ఏపి విద్యార్ధులకు గుడ్ న్యూస్ : పరీక్షలు లేకుండానే పై తరగతికి

  • Published By: madhu ,Published On : March 26, 2020 / 10:42 AM IST
ఏపి విద్యార్ధులకు గుడ్ న్యూస్ : పరీక్షలు లేకుండానే పై తరగతికి

ఏపీ రాష్ట్రంలో విద్యార్థుల విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాయకుండానే..పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి పిల్లలను పై తరగతులకు ప్రమోట్‌ చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. 2020, మార్చి 26వ తేదీ గురువారం విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష  నిర్వహించారు.

కరోనా వైరస్‌ కారణంగా పరీక్షల వాయిదా, పిల్లలకు మధ్యాహ్న భోజనం, తదితర విషయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. వైరస్‌ కారణంగా స్కూళ్లు మూతపడినందున పిల్లలకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనం అందచేయాలని, వాలంటీర్ల సహాయంతో దీనిని అందచేయాలని సీఎం జగన్ సూచించారు.

అదే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన విషయంలో ఒకే క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని, సీఎం గోరుముద్ద కార్యక్రమాన్ని గర్వంగా తీసుకోవాలన్నారు. దీన్ని మరింత బలోపేతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షలు ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మార్చి 31వ తేదీన సమీక్ష నిర్వహించిన అనంతరం దీనికి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్నారు. 

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. 2020, మార్చి 26వ తేదీ గురువారం వరకు పది కేసులు నమోదయ్యాయి. రోడ్లపైకి రావొద్దని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఆంధ్రా – కర్నాటక బోర్డర్స్ వద్ద భద్రతను కట్టదిట్టం చేశారు. 

Also Read | కరోనావైరస్‌ను లాఠీతో గెలవగలమా? పోలీసులు నేర్పించాల్సింది అవగాహన,హింసకాదు