“ఆన్‌లైన్ ఫార్మసీ” : అమెజాన్‌ ద్వారా మెడిసిన్స్ డెలివరీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య సేవల రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. వైద్య సలహాలు, చికిత్స, పరీక్షలు, మందుల సరఫరా తదితర సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

భారత్ వ్యాప్తంగా ఔషధాలను కూడా ఆన్ లైన్ లో విక్రయించాలని తాజాగా అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమెజాన్ తాజాగా ఆన్‌లైన్ ఫార్మసీని ప్రారంభించింది. ‘అమెజాన్‌ ఫార్మసీ’ పేరుతో తాము ఆన్‌లైన్‌ ఔషధ సరఫరా చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తమ ఆన్‌లైన్‌ ఫార్మసీ సేవలను ఇప్పటికే బెంగళూరులో ప్రారంభించామని.. త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరించే యత్నాల్లో ఉన్నామని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్ మొదలైన కంపెనీల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు అమెజాన్ ఈ ఫార్మసీని మొదలుపెట్టింది.

”ప్రజల అవసరాలను సకాలంలో తీర్చాలనే సంకల్పంలో భాగంగా మేము బెంగళూరులో అమెజాన్‌ ఫార్మసీ సౌకర్యాన్ని ప్రారంభించాం. దీని ద్వారా వినియోగదారులకు సాధారణ వైద్య పరికరాలు, ఆయుర్వేద మందులతో పాటు వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం ఔషధాలు కూడా అందజేస్తాం. కరోనా కట్టడికి ప్రజలు ఇంటికే పరిమితమవుతున్న ఈ అత్యవసర ప్రస్తుత పరిస్థితిలో.. మా సేవలు వారికి మరింత ఉపయోగకరంగా ఉండగలవని భావిస్తున్నాం” అని అమెజాన్‌ తన ప్రకటనలో పేర్కొంది.

ఆన్‌లైన్ లో ఔషధ అమ్మకాలకు సంబంధించి అమెజాన్ ఇంకా ఎటువంటి నిబంధనలను ఖరారు చేయలేదు. మెడ్‌లైఫ్, నెట్‌మెడ్స్, టెమాసెక్-బ్యాక్డ్ ఫార్మ్‌ఈజీ మరియు సీక్వోయా క్యాపిటల్-బ్యాక్డ్ 1 ఎంజి వంటి అనేక ఆన్‌లైన్ సంస్థలు.. సాధారణ మెడికల్ షాపుల వ్యాపారాన్ని దెబ్బతీశాయి. దాంతో ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల అసోసియేషన్లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల సరైన ధృవీకరణ లేకుండా మందుల విక్రయానికి దారితీస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. అయితే తాము భారత చట్టాలకు కట్టుబడి ఉన్నామని.. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వమని కంపెనీలు తెలిపాయి.

అమెజాన్ యొక్క కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మేం మా వ్యాపారాన్ని కోల్పోతాం. ఆఫ్‌లైన్ మందుల వ్యాపారంపై 5 మిలియన్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి’ అని న్యూఢిల్లీలోని సౌత్ కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ లీగల్ హెడ్ యష్ అగర్వాల్ తెలిపారు.

Related Posts