Home » ‘సత్యం’కు షాక్.. గ్లాండ్ ఫార్మాలో వాటా ఈడీ చేతికి..
Published
3 months agoon
By
sreeharigland pharma ipo ed : హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఔషధ కంపెనీ గ్లాండ్ ఫార్మా వచ్చేవారంలో ఐపీఓకు వెళ్తోంది. సుమారు 6వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఐపీఓకు వెళ్తున్న తొలి ఫార్మా కంపెనీగా గ్లాండ్ ఫార్మా చరిత్రను సృష్టించబోతోంది. ఇప్పటికే గ్లాండ్ ఫార్మా ఐపీఓకు సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా సెబీ నుంచి అనుమతి కూడా లభించింది.
దీంతో ఐపీఓకు సంబంధించి వ్యవహారాల్లో కంపెనీ నిమగ్నమైంది. ఈ కంపెనీలో సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడైన రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు స్థాపించిన పది కంపెనీలకు 3.87 శాతం వాటా ఉంది. సత్యం కుంభకోణం వెలుగుచూసిన తర్వాత ఈ షేర్లను 2010లో ఆగస్టులో ఈడీ అటాచ్ చేసింది. ఈ షేర్లను బదిలీ చేయడం లేదా విక్రయించడం లేదా తొలగించడం చేయరాదని అప్పట్లోనే ఈడీ ఆదేశించింది.
ప్రస్తుతం.. గ్లాండ్ ఫార్మా ఐపీఓకు వెళ్తున్న నేపథ్యంలో ఈడీ మరోసారి రంగంలోకి దిగింది. సత్యం రామలింగ రాజుకు చెందిన షేర్లను తమకు బదలాయించాలని గ్లాండ్ ఫార్మాకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకూ తమ అటాచ్ మెంట్లో ఉన్న షేర్లను తమ డిమ్యాట్ ఖాతాకు బదిలీ చేయాలని సూచించింది.
గ్లాండ్ ఫార్మాలో సత్యం కుటుంబీకులకు 6 లక్షల షేర్లు ఉన్నాయి. అయితే ఇటీవల గ్లాండ్ ఫార్మా పది రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న షేర్లను ఒక రూపాయి ఫేస్ వాల్యూ మార్చి పది షేర్లుగా విభజించింది.
దీంతో సత్యం కుటుంబీకుల షేర్లు 60 లక్షలకు పెరిగాయి. ఈ షేర్లన్నింటిని తమకు బదిలీ చేయాలని ఈడీ లేఖ రాయడంతో అందుకు అనుగుణంగా వ్యవహరించినట్టు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. సత్యం కంపెనీ దివాలా తీసి పదేళ్లు అవుతున్నా ఆ వ్యవహారం ఇంకా రామలింగరాజును వెంటాడుతూనే ఉంది.