Chilli Crop : మిరపపంటను ఆశించి నష్టం కలిగించే నారుకుళ్లు తెగులు! నివారణ మార్గాలు

విత్తనం మొలకెత్తిన తరువాత, మొక్కల కాండం గట్టి పడే వరకు ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. సాధారణంగా తెగులు వేర్ల ద్వారా లేదా నేలను తాకే కాండం ద్వారా సోకుతుంది.

Chilli Crop : మిరపపంటను ఆశించి నష్టం కలిగించే నారుకుళ్లు తెగులు! నివారణ మార్గాలు

Chilli Crop

Chilli Crop : మిరప వాణిజ్య పంటలలో ముఖ్యమైన పంట. సాధారణంగా మిరప పంటను ఖరీఫ్ సీజన్లో అయితే జులై,ఆగస్టు నెలలో సాగు చేస్తారు. రబీ సీజన్లో అయితే అక్టోబర్, నవంబర్ నెలలో సాగుకు అనుకూలం. సేంద్రీయ పదార్థం అధికంగా ఉన్న అన్ని రకాల నెలల్లో మిరప సాగు చేపట్టవచ్చు. భారతదేశంలో 8,30,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మిరప సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే 10 డిగ్రీల నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం అనుకూలం. మిరప పంటను వివిధ రకాల తెగుళ్లు అశించి తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. వాటిలో నారుకుళ్లు కూడా ఒకటి.

మిరపలో నారుకుళ్లు తెగులు ;

మిరప పంటను ఆశించే తెగుళ్లలో నారుకుళ్లు తెగులు ప్రధానమైదని. ఈ తెగులు లక్షణాలు 2 దశల్లో కనిపిస్తాయి. తొలిదశలో మొలకెత్తిన విత్తనాలు నేల పైకి రాక ముందే కుళ్ళి చనిపోతాయి. ఈ దశలో తెగులు లక్షణాలన్నీ నేలలోనే జరుగుతాయి. విత్తనం నుండి ప్రధమ మూలం, ప్రధమ కాండం పూర్తిగా రాక ముందే కుల్లిపోతుంది. కొన్ని సార్లు విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్ళి పోతాయి. దీనిని గుర్తించలేక విత్తనం మొలకెత్తలేదని భావిస్తారు.

ఇక రెండవ దశలో మొలకలు నేలపైకి వచ్చిన తరువాత విత్తనం మొలకెత్తిన తరువాత, మొక్కల కాండం గట్టి పడే వరకు ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. సాధారణంగా తెగులు వేర్ల ద్వారా లేదా నేలను తాకే కాండం ద్వారా సోకుతుంది. తెగులు సోకిన మొక్కల భాగాలు మెత్తగా ఉండి నీటిని పీల్చుకున్నట్లు కనిపిస్తాయి. తెగులు తీవ్రత వలన కాండం వద్ద కుళ్ళిపోయి నేలపై విరిగితాయి. ఆరోగ్యంగా ఉన్న నారు మొక్కలు ఒక రోజులోనే ఈ తెగులుకు గురి అవుతాయి. నారు మొక్కలు చనిపోయే ముందు బీజదళాలు ఆకులు వాడిపోవడం, మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవటం గమనించవచ్చు.

లేత మొక్కలలోనే ఈ శిలీంద్రం తెగులును కలుగజేస్తుంది. కణజాలాలు గట్టిపడిన తర్వాత తెగులు సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. నేలలో అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రత ఉండడం. బాగా చివకని పశువుల ఎరువు వాడటం కారణం కావచ్చు. మురుగు నీరు పోయే సౌకర్యం సరిగా లేకపోవటం, పంట మార్పిడి చేయకపోవటం, నారు మడిలో విత్తన మోతాదు ఎక్కువగా వేయటం వంటివి కారణం కావచ్చు.

నారుకుళ్లు తెగులు నివారణ ;

మిరపనారు మండి పోసేందుకు తేలిక పాటి నెలను ఎంచుకోవాలి. 6-8 అంగుళాలు ఎత్తైన నారు మడిలో విత్తనం పోయాలి. మడిలో విత్తనాలు పల్చగా చల్లాలి. పూర్తిగా చివికిన పశువుల ఎరువు మాత్రమే వాడుకోవాలి. నీరు మోతాదు అధికంగా కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు నీరు పెట్టాలి. ఒకే మడిలో ప్రతి సంవత్సరం నారు పెంచటం చేయరాదు. మారుస్తూ ఉండాలి. అధిక మోతాదులో నత్రజని వాడరాదు. నారుమడి వేసే స్థలంలో నేలపై చెత్త వేసి కాల్చాలి. థైరామ్ / కాప్టస్ 3 గ్రా. 1 కేజి విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారు మడిని తీసిన తర్వాత 10-15 రోజుల వ్యవధిలో మాంకోజెబ్ 0.25% లేదా కార్బండిజం 0.1% మందును నేల తడిచేలా పిచికారి చేసుకోవాలి.