పొలంలో రైతుకి దొరికిన రూ.కోటి విలువ చేసే వజ్రంపై పోలీసుల విచారణ

anantapur farmer found one crore valued diamond in farmland

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతాపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికిందని, దాని విలువ కోటి రూపాయలు ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రైతుని మోసం చేసిన వజ్రాల వ్యాపారి దాన్ని రూ.30లక్షలకే కొనుగోలు చేశాడని మీడియాలో కథనాలు వచ్చాయి. వజ్రం విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. శుక్రవారం(మే 23,2020) విచారణ చేపట్టారు. తహసీల్దార్‌ బ్రహ్మయ్య, సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాలతో సిబ్బంది విచారణ జరుపుతున్నారు. ముందుగా వారు వజ్రం చిక్కిన రైతు ఇంటికి వెళ్లారు.

వజ్రం దొరికిందని ఒప్పుకున్న రైతు కుటుంబం, తాను కొనలేదంటున్న వ్యాపారి:
అయితే వజ్రం చిక్కిన రైతు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించారు. అలాగే రైతు నుంచి వజ్రాన్ని కొనుగోలు చేసిన వ్యాపారి, మధ్యవర్తులను తహసీల్దార్‌ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. వజ్రం ఎప్పుడు, ఎక్కడ దొరికింది.. ఎంతకి విక్రయించారు? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వజ్రం చిక్కినట్లు రైతు కుటుంబీకులు ఒప్పుకున్నారు. కొనుగోలు చేసిన వ్యాపారి మాత్రం తాను ఎలాంటి వజ్రమూ కొనుగోలు చేయలేదని అధికారులతో చెప్పాడు. దీంతో అధికారులు మరింత లోతుగా దర్యాఫ్తు చేపట్టారు.

సేద్యం పనులు చేస్తుండగా దొరికిన వజ్రం:
గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామంలో నాలుగు రోజుల క్రితం ఓ రైతుకు విలువైన వజ్రం చిక్కిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ శివారులో ఊటకల్లుకు వెళ్లే దారిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి భూమి పదును కావడంతో రైతు సేద్యం పనులు చేశాడు. గుంటకతో భూమిని దున్నడంతో ఓ వజ్రం చిక్కింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులతో కలిసి వజ్రాన్ని కర్నూలు జిల్లా పెరవలిలో విక్రయించేందుకు ప్రయత్నించగా అక్కడ ధర దగ్గర తేడా వచ్చింది. దీంతో గుత్తి ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి రూ.30 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. కాగా ఆ వజ్రం రూ.కోటికి పైగా ధర ఉంటుందని సమాచారం. మధ్యవర్తులు వజ్రాల వ్యాపారితో కుమ్మక్కై రైతుకు తక్కువ ధర ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

Read: రాష్ట్రంలో రాకపోకలకు అనుమతులు అవసరం లేదు : డీజీపీ గౌతం సవాంగ్

మరిన్ని తాజా వార్తలు