ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా: గవర్నర్‌కు కోవిడ్-19 పరీక్షలు

ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా: గవర్నర్‌కు కోవిడ్-19 పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విస్తతంగా విస్తరిస్తుంది. అయితే లేటెస్ట్‌గా కరోనా వైరస్ ఏపీ రాజ్‌భవన్‌ను కూడా తాకింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కార్యాలయంలో పనిచేసే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆ నలుగురూ కూడా రాజ్ భవన్ ఆఫీసు లోపల పనిచేసే ఉద్యోగులు అని తెలుస్తుంది.

కరోనా సోకిన వారిలో ఒకరు గవర్నర్ హరిచందన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అతనితో పాటు మెడికల్ స్టాఫ్(ఓ నర్స్), ఓ బట్లర్, హౌస్ కీపింగ్ స్టాఫ్‌కు కూడా వైరస్ సోకిందని, దీంతో తమకు కూడా పరీక్షలు చేయాలని గవర్నర్ స్వయంగా కోరారని రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది.

ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే రాజ్ భవన్‌లోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని క్వారంటైన్ చేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ చెబుతున్నారు.

రాజ్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న వారిలో ఎవరినీ లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత బయటకు వెళ్లేందుకు అనుతించలేదని వెల్లడించిన అధికారులు, వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు.