సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం..భక్తులకు నో ఎంట్రీ..youtube లో లైవ్

ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న...

సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం..భక్తులకు నో ఎంట్రీ..youtube లో లైవ్

ఉత్తరాంధ్ర ఇలవేల్పు దేవం సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.  ఏడాదంతా చందనంతో కప్పబడి ఉన్న సింహాద్రి అప్పన్న… వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం భక్తులకు నిజరూప దర్శనం ఇస్తాడు.  స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు, పీఠాధిపతులు, రాజకీయనేతలు ఉదయం నుంచే బారులు తీరుతారు. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బతో అప్పన్న నిజరూప దర్శనం భక్తులకు కరువైంది.

కరోనా వైరస్‌ దేవుళ్లనూ వదలడం లేదు. కరోనా మహమ్మారి సింహాచల అప్పన్నపైనా ప్రభావం చూపుతోంది. దీంతో 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం జరుగనున్న అప్పన్నస్వామి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లేకుండా పోయింది. అప్పన్నస్వామి దేవాలయ చరిత్రలో నిజరూప దర్శనం భక్తులకు లేకపోవటం ఇదే తొలిసారి. చందనోత్సవం రోజున స్వామికి సమర్పించే మూడు మణుగుల చందనంలో అర్చక స్వాములు  సుగంధ ద్రవ్యాలు మిళితం చేశారు.

తెల్లవారుజాము నుంచే చందనోత్సవం కేవలం అర్చకులతో ప్రారంభమయ్యింది.  భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలను కూడా కొండపైకి అనుమతించేది లేదని ఇప్పటికే ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో వైదిక సిబ్బందితో చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు సింహగిరికి వెళ్లే రెండు ఘాట్‌రోడ్లు, మెట్లమార్గం, మాధవధార మెట్ల మార్గాలను మూసివేసారు…

వేకువజామున రెండున్నరకు  సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపి రుత్విగ్వరుణం జరిపించారు. ప్రతిఎటా వేదపండితుల మద్య ఆలయ అను వంశిక ధర్మకర్తలయిన పివిజిరాజు వారసులు స్వామి వారికి తొలిపూజ నిర్వహించేవారు..అయితే ధర్మకర్తల మండలి నుండి చైర్మన్‌గా ఉన్న ఆశోక్ గజపతిని తప్పించి… ఆ పదవిని  సంచయిత గజపతికి కట్టపెట్టారు..ఈ సారి సంచయిత గజపతి పట్టువస్త్రాలు సమర్పించి.. తొలిపూజ నిర్వహించారు. అనంతరం స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమయ్యింది.

స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓరిస్సా, జార్ఖండ్ ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుండి కుడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. చందనోత్సవానికి సంబంధించి రెండు వారాల పాటు హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు.  కేవలం పరిమిత సంఖ్యలతో ఈ చందనోత్సవం జరుగుతోంది. ఆలయ చరిత్రలో ఎన్నడు లేని విధంగా కేవలం యుట్యూబ్‌ లైవ్ ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు ప్రత్యేక పూజలు, గోత్రనామాలు, పూజలవంటికి చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లిస్తే… వారి పేరిట పూజలు నిర్వహించి  ఇంటికే ప్రసాదం పంపిస్తున్నారు.