లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఐదు రాష్ట్రాల్లో పొత్తులు.. ఎత్తులు.. దూసుకెళ్తోన్న బీజేపీ.. కాంగ్రెస్ పరిస్థితేంటీ?

Published

on

రాజకీయాల్లో గెలవాలంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి.. కాంగ్రెస్‌తో కంపేర్ చేస్తే.. ఈ విషయంలో పక్కాగా ప్లానింగ్‌తో దూసుకెళ్తోంది భారతీయ జనతా పార్టీ. పొత్తులైనా.. ఆ తర్వాత ఎత్తులైనా.. చకచకా వేస్తూ.. ముందుకు సాగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ.. బెంగాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కమలం పార్టీ.

కలుపుకొని పోవడం అనేది రాజకీయాల్లో కామన్ పాయింట్.. కాగా.. బీజేపీ ఈ విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు.. మొండిగా ముందుకు సాగదు.. అందుకే చాలాసార్లు ఒంటరిగానే పోరుకు సిద్ధపడింది. పొత్తులు విషయంలో విజయం ముఖ్యం అన్నట్లుగా బీజేపీ ధోరణి ఉంటుంది. అందుకే పార్లమెంట్‌లో ఒక్క ఎంపీ ఉన్న పార్టీతోనైనా సరే.. సంబంధిత రాష్ట్రంలో పొత్తుకు సిద్ధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో కూడా పొత్తుకు ఏ మాత్రం వెనకాడలేదు. అయితే అధికారంలోకి వచ్చాక పొత్తు పెట్టుకున్న పార్టీనే తిప్పలు పెట్టడం బీజేపీ స్ట్రాటజీ.. అది వేరే సంగతి..

అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనూ ఇలాంటి వ్యూహాలనే సంధించేందుకు కమలం పార్టీ సిద్ధం అవుతోంది. ముఖ్యంగా బెంగాల్ ఎన్నికలు బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్ దక్కించుకునేందుకు అన్నిరకాల వ్యూహాలు వేస్తూ.. టీఎంసీని వీక్ చేసేందుకు ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మారుస్తూ బలపడుతోంది బీజేపీ. పశ్చిమ బెంగాల్‌ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ అన్నిరకాలుగా వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించగా.. రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. నడ్డా కాన్వాయ్ మీద దాడి ఘటన తర్వాత అక్కడి రాజకీయం మరింత రంజుగా మారిపోయింది.

ఆ తర్వాత అమిత్ షా పర్యటించడం.. టీఎంసీ నుంచి భారీగా వలసలు రావడంతో.. పొలిటికల్ పిక్చర్ ఒక్కసారిగా హీటెక్కింది. ఐతే ఇప్పుడు ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీంతో బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయ్. 2016 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకే పరిమితం అయిన బీజేపీ.. ఇప్పుడు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా టీఎంసీని బలహీనపరిచేందుకు.. ఆ పార్టీ నుంచి వలసలను ఆహ్వానిస్తోంది కాషాయ పార్టీ.

ఇక అటు ఎన్నికలకు సంబంధించి ఆరుగురు కేంద్రమంత్రులకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన బీజేపీ.. గెలుపు బాధ్యతలను వారి భుజాలపై పెట్టింది. వీరు తరచూ వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో 44స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. బెంగాల్‌‍లో ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఎంసీ అన్నట్లుగా యుద్ధం కనిపిస్తుందే తప్ప.. కాంగ్రెస్ ప్రస్తావనే లేదు. ప్రియాంకగాంధీకి బాధ్యతలు అప్పగించగా.. సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కానీ, ఆమె ప్రభావం అంతగా లేదనేది మెజారిటీ వర్గాల అభిప్రాయం.

ప్రతీ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేరింగ్ భారీగా పెరుగుతోంది. నిజానికి 2016 ఎన్నికల సమయంలో 75 నుంచి 80 సీట్లలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని అంతా భావించారు. కానీ, మూడు స్థానాలకే పరిమితం అయింది. ఐతే 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి బీజేపీ భారీగా పుంజుకుంది. 120 నియోజకవర్గాల్లో కమలం పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో 18 ఎంపీ స్థానాలను సొంతం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన బలంతో.. మరింత దూకుడు పెంచింది బీజేపీ. 2వందలకు పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి.. బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్తోంది.
.
ఇక తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తుతో బరిలోకి దిగుతోన్న బీజేపీ.. కేరళలో ఓటు షేర్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కనీసం అయిదు సీట్లనైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలో బీజేపీ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2006 తర్వాతే ఆ పార్టీ స్పష్టమైన బలం సంతరించుకుంది. కంగారుపడిపోయి అన్ని చోట్ల పోటీ చేసే బదులు.. పట్టున్నచోట్ల, బలం ఉంది అనుకున్న ప్రాంతాల్లో దృష్టిసారించాలని భావించింది. ఐతే ఇక ఎన్నికలకు కొద్దినెలల ముందు పుదుచ్చేరి పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయ్. వచ్చే ఎలక్షన్‌‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది కీ పాయింట్. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి.. కేరళ మినహా ప్రతీచోట ప్రధాన పోటీదారు బీజేపీ అనిపిస్తున్నా.. గతంలో కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ ప్రస్తావనే రావట్లేదు.

అవకాశం దక్కితే బీజేపీ ఎలా దూసుకుపోతుందో.. కాంగ్రెస్‌కు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. అందుకే కేరళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ స్వయంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. బీజేపీ బలం పుంజుకోకుండా.. తమ బలం పెరిగేలా వ్యూహాలు వేస్తున్నారు. కాంగ్రెస్ ఎంతవరకూ సక్సెస్ అవుతుంది అనేదానిపై అనుమానాలు చాలా ఉన్నాయి. సరైన నాయకత్వం లేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన సమస్యగా మారిందని.. కరెక్ట్ లీడర్‌ను ఎన్నుకొని పార్టీ క్షేత్రస్థాయిలో ఉత్సాహం నింపాల్సిన అవసరం ఉందని, లేదంటే హస్తం పార్టీ భవిష్యత్ మరింత ప్రమాదకరంగా మారే చాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.