లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

మానవత్వపు పంట: కోతకోస్తుండగా రైతుకు గుండెపోటు..రైతన్నలంతా ఒక్కటై ఏం చేశారో చూడండీ

Published

on

కష్టంలో ఉన్న రైతుకు మేమున్నామని అండగా నిలిచారు తోటి రైతులు. నీకు కష్టమొస్తే మాకు వచ్చినట్లేనన్నారు. నీకేమీ కాదు..నువ్వు కష్టపడి పండించిన పంటను వృథాకానివ్వం..అంటూ సాటి రైతులు చేయి చేయి కలిపి ముందుకొచ్చారు. మానవత్వానికి ప్రతీకలా నిలిచే ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ రైతు గుండెపోటుకు గురై ఆసుపత్రిపాలయ్యాడు. కోతకొచ్చిన పంట కోసే దిక్కులేదు. సకాలంలో పంట కోయకపోతే కష్టపడి పండించిన పంట అంతా వృథా అయిపోతుంది. అంతేకాదు ఆ రైతు అప్పులపాలైపోతాడు. దీంతో తోటిరైతులంతా ఆ రైతును ఆదుకోవటానికి ముందుకొచ్చారు. నీకేం ఫరవాలేదు…ఆరోగ్యంగా ఇంటికొస్తావ్..అలాగే కష్టం విలువ తెలిసినవాళ్లం నీ పంటను వృథా కానివ్వం అంటూ ఆ పంట కోయటానికి రైతన్నలంతా కదిలివచ్చారు.


1000 ఎకరాల్లో గోధుమ పంట కోతలు ఆగిపోయాయి. సకాలంలో పంట కోయకపోతే తీవ్ర నష్టాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సాటి రైతులు చేయి చేయి కలిపి ఆ రైతుకు సంఘీభావం ప్రకటించారు. తమ సాధన సంపత్తిని ఆ రైతు పొలంలో మోహరించి కేవలం 7 గంటల్లో 1000 ఎకరాల పంట కోసి ఆ రైతు కుటుంబంలో ఆనందం నింపారు.


అమెరికాలోని నార్త్ డకోటాలో క్రాస్బీ వద్ద లేన్ ఉన్హీమ్ అనే రైతు 1000 ఎకరాల పొలంలో గోధుమ, కనోలా (ఆవజాతి గింజలు) పండిస్తున్నాడు. చేతికొచ్చిన పంట కోస్తుండగా ఓ యంత్రం కాలిపోయింది. దీంతో అతను గుండె ఒత్తిడికి గురై గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఉన్హీమ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పంట కోత మధ్యలోనే ఆగిపోవడంతో ఉన్హీమ్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఏర్పడింది. ఓ పక్క పంట కోసే యంత్రం కాలిపోయింది..ఉన్హీమ్ ఆస్పత్రి పాలయ్యాడు. కష్టపడి పండించిన పంట ఏమైపోతుందోనని మధనపడిపోయారు. హాస్పిటల్ లో ఉన్న ఉన్హీమ్ ను కూడా అదే ఆందోళన వెంటాడి కోలుకోలేకపోతున్నాడు. దీంతో సాటి రైతన్నలంతా ఉన్హీమ్ కు..అతని కుటుంబానికి భరోసా ఇచ్చారు. పంటను మేం కోస్తాం..మీ కష్టాన్ని మీకు దక్కిస్తాం ఆందోళన పడొద్దు అని ధైర్యం చెప్పారు.


వెయ్యి ఎకరాల పంట కోయటమంటే మామూలు విషయం కాదు. కానీ ఇరుగుపొరుగు రైతుల మానవీయ దృక్పథంతో ముందుకు రావటంతో ఉన్హీమ్ తో పాటు అతని కుటుంబం కూడా కాస్త కుదుటపడింది. అలా సుమారు 60 మంది రైతులు తమ సాటి రైతు కోసం మద్దతుగా నిలిచారు. తమ వద్ద ఉన్న పంటకోత యంత్రాలను ఉన్హీమ్ పొలానికి తీసుకొచ్చి.. 7 గంటల్లోనే పంట మొత్తం కోసి భద్రం చేశారు. 11 కంబైన్ హార్వెస్టర్లు, ఆరు ధాన్యపు బండ్లు, 15 ట్రాక్టర్ ట్రెయిలర్లు ఉపయోగించి పంటను భద్రం చేశారు.


ఆ సమయంలో పంటను కోయకపోతే ఉన్హీమ్ కుటుంబం పూర్తిగా పంటను కోల్పోయి అప్పుల పాలైపోతుందని భావించిన ఆ రైతులు మానవత్వంతో పెద్ద మనస్సుని చాటుకున్నారు. పంట పండించటానికి రైతు ఎంత కష్టపడతాడో..ఎంత తపన పడతాడో..చేతికొచ్చిన పంట నాశనం అయితే ఎంత క్షోభిస్తాడో తెలిసినవారు..అందుకే తాము ఉన్హీమ్ కుటుంబానికి సాయపడ్డామని రైతులు తెలిపారు.


ఉన్హీమ్ ఎంతో మంచి వ్యక్తి అని..తమ ప్రాంతంలో ఉన్హీమ్ కుటుంబ సభ్యులు ఎంతో సహృదయులన్న పేరు ఉందని..అటువంటివారికి కష్టం వస్తే మేమెలా వదిలేస్తాం..మేమున్నాం..మా ఉన్హీమ్ కు..వారి కుటుంబానికి అని తెలిపారు. ఉన్హీమ్ కుటుంబానికి సహాయం చేసే అవకాశం మాకు వచ్చిందని అతని మంచి మనస్సుకు ఎప్పుడూ మంచే జరుగుతుందని ఉన్హీమ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకుని ఇంటికి వస్తాడని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. వారికి సహాయం చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని ఉన్హీమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ జెన్నా బిండే తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *