లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

గెలుపెవరిది? పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై పార్టీల గురి

Published

on

GRADUATES MLC ELECTIONS: నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం 2021 మార్చిలో ఖాళీ కానుంది. కానీ, ఇప్పటి నుంచే కాన్‌సంట్రేషన్‌ చేస్తున్నాయి పార్టీలు. పట్టభద్రుల ఓట్ల నమోదు, ఎన్నికల్లో పోటీ అంశాలపై ఆయా పార్టీల్లో చర్చ మొదలైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలుపెట్టింది అధికార టీఆర్ఎస్‌ పార్టీ.

తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఇన్‌చార్జ్‌గా నియమించిందని టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమ ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి క్షేత్రస్థాయిలో అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు.

ఈసారి కూడా పల్లానే బరిలో ఉంటారా?
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ కోసమే ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, తాను పోటీలో ఉంటున్నానని ప్రకటించారు. వీరే కాకుండా పార్టీలతో నిమిత్తం లేకుండా మరికొందరు కూడా స్వతంత్రంగా ఈ స్థానం నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయనే బరిలో ఉంటారా? లేక మరో అభ్యర్థి తెరపైకి వస్తారా? అన్న చర్చ గులాబీ శిబిరంలో జోరుగా సాగుతోంది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నా.. అధిష్టానం మాత్రం ఆయన్నే బరిలో ఉండాలంటూ అడుగుతున్నట్లు ఆ పార్టీ నేతలు లీకులిస్తున్నారు.

అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపినా.. విజయమే లక్ష్యం:
టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపినా.. విజయమే లక్ష్యంగా పని చేసేందుకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రులను సమాయత్తం చేయడం.. ఓటర్లుగా నమోదు చేయించడంపై నాయకత్వం దృష్టి పెట్టిందని చెబుతున్నారు.

టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా తిరిగి పల్లా రాజేశ్వర్‌ రెడ్డినే కొనసాగిస్తుందా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తుందా అన్న విషయంపై పార్టీ వర్గాల్లోనూ స్పష్టత లేదు. కొత్తవారికి అవకాశం ఇస్తే మాత్రం తమ అదృష్టం పరీక్షించుకునేందుకు.. ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పోటీ పడుతుందా? లేదా?
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీలో ఉంటారన్నది ఇంకా తేటతెల్లం కాలేదు. అసలు ఆ పార్టీ పోటీ పడుతుందా? ఎవరికైనా మద్దతు ఇస్తుందా అన్న విషయం తేలాల్సి ఉందంటున్నారు. జిల్లా నుంచి ఇప్పటి వరకూ ఒక్కరి పేరూ కనీస ప్రచారంలోకి లేదు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఈ నియోకవర్గం నుంచి పోటీకి ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతు ఇచ్చేదీ లేనిదీ అన్న విషయాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ తేల్చడం లేదు. ప్రస్తుతం పట్టభద్రుల్లో అధికార పార్టీపై కొంత వ్యతిరేకత ఉందని, బలమైన అభ్యర్థి బరిలో నిలిస్తే కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశం ఉంటుందని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది.

బరిలో రాణిరుద్రమ:
మరోవైపు ఈ ఎన్నికల్లో తమ గెలుపునకు కలసివచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయని టీఆర్‌ఎస్, కాంగ్రెసేతర పార్టీల నాయకులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ పోటీపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే కోదండరామ్‌కు మద్దతు కూడగట్టే పనిలో టీజేఎస్‌ పార్టీ నేతలున్నారని అంటున్నారు. ఉమ్మడి జిల్లాకే చెందిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తమ పార్టీ అభ్యర్థిగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమను పోటీకి పెట్టనున్నామని ప్రకటించారు. దీంతో ఈ పార్టీల్లోనూ హడావుడి మొదలైంది.

పోటీపై స్పష్టత ఇవ్వని సీపీఎం, సీపీఐ, బీజేపీ:
సీపీఎం, సీపీఐ, బీజేపీల నుంచి కూడా పోటీపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ మూడు జిల్లాల్లో వామపక్షాలకు కొంత బలం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీల మద్దతు కూడా కీలకమనే భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలుపుతుందా.. లేక ఇతరులకు మద్దతిస్తుందా అన్న క్లారిటీ వచ్చిన తర్వాతే విపక్ష అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు.

ఇక్కడ నుంచి ప్రతిసారి టీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థే విజయం సాధిస్తుండగా.. ఈసారి మాత్రం అధికార పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. విపక్షాల నడుమ ఏకాభిప్రాయం రాకుండా.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం.. టీఆర్ఎస్ మద్దతుదారుడిదే విజయమని భావిస్తున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *