Red sandal : సర్కారు వారి ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం..తలనొప్పిగా మారిన భద్రత

ప్రభుత్వ గోడౌన్లలో నిల్వ ఉన్న ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం చేస్తోంది. దీంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల పరిరక్షణ కంటే గోడౌన్లో ఉన్న ఎర్రదుంగల భద్రత తలనొప్పిగా మారింది.

Red sandal : సర్కారు వారి ఎర్రచందనం వేలానికి కేంద్రం జాప్యం..తలనొప్పిగా మారిన భద్రత

Red Sandal Wood

Red sandal wood : అక్షరాలు రూ.5,000 కోట్ల రూపాలయ ఎర్రచందనం గోడౌన్లలో మూలుగుతోంది.ఇదేదో స్మగ్లర్ల డెన్ లో కాదు. సర్కారువారి డిపోల్లోనే ఉంది.ప్రభుత్వం వేసే వేలం పాట కోసం అంతర్జాతీయ మార్కెట్ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందరంటే ఈ భూమండలంపై ఎక్కడా దొరకని అత్యంత విలువైన, అరుదైన సంపద ఎర్రచందనం మన శేషాచలం అడవుల్లో మాత్రమే దొరుకుతుంది..ఈ ఎర్రచందనం వేలం విషయంలో ఆలస్యం జరుగుతోంది. శేషాచలం కొండపై ఉన్న ఎర్రచందనం చెట్లను పరిరక్షించటంకంటే సర్కారువారి గోడౌన్లలో ఉన్న ఎర్రచందనానికి సెక్యూరిటీ కల్పించటానికే తెగ తలనొప్పిగా మారుతోంది. ఇంతకీ వేల టన్నుల ఎర్రచందనం వేలం ఎందుకు ఆగుతోంది? కేంద్రం నుంచి రావాల్సినఅనుమతుల్లో జాప్యం దేనికి?

గోడౌన్లలో 5,500 మెట్రిక్‌ టన్నుల ఎర్రదుంగలున్నాయి. గోడౌన్లలో ఉన్న ఎర్రబంగారం విలువ రూ.5 వేల కోట్లు.సెక్యూరిటీకి భారీగా ఖర్చు పెడుతోంది ప్రభుత్వం. వేలానికి కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూపులు చూసి చూసి అలసిపోతోంది. కేవలం శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే బంగారం.. ఎర్రచందనం. అందుకే స్మగ్లర్ల కళ్లు ఎప్పుడూ వాటిపైనే ఉంటాయి. పచ్చని అడువులు రుధిర ధారలతో ఎరుపెక్కుతునే ఉంటాయి. ఓవైపు గొడ్డలి వేట్లు, మరోవైపు తుపాకీ కాల్పులతో శేషాచలం అటవీప్రాంతం మార్మోగుతూనే ఉంటుంది. ప్రాణాలకు తెగించి ఎర్రచందనం చెట్లు నరికి.. రహస్యంగా తరలించుకుపోయేది ఒకరైతే… వాటిని విదేశాల్లో అమ్మి సొమ్ము చేసుకునేది మరొకరు. అడవుల నుంచి విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న రెడ్‌ శాండిల్ దుంగలు.. స్మగ్లర్లకు కోట్లకు కోట్లు కురిపిస్తున్నాయి. కూలీని సైతం కోటీశ్వరుడిని చేస్తున్నాయి.

Also read : Telangana : సీఐని దూషించిన ఆడియో నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పట్నం మహేందర్ రెడ్డి

రాయలసీమలో 5.30 లక్షల హెక్టార్‌లలో ఎర్రచందనం విస్తరించి ఉంది. ఇంతటి అరుదైన వృక్షాలు ఉండడం శేషాచలానికి శాపంగా..స్మగ్లర్లకు వరంగా మారింది. నిత్యం ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక రూపంలో.. ఎర్రచందనం తరలిస్తూ స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌, పోలీసులకు పట్టుబడుతూనే ఉంటారు. ఇలాంటి దాడుల్లో దొరికేది గోరంత అయితే.. దేశం దాటిపోయేది కొండంత. ఐతే ఇలా ఫారెస్ట్‌ అధికారులకు పట్టుబడ్డ ఎర్రచందనం తిరుపతి గోడౌన్లకు చేరి మూలుగుతోంది.

ప్రస్తుతం తిరుపతిలోని ఎనిమిది గోడన్లలో 5,500 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.5 వేల కోట్లకు పైనే పలుకుతోంది. ఈ దుంగలను మళ్లీ దొంగల పాలు కాకుండా కాపాడడమే తలకు మించిన భారంగా మారింది. 24 గంటల సెక్యూరిటీ, చుట్టూ సీసీ కెమెరాలతో వీటికి భద్రత కల్పిస్తున్నారు.దీంతో పాటు అగ్నిప్రమాదాలు, దొంగతనాల నుంచి వీటికి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.5 కోట్ల బీమా ప్రీమియం చెల్లిస్తోంది. ఇంత ఖర్చు పెట్టే బదులు అమ్మేయొచ్చు కదా ! అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. కానీ రాష్ట్రంలో ఎర్రచందనం ఉన్నంత మాత్రాన ఇష్టానుసారంగా వేలం పెట్టి అమ్మేయడం కుదరదు. దీనికి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చిన తర్వాత మాత్రమే వేలం పాటను నిర్వహించాలి. పదేళ్ల క్రితం 8,498 టన్నుల అమ్మకానికి కేంద్రం అనుమతి ఇవ్వగా అందులో 8,180 టన్నుల దుంగల్ని 13 విడతల్లో విక్రయించారు. ఆ కోటాలో మిగిలిన 318 టన్నుల దుంగల్ని గతేడాది విక్రయించారు. ఇవి కాకుండా ఇంకా అటవీశాఖ దగ్గర 5,500 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. వీటిని కూడా అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Also read :Andhra Pradesh : జగన్ తరువాత నెంబర్ 2 అతనేనా? వైసీపీలో కీలక మార్పులు..
తిరుపతి గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం ఒక్కో మెట్రిక్‌ టన్ను అంతర్జాతీయ మార్కెట్‌లో 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు పలికే అవకాశముంది. ఎనిమిది గోడౌన్లలో ఏ1 రకం దుంగలతో పాటు నాన్ గ్రేడ్‌ దుంగలు కూడా ఉన్నాయి. ఏ, బీ, సీ గ్రేడ్‌ల్లో ఉన్న దుంగలు సుమారుగా 2 లక్షల వరకు ఉన్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లా టాస్క్‌ఫోర్స్‌, పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఈ ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. ఈ గోడౌన్లలోకి ప్రతి నెల సగటున 30 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం చేరుతోంది. రెడ్‌శాండిల్‌ పౌడర్, వేర్లు పెద్ద ఎత్తున గోడౌన్లలో మూలుగుతున్నాయి. ఇలా స్వాధీనం చేసుకున్న దుంగలను వేలం పాట ద్వారా అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

2012లో మొత్తం దేశంలో జప్తు చేసిన 11,806 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం దుంగలను ఒకేసారి ఎగుమతి చేసేందుకు సీఐటీఈఎస్ అనుమతి ఇచ్చింది. ఇందులో ఒక్క ఏపీ నుంచే 8,498 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం ఉంది. ఈ కోటాలో 2011 సంవత్సరంలో 1998 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం విక్రయించారు. 2006లో మరో 233 మెట్రిక్‌ టన్నులు అమ్మేశారు. 2013లో ఏపీకి 8,498 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనాన్ని ఆరు నెలల్లో విక్రయించేందుకు డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ ఫారిన్ ట్రేడ్‌ అనుమతి ఇచ్చింది. అలా ఆ గడువును పెంచుతూ పోయారు. ఆ తర్వాత నిర్వహించిన వేలం పాటల్లో ఆ సరుకంతా అమ్ముడుపోయి విదేశాలకు ఎగుమతి అయింది.

Also read : prashant kishor : హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పీకే..రిలాక్స్ అయిన టీ.కాంగ్రెస్

ప్రస్తుతం ఏపీ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న 5,500 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ మొదలు కానుంది. దీని ద్వారా వచ్చే సొమ్ము నుంచి 30 శాతం వరకు ఎర్రచందనం కన్జర్వేషన్‌కు వినియోగించుకోవచ్చు.