగులు బెడద సపోటా పంటలో అధికంగానే ఉంటుంది. కాయల కండను తొలచి లోపలికి చేరుకుని గింజలను తిని నష్టపరుస్తాయి.

ఈ పురుగుల నివారణకు 2మిల్లీలీటర్లు ఎండో సల్ఫాన్, లేదంటే క్లోరిఫైరిఫాస్, 1.6మిల్లీలీటర్ల మోనో క్రోటోఫాస్, లేదంటే 3గ్రాముల కార్బరిల్ లీటరు నీటిలో కలిపి ఆకులు, కొమ్మలు, పూర్తిగా తడిసేలా పిచికారి చేసుకోవటం వల్ల పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు.

ఇక సపోటా సాగులో తెగుళ్ళు కూడా రైతాంగానికి పెద్ద సమస్యగానే చెప్పవచ్చు. ప్రధానంగా ఆకు మచ్చ తెగులు సమస్య అధికంగా ఉంటుంది. చిన్నచిన్న వలయాకారపు మచ్చలు, గోధుమ రంగు మచ్చలు, ఏర్పడతాయి. వీటి నివారణకు 3గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

చెక్క తెగులు సపోటాను ఎక్కవగా వస్తుంది. ఈ తెగులు ఉన్నప్పుడు చెట్ల కొమ్మలు వంకరులు తిరిగి పోతాయి. ఆకులు రాలిపోతుంటాయి. కొమ్మలు ఎండిపోయి చెక్కలుగా మారాతాయి. ఈ తెగులు గమనించిన వెంటనే కొమ్మలను కత్తిరించుకోని 3గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ లేదంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ ను పిచికారి చేసుకోవాలి. ఇనప ధాతువు లోపం లేకుండ చూసేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫెట్ 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.