మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్..మచిలీపట్నం సబ్ జైలుకు తరలింపు

  • Published By: bheemraj ,Published On : July 4, 2020 / 11:49 PM IST
మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్..మచిలీపట్నం సబ్ జైలుకు తరలింపు

టీడీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసు మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర మెడకు చుట్టుకుంది. రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. భాస్కర్ రావు హత్య కేసులో నిందితులైన ఐదుగురు…కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మర్డర్ చేశామని వాగ్మూలం ఇచ్చారు. దీంతో పోలీసులు శుక్రవారం తులిలో కొల్లు రవీంద్రను 6. 30 గంటలకి అరెస్ట్ చేశారు.

కొల్లు రవీంద్రను కఠినంగా శిక్షించాలని భాస్కర్ రావు బంధువులు, వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రవీంద్రపై అక్రమ కేసులు బనాయించారని టీడీసీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ కక్ష్య సాధింపులో భాగంగానే కొల్లు రవీంద్రను మర్డర్ కేసులో ఇరికించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఆధారాలు పక్కగా ఉన్నందునే ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరికొంత మందిని అరెస్ట్ చేయబోతున్నామని కూడా చెప్పారు.

మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ పై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. మోకా భాస్కరరావు హత్య కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. పథకం ప్రకారమే భాస్కరరావు హత్య జరిగిందన్నారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర భాగస్వామి అని చెప్పారు. మోకా హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల కాల్ డేటా పరిశీలించాకే వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. 2013 నుంచే భాస్కరరావుని చంపాలని ప్లాన్ చేశారని ఎస్పీ చెప్పారు.

భాస్కరరావు కదలికలపై నిఘా వేసిన ప్రత్యర్థులు, హత్యకు 5 రోజుల ముందు నుంచే రెక్కీ నిర్వహించారని ఎస్పీ చెప్పారు. భాస్కరరావు హత్య కేసులో నిందితుల వాంగ్మూలం తీసుకున్నామన్నారు. హత్యకు ముందు నాంచారయ్య, కొల్లు రవీంద్ర మాట్లాడుకున్నారని ఎస్పీ తెలిపారు. భాస్కరరావుని చంపకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన నిందితులు పథకం ప్రకారమే మర్డర్ చేశారని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో తన పేరు బయటకు రాకుండా చూడాలని కొల్లు రవీంద్ర కోరినట్టు పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు నాంచారయ్య కొల్లు రవీంద్రకు ప్రధాన అనుచరుడు. మర్డర్ ప్లాన్ అమలు చేయడానికి 5 రోజుల ముందు నుంచి తనకు ఫోన్ చేయొద్దని కొల్లు రవీంద్ర నాంచారయ్యతో చెప్పినట్టు విచారణలో తెలిసిందని ఎస్పీ చెప్పారు. తన ఫోన్ కు కాకుండా తన పీఏల ఫోన్లకు కాల్ చేస్తే తాను మాట్లాడతానని కొల్లు రవీంద్ర చెప్పినట్టు ఎస్పీ తెలిపారు. హత్యకు ముందు ఒకసారి, హత్య తర్వాత మరోసారి కొల్లు రవీంద్ర పీఏ ఫోన్ కి నాంచారయ్య కాల్ చేసినట్టు విచారణలో కనుగొన్నామని ఎస్పీ చెప్పారు.

ప్రధాన నిందితుడు నాంచారయ్య, మృతుడు భాస్కరరావు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో, దాదాపు ఎనిమిదేళ్లుగా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. భాస్కరరావు బతికున్నంత వరకు తనకు రాజకీయ మనుగడ ఉందడని భావించి 4 నెలల నుంచి భాస్కరరావు హత్యకు ప్లాన్ చేశారని అన్నారు.