Kurnool RTC : ఎవరిది బంగారం, ఆర్టీసీ బస్సులో 148 బంగారు బిస్కెట్లు

కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.

Kurnool RTC : ఎవరిది బంగారం, ఆర్టీసీ బస్సులో 148 బంగారు బిస్కెట్లు

SEB seizes

148 gold biscuits : కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు… ఒకతని బ్యాగ్‌లో బంగారు బిస్కట్లు గుర్తించారు. అతనిని ప్రశ్నిస్తే బంగారం రవాణాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో.. గోల్డ్‌ బిస్కట్లును సీజ్‌ చేశారు అధికారులు.

మొత్తం 148 బంగారు బిస్కెట్లు ..ఒక్కో బిస్కట్‌ 100 గ్రాముల బరువుంది. సీజ్‌ చేసిన 14 కేజీల 800 గ్రాముల బంగారం విలువ 6 కోట్ల 80 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మిద్దె రాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అబిడ్స్‌లోని ఓ జ్యూయల్లరీ షాపు నుంచి తాడిపత్రికి పట్టుకెళ్తున్నట్లు చెప్పాడతడు. తాను రాయలసీమ బులియన్‌ కమ్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నానని, యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాలతో బంగారం తీసుకెళ్తున్నట్లు చెప్పాడు.

బంగారం బిస్కెట్లకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నిందితుడిపై కర్నూలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు సేల్స్, కస్టమ్స్‌, ఇన్‌కంటాక్స్‌ అధికారులకు లేఖలు రాశారు. ఆయా శాఖల విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద వాహన తనిఖీలు ఎల్లప్పుడూ జరుగుతాయన్నారు కర్నూలు డీఎస్పీ కె.వి.మహేష్. పక్కా సమాచారం ఉన్నా లేకపోయినా నిఘా కొనసాగుతుందన్నారు.