ఒకరు వ్యవసాయం, మరొకరు వ్యాపారం, ఇంకొకరు మౌనం.. దయనీయ స్థితిలో ఏపీ కాంగ్రెస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. కొంత మంది నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అయితే, మరికొంతమంది మాత్రం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ అంత చురుకుగా కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకపోవడంతో నేతలు పార్టీ కార్యాలయ గుమ్మం ఎక్కడమే మానేశారు. ఒకాయన వ్యవసాయం చేసుకుంటుంటే.. మరికొందరు వ్యాపారాల్లో, ఇంకొందరు అధిష్టానానికి సలహాలివ్వడంలో బిజీగా ఉన్నామంటూ కలరింగ్ ఇస్తున్నారట. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊసే జనాలు మరచిపోతున్నారట.

పార్టీ అసలు ఉందా లేదా అనుమానంలో జనం:
పార్టీలో మిగిలిన అరకొర సీనియర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోవడంతో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏదో సమస్యపై పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కానీ ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ మాత్రమే అప్పుడప్పుడు స్పందిస్తున్నారు తప్ప పార్టీ తరఫున ఇతర నేతలెవరు నోరు విప్పడం లేదు. పార్టీ సీనియర్ల వైఖరి పట్ల కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు సీరియస్‌ అవుతున్నారట.

వ్యవసాయ పనులు చేసుకుంటున్న మాజీ చీఫ్:
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన సొంత నియోజకవర్గంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవితం గడిపేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలపై కానీ, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒకటి ఉంది.. వారికి సలహాలు ఇవ్వడం లాంటి వాటిపై కనీసం దృష్టి కూడా పెట్టడం లేదు.

పార్టీ సింబల్ మాత్రం దగ్గర పెట్టుకొని ఆయన కనబడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన పల్లంరాజు, జేడీ శీలం, చింతా మోహన్, కనుమూరి బాపిరాజులదీ అదే పరిస్థితి. ఎన్నికల తర్వాత పార్టీలో ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఎవరి దారి వారు చూసుకొనే పనిలో ద్వితీయ శ్రేణి కేడర్‌:
మరోపక్క, చింతా మోహన్ ఏపీసీసీ చీఫ్‌ పదవి రాలేదన్న బాధలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొంతమంది పార్టీలో ఇదే విషయాన్ని లేవనెత్తితే కరోనా కదా.. వయసు మీద పడింది.. అందుకే కనబడడం లేదని సెటైర్లు వేసుకుంటున్నారు.

సీనియర్లంతా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటే ద్వితీయ శ్రేణి కేడర్ కూడా ఎవరి దారి వారు చూసుకొనే పనిలో పడ్డారట. ఇప్పుడు వారందరినీ కలుపుకొని పోయేందుకు శైలజానాథ్‌ కిందా మీదా పడుతున్నారని అంటున్నారు. మరి ఏపీలో తలపండిన కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కేడర్‌లో జోష్ నింపుతారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.


Related Posts