కరోనా లేకపోతే ఆందోళన చేసేవాడిని, డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పుపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

amanchi krishna mohan sensational comments on highcourt

విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ సుధాకర్ తరపున వేసిన పిటిషన్‌ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదన్నారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ విచారణకు ఆదేశించటపై రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. కోర్టు సామాన్య విషయాలకు సైతం సీబీఐ విచారణకు ఆదేశిస్తుంటే ప్రతి పోలీస్టేషన్ ఉన్న చోట కేంద్రం సీబీఐ ఆఫీసును ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోంది:
డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అన్నారు ఆమంచి. ఆ కేసుపై సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందని.. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని.. కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందన్నారు. కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడిని అన్నారు. చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణకు ఆదేశించడం సరికాదన్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి నేటికి ఏడాది. ఈ సందర్భంగా చీరాలలో వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఆమంచి ఈ వ్యాఖ్యలు చేశారు.

కోర్టుల తీర్పులపై వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన జనసేన:
న్యాయస్థానాల తీర్పులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఖండించింది. ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలు సరికాదని జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు అన్నారు. హైకోర్టు తీర్పులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తోందన్నారు. న్యాయస్థానాలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.

డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి:
విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. డాక్టర్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

డాక్టర్ పై జరిగిన దాడికి సంబంధించి.. గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు విశాఖ సెషన్స్ జడ్జి. శుక్ర‌వారం ఈ కేసును విచారించిన హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో ఆ గాయాల ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రభుత్వ నివేదికపై అనుమానాలు ఉన్నాయని.. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించామని కోర్టు చెప్పింది.

 

మరిన్ని తాజా వార్తలు