News : తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా

తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా

News : తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా

News

20 Top News :
1. హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు :-

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మంది ఎలిమినేట్ అయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 91, భాజపా అభ్యర్థి రామచందర్‌రావుకు 65, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 54, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31 ఎలిమినేషన్‌ ఓట్లు జమ అయ్యాయ్‌.

దీంతో ఇప్పటి వరకు సురభి వాణీదేవికి లక్షా 12వేల 780 ఓట్లు లభించగా.. రామచందర్‌రావుకు లక్షా 4వేల 733, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 53వేల 664, చిన్నారెడ్డికి 31వేల 585 ఓట్లు వచ్చాయ్‌. అభ్యర్థి విజయానికి లక్షా 68వేల 520 ఓట్లు రావాల్సి ఉంది. మరోవైపు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం తలెత్తడంతో సిబ్బంది కాసేపు లెక్కింపు నిలిపివేశారు. ఆ తర్వాత ఆర్వో ఆదేశాలతో మళ్లీ కొనసాగిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతం ఓట్లు దాటక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రేపు రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.

నల్గొండ – వరంగల్‌ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. ఉదయానికే మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏ అభ్యర్థికీ 50శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇప్పటి వరకు 52 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఎలిమినేషన్‌ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు జమ చేస్తున్నారు.

2. అసైన్డ్ భూముల కేసు : –
ఏపీ రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు నాలుగు వారాల స్టే విధించింది. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి అధికార పక్షం కేసు పెట్టిందని, అందుకే అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని కోర్టును కోరారు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఐడీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు.

చంద్రబాబు, నారాయణపై నమోదు చేసిన కేసులో ఆధారాలు చూపించాలని సీఐడీని ఆదేశించింది హైకోర్టు. కేసు ప్రాథమిక విచారణలో ఏం గుర్తించారని ప్రశ్నించింది. దీనిపై సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ విచారణ తొలిదశలో వివరాలు చెప్పలేమని.. పూర్తిస్థాయి విచారణకు అనుమతిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సీఐడీ విచారణపై నాలుగు వారాల స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

3. అసైన్డ్ భూములు, దర్యాప్తు : –
మరోవైపు.. అమరావతి అసెన్డ్‌ భూముల అవకతవకలపై ఇవాళ కీలక వివరాలను సేకరించింది సీఐడీ. రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో అధికారుల పాత్రపై ఆరా తీసింది. అప్పటి గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అసైన్డ్‌ భూముల సేకరణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు.

ఇక.. భూముల విషయంలో తమను ఎవరూ బెదిరించలేదంటున్నారు రాజధాని ప్రాంత దళిత రైతులు. ఇవాళ తాడేపల్లి పీఎస్‌లో రైతులు సీఐడీ విచారణకు హాజరయ్యారు. మందడం సహా పలు గ్రామాల దళిత రైతులు సీఐడీ విచారణకు వచ్చారు. రాజధానికి స్వచ్ఛందంగానే భూములు ఇచ్చామని.. తమ వద్ద భూములు ఎవరూ లాక్కోలేదని… తమను ఎవరూ బెదిరించలేదని విషయాన్ని రైతులు సీఐడీకి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే.. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని వివరించారు.

రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు… సీఐడీ కేసు నమోదు చేసింది. ఆళ్లను నిన్న విచారణకు పిలిచిన సీఐడీ ఆధికారులు.. ఆయన దగ్గర ఉన్న ఆధారాలను తీసుకున్నారు.

4. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, నేతలతో సీఎం జగన్ భేటీ : –
తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికపై నేతలతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. ఇప్పటివరకూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతీ గడపకూ తీసుకెళ్లాలని.. ఆయన నాయకులకు సూచించారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలుండాలన్న ఆయన.. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీ తమ మెసేజ్‌లా ఉండాలని చెప్పారు. ప్రతీ నియోజికవర్గానికి ఒక మంత్రి ఇన్‌చార్జ్‌గా ఉంటారని, వారికి అదనంగా ఒక ఎమ్మెల్యే ఉంటారని చెప్పారు. గత ఎన్నికల ఫలితాలతో నేతలకు అతి విశ్వసం వద్దని హెచ్చరించారు. అందరూ సమన్వయం చేసుకుని గురుమూర్తిని గెలిపించాలన్నారు.

ఏపీలో జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల విజయాలతో వైసీపీ జోష్‌ మీద ఉంది. పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ క్లీన్‌స్విప్‌ చేసింది. తాడిపత్రి మినహా మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇదే ఊపులో తిరుపతి లోక్‌సభను కూడా గెలిచి తీరాలను టార్గెట్‌గా పెట్టుకుంది వైసీపీ. ఈ విజయంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదన్న సంకేతాన్ని ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది.

తిరుపతి పార్లమెంట్‌ బైపోల్‌ను వైసీపీతోపాటు టీడీపీ, బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తిరుపతి ఎంపీ స్థానాన్ని గెలిచి పరువు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తోంది. అటు బీజేపీ కూడా తిరుపతి విజయంతో…. వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ఇవ్వాలని చూస్తోంది. కాంగ్రెస్‌ కూడా తిరుపతి స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.

5. లక్ష మందితో షర్మిల బహిరంగ సభ : –
ఏప్రిల్ 9న ఖమ్మంలో సభపెట్టి పార్టీ పేరును ప్రకటించబోతున్నారు వైఎస్ షర్మిల. లక్ష మందితో సభ నిర్వహించేందుకు కూడా షర్మిల ప్లాన్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేతలతో ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో.. తెలంగాణ ఉమ్మడి జిల్లాల వైఎస్ అభిమానులతో షర్మిల సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలేంటి.. పార్టీకి ఏం పేరుండాలి.. పార్టీ విధానాలెలా ఉండాలి అనే అంశాలపై చర్చిస్తున్నారు. అభిమానుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

ఖమ్మంలో ఏప్రిల్ 9వ తేదీన జరిగే సభ కోసం కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల. సభ నిర్వహణ, జన సమీకరణ లాంటి అంశాలపైనే ఖమ్మంలోని ఆత్మీయ సమావేశంలో చర్చించారు. హైదరాబాదులో కాకుండా పార్టీ పేరును ఖమ్మం జిల్లాను ఎందుకు ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది. 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణా ప్రకటించినప్పుడు ఎన్నికలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి.

ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో మూడు స్థానాలను, ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి కాస్త పట్టుంది. ఇప్పుడు ఖమ్మం నుంచే వైఎస్ షర్మిల పార్టీ ప్రస్తానాన్ని ప్రారంభిస్తే… 2014 ఎన్నికల్లో వైసీపీని ఆదరించినట్లే.. తన పార్టీని కూడా ఆదరిస్తానే సెంటిమెంట్‌ను షర్మిల ఫాలో అవుతోందని విశ్లేషకులంటున్నారు. వైఎస్ఆర్‌తో సన్నిహితంగా ఉన్న గట్టి నేతలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. ఇవన్నీ తనకు కలిసొస్తాయని భావిస్తున్నారు వైఎస్ షర్మిల.

6. నది జలాల పంపకాల వివాదం : –
పోలవరం పూర్తయ్యే వరకే పట్టిసీమ ప్రాజెక్ట్ పనిచేస్తుందని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృష్ణా నదీజలాల పంపకాల్లో వివాదాలపై జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో ఇవాళ .. పోలవరం, పట్టిసీమపై క్రాస్‌ ఎగ్జామినేషన్ జరిగింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రైబ్యునల్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సాక్షుల విచారణను పూర్తి చేసింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్‌ తరఫున సాక్షి ఘన్‌శ్యామ్‌ను క్రాస్‌ ఎగ్జామిన్ చేశారు ఏపీ తరఫు న్యాయవాది వెంకటరమణి.

ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పట్టిసీమ కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు. పోలవరం పూర్తయ్యే వరకే పట్టిసీమ కొనసాగుతుందని… ఆ తర్వాత పట్టిసీమ పంపుల్ని వేరేచోటకు తరలిస్తామని ట్రైబ్యునల్‌కు తెలిపారు. తమకు కేటాయించిన వాటా మేరకే నీటిని లిఫ్ట్ చేస్తున్నామని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ చెప్పుకొచ్చారు.

విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేసే బాధ్యతను KWDT-2కి అప్పగిస్తూ, దాని కాలపరిధిని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడంపై KWDT-2.. 2014 నుంచి విచారణ నిర్వహిస్తోంది. తాజా విచారణలోనైనా నీటి పంపకాల మధ్య వివాదం ముగుస్తుందా లేదా అన్న అంశం ఆసక్తిగా మారింది.

7. కమల్ పార్టీ మేనిఫెస్టో : –
తమిళనాడులో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే అన్ని పార్టీలు మేనిఫేస్టోలను రిలీజ్‌ చేయగా.. తాజాగా కమల్ పార్టీ మక్కల్‌ నిది మయ్యమ్ కూడా మేనిఫేస్టోను రిలీజ్ చేసింది. మహిళల అభ్యున్నతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మేనిఫేస్టో రిలీజ్ చేశారు కమల్ హాసన్. విద్యార్ధులకు, నిరుద్యోగులకు కూడా అనేక హామీలను ఇచ్చింది MNM.
గృహిణులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్. పీపుల్స్ క్యాంటీన్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని తెలిపారు. అందులో, మిలటరీ క్యాంటీన్ మాదిరిగా, ప్రజలకు సరసమైన ధరలకు సరఫరా చేయబడుతుందని చెప్పారు. అసంఘటిత కార్మికులను ఒక సంస్థగా తీసుకురావాలన్నది తమ కోరిక అని వివరించారు కమల్. చిన్న వ్యాపారాలకు ముడి పదార్థాలు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.

తమిళనాడులో రాజధాని ప్రాంతమే కాకుండా.. అన్ని నగరాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు కమల్‌. ఇప్పటికే తమిళనాడుపై 6 లక్షల కోట్ల రుణ భారం ఉన్నందున, అదనపు మినహాయింపులు ప్రకటించినట్లయితే భారం పెరుగుతుందన్నారు. నీట్ పరీక్షకు ప్రత్యామ్నాయంగా, సీట్ అనే ప్రవేశ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు కమల్‌ హాసన్. కాగా.. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కోయంబత్తూర్‌ సౌత్‌ నుంచి బరిలో దిగుతున్నారు. మొత్తం 154 సీట్లో ఆయన పార్టీ పోటీ చేయగా.. మిగిలిన సీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించారు.

8. పౌరసత్వ సవరణ బిల్లుపై రాహుల్ కామెంట్స్ : –
అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అసోంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నాగ్ పూర్ లోని ఓ బలగం దేశం మొత్తాన్ని శాసించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీతో కుమ్మక్కై RSS అణచివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్‌. యువతకు ఉద్యోగాల్లేవని, రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశమంటే వివిధ సంస్కృతులు, భాషలు, మతాల సమ్మేళనమని, అటువంటి సౌభ్రాతృత్వాన్ని ప్రధాని మోదీ కాలరేజేస్తున్నారని విమర్శించారు రాహుల్ గాంధీ. అసోం ప్రజలు ఢిల్లీకి వచ్చినంత మాత్రాన.. వారి సంస్కృతి, కట్టుబాట్లు, భాష, చరిత్రను వదిలేయాలని చెప్పలేమని, అలా చెప్పిన రోజు వచ్చిందంటే.. భారత్ అనే సిద్ధాంతమే అంతమైపోయినట్టని హెచ్చరించారు.

ప్రజాస్వామ్యమంటే అసోం గొంతుకలే అసోంను నియంత్రించడమని యువత గుర్తించాలని పిలుపునిచ్చారు రాహుల్‌. యువత రాజకీయాల్లోకి రావాలని, రాష్ట్రం కోసం, దేశం కోసం పోరాడాలని సూచించారు రాహుల్‌. విద్యార్థులు లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ లేనట్టేనన్నారు. ప్రజలు దోపిడీకి గురువుతోందని భావిస్తే వెంటనే యువత రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాళ్లు, లాఠీలతో కాకుండా ప్రేమతో పోరాటం చేయాలన్నారు రాహుల్ గాంధీ.

9. చిరిగిన జీన్స్, ప్రియాంక కౌంటర్ : –
యువతులు మోకాళ్లు కనిపించేలా చిరిగిన జీన్స్ ధరిస్తున్నారంటూ ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయ్. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్‌. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కౌంటర్ వేశారు. RSS కార్యక్రమంలో మోకాళ్లకు పైగా ఖాకీ నిక్కర్లను ధరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘ఓ మై గాడ్… వాళ్ల మోకాళ్లు కనిపిస్తున్నాయి’ అని ఫోటోలకు కామెంట్ చేశారు. తీరథ్ సింగ్ కామెంట్‌కు బిగ్‌ బి అమితా బచ్చన్ మనవరాలు నవ్య ఘాటుగా బదులిచ్చారు. టోన్డ్‌ జీన్స్‌ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఆమె.. అటువంటి దుస్తులు వేసుకోవడాన్ని గర్వంగానే ఫీల్‌ అవుతానని తెలిపారు. మహిళల వస్త్రాధారణను మార్చడానికంటే ముందు మీ అభిప్రాయాలు, ఆలోచనా విధానాన్ని మార్చుకోండంటూ పోస్ట్ పెట్టింది. తీరథ్ సింగ్ వ్యాఖ్యల నుంచి సమాజంలోకి వెళ్లే సందేశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని నవ్య ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటి తర్వాత దాన్ని డిలీట్‌ చేశారు. అప్పటికే నవ్య పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌ అయ్యింది.

తీరథ్ సింగ్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓసారి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ రిప్డ్‌ జీన్స్‌ ధరించిందన్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని.. అలాగే ఆమె ఒక NGOని సైతం నడుపుతుందని.. ఇలాంటి దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుందని అన్నారాయన.

10. మదనపల్లె ఓపియం పంట : –
మదనపల్లెలో తీగ లాగితే హైదరాబాద్‌ శివార్లలో ఓపియం పంట బయటపడింది. ఏకంగా రెండు ఎకరాల్లో ఓపియం పంట సాగవుతున్న విషయాన్ని తెలుసుకుని పోలీసులు షాక్ తిన్నారు. మదనపల్లెలో ఇటీవల నిషిద్ధ గసగసాలను సాగు చేస్తూ పోలీసులకు పట్టు బడ్డ వెంకటరమణ ఇచ్చిన సమాచారంతో.. రంగారెడ్డి జిల్లాలోని లేమూర్ గ్రామంలో ఆకస్మిక దాడులు జరిపారు. రెండు ఎకరాల్లో ఓపియం పండిస్తున్న బుచ్చిరెడ్డిని అదుపులోకి తీసుకుని… 390 కిలోల ఓపియం కాయలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పంట సాగుకు దండేపల్లి చెన్నకేశవులు, వెంకట రమణ సహకరించారని తెలిపారు పోలీసులు. దీని వెనుక పెద్ద ముఠానే ఉన్నట్టు తెలిపారు. కోట్ల సంపాదనే లక్ష్యంగా కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగు చేస్తున్నారని విచారణలో తేలింది. ఈ కేసులో మొదటి నిందితుడు వెంకటరమణను ఇప్పటికే మదనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పీటి వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి విచారిస్తామన్నారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్.

గసగసాల పంట సాగుపై నిషేధం ఉంది. ఒక్క గ్రామ్ ఓపియం కాయతో మార్ఫిన్ తయారవుతుంది. దానికి మరికొంత కెమికల్ జతచేసి హెరాయిన్‌ డ్రగ్ తయారు చేస్తారు. డ్రగ్స్ తయారీతో అక్రమంగా కోట్లు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నాయి ముఠాలు. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో గసగసాల పంట సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంపై అక్కడి అధికారులు దాడులు చేశారు. మామిడి తోటలో 10 సెంట్ల స్థలంలో పంట సాగు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

11. భార్గవ్ తేజ్ మర్డర్ కేసులో పురోగతి : –
గుంటూరు జిల్లా మెల్లంపూడిలో బాలుడు భార్గవ్‌తేజ్‌ మర్డర్‌ కేసులో పురోగతి లభించింది. గోపి అనే యువకుడు బాలుడిపై లైంగిక దాడి చేసి.. హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. గతంలో అఖిల్‌ అనే బాలుడిపై లైంగిక దాడి చేసి, హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. అంతకుముందు ఒక స్నేహితుడిని కూడా సినిమాకు తీసుకెళ్లి.. మార్గమధ్యలో లైంగిక దాడి చేసి, హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈనెల 14న సాయంత్రం భార్గవ్‌ తేజ్‌పై కూడా అదే విధంగా కడతేర్చాడంటున్నారు. హత్య చేసిన తర్వాత చేతులు కట్టేసి అరటి తోటలో మృతదేహాన్ని పడేశాడు నిందితుడు గోపి.

తాడేపల్లిలో పక్కపక్కనే ఉండే మెల్లంపూడి, వడ్డేశ్వరం గ్రామాల్లో నెల రోజుల్లో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఓ బాలుడు అదృశ్యమైన రెండో రోజే విగతజీవిగా దొరకడంతో తాడేపల్లి పోలీసులు ఈ రెండు కేసులను చాలెంజింగ్ గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేయడంతో.. మిస్టరీ వీడింది. మెల్లంపూడిలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలటైంలో ఇంటిబైట ఆడుకుంటున్న కుర్ర భార్గవతేజ కనిపించకుండా పోయాడు. చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు అదే గ్రామానికి చెందిన గోపయ్య అలియాస్ గోపీ కూడా వెతుకుతున్నట్టుగా హంగామా చేశాడు.

గోపీ తీరుపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. భార్గవ్‌ను చంపిన వాడు పక్కనే తిరుగుతున్నా కనిపెట్టలేపోయామని వాపోతున్నారు బాలుడి కుటుంబ సభ్యులు. పసిపిల్లాడిని కనికరం లేకుండా హత్య చేసిన గోపిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

12. తెలంగాణలో కొత్త కరోనా కేసులు : –
తెలంగాణలో కొత్త క‌రోనా కేసుల సంఖ్య చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ 300కి పైగా న‌మోదైంది. 24 గంటల్లో కొత్తగా 313 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 142 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2వేల 434 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 943 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది.

విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌లో 400 మందికి పైగా విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు స్కూళ్లల్లో విద్యార్థులు, టీచర్లు కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. లేడీస్‌ హాస్టల్‌లో ఉంటున్న ఆరుగురు పీజీ విద్యార్ధినులు కోవిడ్‌ బారినపడ్డారు.

ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. 24 గంటల్లో అక్కడ 246 కొత్త కేసులు నమోదయ్యాయ్‌. వీటిలో గుంటూరు జిల్లాలో 58 కేసులు, చిత్తూరు జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ఒకరు కోవిడ్ వల్ల మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 131 మంది కోలుకున్నారు.

13. దేశంలో కరోనా కేసులు అధికం : –
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయ్‌. తాజాగా కొత్త కేసులు సంఖ్య 40వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో 10లక్షల 57వేల 383 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 39వేల 726 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోల్చితే కేసుల్లో 11 శాతం పెరుగుదల కనిపించింది. మహమ్మారి కారణంగా నిన్న 154 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.

కొత్త కేసులు భారీగా నమోదవుతుండటంతో.. క్రియాశీల కేసులు కూడా పైపైకి ఎగబాగుతున్నాయి. నిన్నటివరకు దేశంలో కోటీ పది లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 20వేల 654 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఆ రేటు 96 పాయింట్‌ 41 శాతానికి చేరింది. అయితే.. రికవరీల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. 24 గంటల్లో 25వేల 853 మందికి వైరస్ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 23లక్షలు దాటింది. 58 మంది మృత్యు ఒడికి చేరుకోగా.. మొత్తంగా 53వేల 138 మంది ప్రాణాలు వదిలారు. కేసులు పెరగడంతో.. ఈ నెలాఖరు వరకు కోవిడ్‌ ఆంక్షలు విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. థియేటర్స్, ఆడిటోరియంలో 50 శాతం మందికే అనుమతి ఇచ్చింది. ప్రైవేట్‌ కార్యాలయాల్లోనూ 50 శాతం మందితో పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

14. ముఖేశ్ అంబానీ బాంబు బెదిరింపు కేసు : –
ముఖేశ్‌ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో ట్రయాంగిల్ వార్‌ ముదురుతోంది.ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు సచిన్‌ వాజేను టార్గెట్ చేసేందుకే జాతీయ దర్యాప్తు సంస్థకు కేసు అప్పగించందని ఆరోపిస్తోంది శివసేన. సచిన్ వాజే మీద చూపించిన శ్రద్ధలో కొంచెం పుల్వామా నిందితులను పట్టుకోవడంతో ఎన్‌ఐఏ చూపిస్తే బాగుంటుందని విమర్శలు గుప్పిస్తోంది. ముంబై పోలీసు కమిషనర్ పదవి నుంచి పరంబీర్‌ సింగ్‌ను బదలీ చేయడం మహావికాస్‌ అగాడి కూటమిలో అగ్గి రాజేసింది. కాంగ్రెస్‌, శివసేనల మధ్య కోల్డ్ వార్‌ స్టార్ట్ అయ్యింది.

కశ్మీర్‌ లోయలో ప్రతి రోజూ పేలుడు పదార్థాలు దొరుకుతూనే ఉంటాయని.. ఎన్‌ఐఏ అక్కడికి వెళ్లి ఎందుకు దర్యాప్తు చేయడం లేదని శివసేన విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. పుల్వామా, పఠాన్‌కోట్‌ ఉగ్రవాదుల్లో ఇప్పటిదాకా ఎన్‌ఐఏ ఎంత మందిని అరెస్ట్‌ చేసిందో చెప్పాలని ప్రశ్నించింది శివసేన. జాతీయ భద్రత కంటే ఎన్‌ఐఏకు మహారాష్ట్ర మీద అంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకో అర్ధం కావడంలేదని చురకలంటించింది. మహారాష్ట్ర పోలీసుల పరువు తీయాలనే ఉద్దేశంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసును తీసుకొందని ఆరోపించింది శివసేన.

శివసేన ఆరోపణలపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్దవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కజిన్‌ వరుణ్‌ సర్దేశాయ్‌తో వాజేకు సంబంధాలు ఉన్నాయని తెలిపింది. క్రికెట్‌ బెట్టింగ్‌ చేస్తున్న వాళ్లను వాజే బెదిరించేవాడని రివర్స్‌ ఎటాక్ చేస్తోంది బీజేపీ. 2004లో వాజేను విధుల నుంచి తప్పించగా.. పోస్టింగ్‌ రాకపోవడంతో శివసేనలో చేరినట్లు బీజేపీ గుర్తు చేస్తోంది.

15. మాజీ మంత్రి రాసలీలలు : –
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకి హోళితో రాసలీలలు సాగించి మాయమైన సీడీ గర్ల్ ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. రాసలీలల సీడీ గర్ల్ బెంగళూరులోని ఇంట్లో లక్షలు లక్షల నోట్ల కట్టలు, బీర్లు, వైన్ బాటిల్స్, విలువైన పత్రాలు బయటపడటంతో షాక్ అయ్యారు ఎస్ఐటీ అధికారులు. బెంగళూరుతో పాటు విజయపుర తదితర ప్రాంతాల్లో సోదాలు చేసిన అధికారులు నోట్ల కట్టలతో పాటు లక్షల రూపాయల విలువైన బ్యాంకు చెక్ లు, డీడీలతో పాటు విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగం ఇప్పిస్తానని జీవితం నాశనం చేసి తనతో రాసలీలలు సాగించాడని సీడీ గర్ల్ ఆరోపణలు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పుడు మాయమైన సీడీ గర్ల్ ఇప్పటివరకు ఎవ్వరి కంటపడకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఆమె బెంగళూరులోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె ఇంటిలో అధికారులు 23 లక్షల రూపాయల నగదుతో పాటు పెద్ద ఎత్తున బీర్‌ బాటిళ్లు వెలుగు చూడటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉద్యోగం కావాలని మంత్రి వెంట తిరిగిన ఆమె ఇంటిలో ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందనే చర్చ మొదలైంది.

సీడీ గర్ల్ ఇంటితో పాటు ఇదే కేసులో మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మాజీ రిపోర్టర్, హ్యాకర్‌ ఇంటిలో సోదాలు చేశారు అధికారులు. రెండు ఇళ్లలో 40 లక్షల రూపాయల విలువైన డీడీలు, బ్యాంక్ చెక్ లు, విలువైన పత్రాలు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. సీడీ విడుదలైన తరువాత మాయమైన సీడీ సుందరి, మాజీ రిపోర్టర్, హ్యాకర్ కోసం ఎస్ఐటీ అధికారులు గాలిస్తున్నా వారి ఆచూకి మాత్రం చిక్కడం లేదు.

16. కేంద్రంపై మమత మండిపాటు : –
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు కేంద్రం తీసుకొచ్చిన బిల్లుపై మండిపడ్డారు మమతా బెనర్జీ. సమాఖ్య వ్యవస్థపై అది సర్జికల్ స్ట్రయిక్ లాంటిదన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసిన దీదీ.. బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ బీజేపీయేతరులకు లేఖలు రాస్తానన్నారు. ఈ బిల్లును అందరం కలసికట్టుగా ఎదుర్కొందామన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ కు ఎక్కువ అధికారాలను కల్పించి, ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆయనకు సబార్డినేట్ లా తయారు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు దీదీ.

రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైందన్నారు మమతా బెనర్జీ. ప్రభుత్వాలను బలహీనం చేస్తూ, వాటిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారామె. ప్రస్తుతం బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఢిల్లీకి వచ్చి కేజ్రీవాల్‌ని కలిసి మద్దతు ప్రకటిస్తానని చెప్పారు మమత.

2014 మరియు 2019 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బీజేపీ ఓడిపోవడాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు మమతా బెనర్జీ. ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోయినా… వారికి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ చేత ఢిల్లీని పాలించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో… ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అనే విధంగా ఉందన్నారు. స్పష్టంగా చెప్పాలంటే… ఢిల్లీ సీఎం డమ్మీగా మారిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు మమత.

17. కేరళ గోల్డ్ స్కామ్ : –
కేరళ గోల్డ్‌ స్కామ్‌.. కొత్త మలుపు తీరిగింది. సీఎం పినరయ్‌ విజయన్‌కు సంబంధం ఉందంటూ ప్రకటించినందుకు.. ఈడీ పైనే కేసు నమోదు చేశారు ఆ రాష్ట్ర పోలీసులు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ చేత ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరును ఈడీ అధికారులు బలవంతంగా చెప్పించారని ఆరోపిస్తున్నారు పోలీసులు. ఈడీ అధికారులపై కేసు నమోదు చేస్తూ.. ఎఫ్ఐఆర్‌ను ఎర్నాకుళం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్-2లో దాఖలు చేశారు అధికారులు.

గోల్డ్ స్కాంలో హవాలా కేసులో ఈడీ అధికారులు గత ఏడాది ఆగస్టు 12, 13 తేదీల్లో స్వప్న సురేశ్‌ను ప్రశ్నించారని ఎఫ్ఐఆర్ తెలిపింది క్రైమ్ బ్రాంచ్. ఈ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఇరికించే ఉద్దేశంతో ఆయన పేరును చెప్పే విధంగా స్వప్నను నిర్బంధించారని అందులో పెట్టారు. కుట్ర, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించింది పోలీసు శాఖ. హాని కలిగించే ఉద్దేశంతో.. తప్పు చేసే విధంగా ప్రేరేపించారని, తప్పుడు స్టేట్‌మెంట్‌ను చేర్చారని తెలిపింది.

కాగా.. స్వప్నకు సంబంధించినదిగా చెప్తున్న ఓ ఆడియో క్లిప్‌పై గతంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఈఎస్ బిజుమోన్ దర్యాప్తు చేశారు. ఆయన సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని తనను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని స్వప్న చెప్పినట్లు ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. కొందరు మహిళా పోలీసులు కూడా ఈడీ అధికారులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చారు.

18. అమెరికా, చైనా మాటల యుద్ధం : –
అమెరికా, చైనాల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా, అల‌స్కాలో జ‌రిగిన ఓ స‌మావేశంలో ప‌ర‌స్పరం విమ‌ర్శలు గుప్పించుకున్నారు చైనా, అమెరికాకు చెందిన అధికారులు. చైనా తీరు స‌రిగ్గా లేద‌ని అమెరికా ప్రభుత్వ అధికారులు అన‌గా, త‌మ‌పై దాడి చేసేందుకు కొన్ని దేశాల‌ను అమెరికా ప్రోత్సహిస్తోంద‌ని చైనా అధికారులు ఆరోపించారు. చైనాలో జింగ్‌జాంగ్‌లో ఉగర్‌ ముస్లింల ప‌ట్ల చైనా ప్రవ‌ర్తిస్తున్న తీరు స‌రికాద‌ని ఆరోపించింది అమెరికా.

వాటితో పాటు ప‌లు అంశాల‌ను అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు జేక్ సులివ‌న్‌లు తెరపైకి తెచ్చారు. జింగ్‌జియాంగ్‌తో పాటు హాంకాంగ్‌, తైవాన్‌లలో చైనా ఆధిప‌త్య ధోర‌ణి ప్రద‌ర్శిస్తోంద‌ని విమ‌ర్శించింది అమెరికా. అమెరికాపై చైనా సైబ‌ర్ దాడులకు ప్రయత్నిస్తుందని, త‌మ‌ మిత్ర దేశాల‌పై చైనా ఆర్థిక ప్రతికూల‌ చ‌ర్యల‌కు దిగుతున్నట్లు ఆరోపించారు బ్లింకెన్. ప్రపంచ సుస్థిర‌త‌ను చైనా చ‌ర్యలు దెబ్బతీసేలా ఉన్నాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఆరోపణలను తిప్పి కొట్టారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, విదేశాంగ శాఖ కార్యద‌ర్శి యాంగ్ జిలేచి. ఇత‌ర దేశాల ఆధిప‌త్యాన్ని అణ‌గ‌దొక్కే ధోర‌ణితో అమెరికా చర్యలున్నాయని మండిపడ్డారు. ప‌లు దేశాల మ‌ధ్య వాణిజ్య బంధాల‌ను దెబ్బతీస్తోంద‌ని, అక్కడ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న అధికంగా ఉంద‌ని ఆరోపించారు.

19. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు : –
ఐదు రోజుల పాటు వరుస నష్టాల్ని మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరకు ఈ వారాన్ని లాభాలతో ముగించాయ్‌. ఇవాళ ఉదయం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు నెమ్మదిగా పైకి ఎగబాకుతూ వచ్చాయి. కాసేపటికే మళ్లీ నష్టాల్లోకి జారుకున్నప్పటికీ… కీలక రంగాల్లో మద్దతు లభించడంతో ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయ్‌. 48వేల 881 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌.. 50వేల 3 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మళ్లీ 48వేల 586 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 641 పాయింట్లు లాభపడి 49వేల 858 వద్ద ముగిసింది.
ఇక 14వేల 471 వద్ద ఇవాళ ట్రేడింగ్ మొదలైన నిఫ్టీ … 14వేల 788 నుంచి 14వేల 350 మధ్య కదలాడింది. చివరకు 156 పాయింట్లు లాభపడి 14వేల 714 వద్ద స్థిరపడింది. మధ్నాహ్నం తర్వాత విద్యుత్తు, యుటిలిటీస్‌, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, లోహ రంగ షేర్లతో పాటు కొన్ని కీలక కంపెనీల షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. అలాగే.. ఈ ఐదు రోజుల భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. ఇది సూచీలకు కలిసొచ్చింది.
స్థిరాస్తి మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనించాయి. హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, దివీస్‌ ల్యాబ్‌, యూపీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ షేర్లు లాభాలను ఆర్జించగా.. టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయ్‌. మరోవైపు.. డాలరుతో రూపాయి మారకం విలువ 72 పాయింట్‌ 52 వద్ద నిలిచింది.

20. ఇంగ్లాండ్ టెస్టు : –
ఇంగ్లండ్‌తో జరిగే వ‌న్డే సిరీస్‌కు భార‌త జ‌ట్టును ప్రకటించింది బీసీసీఐ. జ‌ట్టులో సూర్యకుమార్ యాదవ్, క్రునాల్ పాండ్యాకు చోటు ద‌క్కింది. టీమిండియా స్క్వాడ్‌లో కెప్టన్‌గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టన్‌గా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శుభ్‌మ‌న్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వికెట్‌ కీపర్‌లుగా రిషభ్‌ పంత్, కేఎల్ రాహుల్‌లు, బౌలర్లుగా యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాద‌వ్‌, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఎండీ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు.

మూడు వ‌న్డేల సిరీస్‌లో మ్యాచ్‌లన్నీ పూణెలోనే జ‌ర‌గ‌నున్నాయ్‌. మొద‌టి వ‌న్డే ఈ నెల 23న‌, రెండో వ‌న్డే 26న‌, మూడో వ‌న్డే 28న జ‌రుగుతాయి. ఇటీవ‌ల జ‌రిగిన టెస్టు సిరీస్‌లో విజ‌యం సాధించిన టీమిండియా ప్రస్తుతం జ‌రుగుతోన్న‌ టీ20ల్లోనూ విజ‌యం సాధించాల‌ని క‌సిగా ఉంది. ఇప్పటివ‌ర‌కు జ‌రిగిన నాలుగు టీ20 మ్యాచుల్లో 2-2 తో ఇరు జ‌ట్లు స‌మంగా నిలిచింది. నిర్ణయాత్మక ఐదో టీ20పై ఉత్కంఠ నెల‌కొంది. నాలుగో టీ20 మ్యాచు‌లో సూర్యకుమార్ అద్భుతంగా రాణించ‌డంతో వ‌న్డే సిరీస్‌లో చోటు ద‌క్కింది. మరోవైపు.. ప్రసిధ్ కృష్ణ వన్డే సిరీస్‌కు తొలిసారిగా ఎంపికయ్యాడు.