Dairy Farm : డైరీ ఫాం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారా?..మీకోసమే…

పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి.

Dairy Farm : డైరీ ఫాం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారా?..మీకోసమే…

Dairy

Dairy Farm : పాలకు రోజురోజుకు గిరాకీ పెరుగుతుంది. పాల ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ కూడా అధికంగానే ఉంది పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో చాలా మంది ఔత్సాహికులు డైరీ ఫాం ఏర్పాటుపై దృష్టిపెడుతున్నారు. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, సగటు కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్‌ పెరుగుతోంది. డైరీరంగంపై శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే మంచి అదాయాన్ని పొందవచ్చు. పాడి పరిశ్రమ స్థాపించే ముందు లాభాల బాటలో నడిచే డెయిరీకి స్వయంగా వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును, సమస్యలను క్షుణ్ణంగా, శ్రద్ధగా గమనించాలి. సందేహాలను తీర్చుకోవాలి. వినడం కన్నా చూడటం ద్వారా త్వరగా విషయ పరిజ్ఞానం కలుగుతుంది. కష్టే ఫలి అని పెద్దలు చెప్పినట్లు.. నౌకర్లపై ఆధారపడకుండా, స్వయంగా కష్టపడి, పర్యవేక్షించి, పూర్తి సమయాన్ని వెచ్చించగలిగినప్పుడే విజయం చేకూరుతుంది.

పాడి పరిశ్రమను నెలకొల్పే ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్‌ సదుపాయం ఎలా ఉందో చూసుకోవాలి. నీటి లభ్యత, బోరు, పశుగ్రాసం పెంపకానికి తగినంత భూమి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవే కాకుండా చుట్టూ కంచె నిర్మించడం, పని వారి లభ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యత తగ్గుతుంటే, అవసరం పెరుగుతోంది. ప్రతి సంకరజాతి ఆవు లేదా ముర్రా గేదెకు రోజుకు 75–80 లీటర్ల నీరు అవసరం. వేసవిలో ఇది వంద లీటర్లకు పెరుగుతుంది. ఏడాది పొడవునా పశుగ్రాసం సాగు చేసుకోవడానికి అదనంగా నీరు అవసరం. కాబట్టి, నీటి లభ్యత అనేది అతి ముఖ్యమైన సంగతి.

పాడి పరిశ్రమను పెట్టాలనుకునే వారు ఆ ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదె పాలకు గిరాకీ ఉందా అనేది ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గేదె పాలకు గిరాకీ ఉంటుంది. ముందుగా షెడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం అవసరం. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి అవసరమవుతుంది. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరం.

పశువుల ఎంపిక…

హెచ్‌.ఎఫ్‌., జెర్సీ సంకర జాతి ఆవుల్లో పాల సార అధికంగా ఉంటుంది. ఇవి కర్ణాటక, తమిళనాడుల్లోని చింతామణి, కోలార్, బెంగళూరు సబర్బన్‌ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి. ఇవి రోజుకు 12 నుంచి 24 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. వీటి ధర మార్కెట్‌లో రూ. 65 వేల నుంచి లక్షపైన ధర పలుకుతాయి.గ్రేడెడ్‌ ముర్రా, ముర్రా అనేవి మేలైన సంకర జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర మార్కెట్‌లో రూ. 75 వేల నుంచి లక్ష పైన పలుకుతాయి. గ్రేడెడ్‌ ముర్రా గేదెలు గోదావరి ప్రాంతాల్లో దొరుకుతాయి. ముర్రా జాతి గేదెలు హరియాణాలోని రోహ్‌హతక్, గుజరాత్‌లోని మెహసన ప్రాంతాల్లో దొరుకుతాయి. పాడి పశువు త్రికోణాకారంలో ఉండాలి. చురుకైన కళ్లు, మృదువైన చర్మం కలిగి ఉండాలి. పొదుగు నాలుగు భాగాలూ శరీరానికి అతుక్కొని, మృదువుగా, పెద్దవిగా, సమానంగా ఉండాలి. నాలుగు చనుమొనలు సమానంగా ఉండాలి. తొడలు దృఢంగా, కాళ్లు పొట్టిగా ఉండాలి. పొదుగుకు రక్తం సరఫరా చేసే పాల నరం స్పష్టంగా వకరలు తిరిగి ఉండాలి. కడుపు పెద్దదిగా విశాలంగా ఉండాలి.

రుణసదుపాయాలు..

పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. పాల వినియోగదారులైన హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులతోపాటు సమీప ప్రాంతాల్లోని సాధారణ పాల వినియోగదారులతో, పాల ఉత్పత్తిదారుల సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. పశుగ్రాస విత్తనాల విక్రయ కేంద్రాలతోనూ మంచి సంబంధాలను పెంపొందించుకోవాలి. పాడి పశువుల పెంపకాన్ని ప్రారంభించే బలహీన వర్గాల వారు రుణాలు, సబ్సిడీలపై సమాచారం కోసం దగ్గర్లోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను, సంబంధిత ప్రభుత్వ శాఖలు,కార్పొరేషన్ల అధికారులను సంప్రదించవచ్చు. నాబార్డు, డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ట్రైబల్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన వంటి సంస్థలను సంప్రదించాలి. జనరల్‌ అభ్యర్థులు బ్యాంకులను సంప్రదించి రుణం పొందవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 75% బ్యాంకు రుణంగా ఇస్తుంది.

అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేకుండా పాడి పశువులను లాభదాయకంగా పెంచుకోవచ్చు. డెయిరీ ఫారం ప్రారంభానికి 2–3 నెలలు ముందు నుంచే పశుగ్రాసాల సాగు చేపట్టాలి. పప్పుజాతి పశుగ్రాసాలు పావు వంతు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు ముప్పావు వంతు విస్తీర్ణంలో సాగు చేయాలి. గట్ల వెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబుల్, స్టైలో వంటి జాతుల చెట్లు పెంచుకోవాలి. పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్‌ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధికాదాయం పొందవచ్చు. అంతేకాదు.. పేడతో గోబర్‌ గ్యాస్, వర్మీ కంపోస్టు వంటివి తయారు చేయవచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం చేపట్టవచ్చు.