ఒక వ్యక్తి నుంచి 77మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ కలకలం

కరోనా వైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకరమో చెప్పాల్సిన పనిలేదు. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది.

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 04:41 AM IST
ఒక వ్యక్తి నుంచి 77మందికి కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో కొవిడ్ కలకలం

కరోనా వైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకరమో చెప్పాల్సిన పనిలేదు. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది.

కరోనా వైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకరమో చెప్పాల్సిన పనిలేదు. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఎంతో వేగంగా, చాలా సైలెంట్ గా కరోనా వ్యాపిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు మానవవాళి మనుగడకే సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. దీంతో జాగ్రత్తగా ఉండటమే శ్రీరామరక్ష అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, స్వీయ నియంత్రణలో ఉండాలని ప్రభుత్వాలు నెత్తీనోరు బాదుకుంటున్నాయి. అయినా జనాల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా కరోనా కేసులు, కాంటాక్ట్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒక వ్యక్తి కారణంగా 77మందికి కరోనా వచ్చిందంటే షాక్ కొట్టక మానదు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఒక్క వ్యక్తి నుంచి 77మందికి కరోనా:
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్‌-19తో మృతిచెందిన వ్యక్తి ద్వారా ఇప్పటి వరకూ 77 మందికి పైగా వైరస్‌ సోకినట్లు తేలింది. వీరిలో జి.మామిడాడలో 56మంది, బిక్కవోలు 13మంది, రామచంద్రపురంలో ఏడుగురు, తునిలో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి గత గురువారం(మే 21,2020) కరోనాతో మృతిచెందగా, అప్పటినుంచి వరుసగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కేసు ల తీవ్రత పెరుగుతుండటంతో వైద్యులు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం(మే 26,20200 ఒకేరోజు 30 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క జి.మామిడాడలోనే 27 కేసులు గుర్తించారు. బిక్కవోలు, వెళ్లూరుల్లో ఒక్కొకరు ఉండగా, రాజమహేంద్రవరం బొమ్మూరు క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జి.మామిడాడలో బాధితులందరికీ ఇటీవల కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తి ద్వారానే వైరస్‌ సంక్రమించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఏపీలో కరోనా టెర్రర్:
రాష్ట్రంలో మంగళవారం మరో 48మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరుకాకుండా విదేశాల నుంచి వచ్చినవారిలో 111మందికి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 153మందికి కూడా వ్యాధి సంక్రమించినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 2,983కి పెరిగాయి. కాగా, రాష్ట్రంలో 3,110మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌(ఆరోగ్యసేతు)లో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలి కరోనా మరణం నమోదయినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌లో ధ్రువీకరించింది. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 57కు చేరింది. చిత్తూరు జిల్లాలో మరో నలుగురికి కోయంబేడు లింకులతో వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన మరో 49 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారించింది. దీంతో గత 24 గంటల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 97కు చేరింది.

శ్రీకాకుళానికి వలసల దెబ్బ:
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకూ 35 కరోనా కేసులుండగా.. మంగళవారం నాటికి మరో 30మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. జిల్లాకు ఇటీవల వలస కూలీలు భారీగా చేరుకున్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో వలస కూలీలకు ట్రూ నాట్‌ పరీక్షలు నిర్వహించగా 30మందికి పాజిటివ్‌ రావడంతో మరోసారి నమూనాలు తీసి ల్యాబ్‌కు పంపారు. తుది పరీక్షల్లో కూడా అదే ఫలితం వచ్చింది. చెన్నై నుంచి వచ్చినవారిలో వైరస్‌ లక్షణాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో మరో 10 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలోనే బయటి ప్రాంతాల్లో పనిచేస్తున్న మర్రిపాడు మండలానికి చెందిన ముగ్గురు కూలీలకు వ్యాధి సోకింది. సూళ్లూరుపేటలో 3, కలువాయి, ఆత్మకూరు, దొరవారి సత్రం మండలాలతో పాటు, నెల్లూరు నగరంలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. కర్నూలు జిల్లాలో మరో ఏడుగురికి కరోనా నిర్ధారణ అయింది. గుంటూరులో మరో 3 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, మాచర్ల, తాడేపల్లిల్లో ఒక్కొక్కరు చొప్పున వైరస్‌ బారిన పడ్డారు. చెన్నైలో చదువుకుంటున్న గుంటూరులో విద్యార్థి క్వారంటైన్‌లో ఉన్నాడు. అతడికి పాజిటివ్‌ వచ్చింది. బాపట్లకు చెందిన మహిళకు కూడా పాజిటివ్‌ వచ్చింది.

మటన్ వ్యాపారి నుంచి 22మందికి కరోనా:
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ ఇలాంటి కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి. పహాడీషరీఫ్‌లో ఓ మటన్ వ్యాపారి ఇచ్చిన పార్టీలో పాల్గొన్న 22 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. వీరిలో 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.

భారత్ లో 51వేల కరోనా కేసులు, 4వేల మరణాలు:
కరోనా మహమ్మారి భారత్‌ను గజగజ వణికిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 6,387 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 170 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష 51వేల 767కు చేరుకోగా, మృతుల సంఖ్య 4వేల 337కు చేరింది. ఈ వైరస్‌ నుంచి 64వేల 425 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 54వేల 758 కేసులు నమోదు కాగా 1,792 మంది మృతి చెందారు. తమిళనాడులో 17,728 కేసులు(మృతులు 128), గుజరాత్‌లో 14,829(మృతులు 915), ఢిల్లీలో 14,465(మృతుల 288), రాజస్థాన్‌లో 7,536(మృతులు 170), మధ్యప్రదేశ్‌లో 7,024(మృతులు 305), యూపీలో 6,724(మృతులు 177), బెంగాల్‌లో 4,009 పాజిటివ్‌ కేసులు (మృతులు 283) నమోదయ్యాయి.

Read: ఏపీలో మరో 48 కరోనా కేసులు, 57కి పెరిగిన మరణాలు