7 PM టాప్ న్యూస్ : 20 వార్తలు, సంక్షిప్తంగా

7 PM టాప్ న్యూస్, 20 వార్తలు, సంక్షిప్తంగా

7 PM టాప్ న్యూస్ : 20 వార్తలు, సంక్షిప్తంగా

20 News

7PM Top News 10TV :
1. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం క్లోజ్ :-

తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఇన్నాళ్లు పోటాపోటీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి క్షణం వరకూ నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజే సమయం ఉండటంతో ప్రధానపార్టీలన్నీ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాయి. ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

ఓ వైపు అధికారులు పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. మద్యం, నగదుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు.కొందరైతే ఏకంగా అభ్యర్థులు ఫోన్‌ పే.. గూగుల్‌ పే నెంబర్లు అడుగుతున్నట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అటు ఎక్సైజ్‌ శాఖ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లఓ రెండు రోజులపాటు వైన్‌షాలను క్లోజ్ చేసింది.

తెలంగాణలో మొత్తం 2 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 93 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. దీంతో.. జంబో బ్యాలెట్‌ను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

వరంగల్‌ – ఖమ్మం- నల్లగొండ పట్ట భద్రుల నియోజకవర్గంలో 2015లో జరిగిన ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఈసారి ఎన్నికల్లో 71 మంది పోటీలో ఉన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో మొత్తం 10 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. అయితే వీరంతా ఓట్లే వేస్తారో వేయరో అని అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. వీరిని పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

2. ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ :-
ఆంధ్రప్రదేశ్‌లో రెండు టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కూడా తెరపడింది. కృష్ణా -గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి స్థానాలకు ఈ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు నిలిచారు.

కృష్ణా – గుంటూరులో టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈసారి అత్యధిక సంఖ్యలో 19 మంది బరిలో ఉన్నారు. రెండు జిల్లాల్లో కలిపి 13 వేల 350 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తక్కువగా ఉండటంతో పోటీ చేయటానికి అనేక మంది అభ్యర్థులు ఆసక్తి చూపారు. కొన్ని పర్యాయాలుగా ఉపాధ్యాయ, అధ్యాపకులే కాకుండా ఇతర రంగాల నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది బోధనేతర వృత్తిలోని వారే.

ఇంతకు ముందు జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక సంఘాలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలిపి గెలిపించుకునేవి. ఈసారి అన్ని ప్రధాన సంఘాలు విడివిడిగా అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఫలితంగా ఓట్ల చీలిపోయేలా కనిపిస్తోంది. దీనివల్ల కొత్త అభ్యర్థి గెలిచే అవకాశాలే ఎక్కువన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొందరు అభ్యర్థులు విజయం కోసం ఎంత ఖర్చకైనా వెనుకాడటం లేదు. అధ్యాపక ఓటర్లకు ఒక అభ్యర్థి రూ.4 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

3. కేటీఆర్ తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు : –
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు కలిశారు. ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖకు రావాలని రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించాలని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు..

మరోవైపు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రపతి పేరిట ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ భూములను కర్మాగారానికి బదలాయించాలన్నారు. వాటిని అమ్మి ప్లాంట్‌ నిర్వహణ మూలధనం సమకూర్చుకోవచ్చని సూచించారు జేడీ లక్ష్మీనారాయణ.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఏపీ భవన్ ఎదుట ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కుపై కన్నేయాలని చూస్తే వారిని దేవుడు కూడా క్షమించడన్నారు.. సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి. విశాఖ ఉక్కుకి ఆంధ్రులకు విడదీయరాని బంధం ఉందన్నారు. ఆపేగు బంధాన్ని ఎవరూ తెంచలేరన్నారు. కార్మికుల పొట్టకొట్టే కుట్రలు మానుకోవాలన్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలన్నారు.

4. విశాఖ ఉక్కు నేతల మధ్య మాటల యుద్ధం : –
ఏపీ విశాఖ ఉక్కుపై తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్‌ మద్దతివ్వడంపై బీజేపీ ఫైర్‌ అయింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుదన్న మంత్రి కేటీఆర్‌ ప్రకటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతనే కేసీఆర్ కుటుంబం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందన్నారు. ఏడేళ్లుగా షుగర్ పరిశ్రమను ఎందుకు తెరవలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేటీఆర్‌కు పూనకం వస్తోందంటూ సెటైర్‌ వేశారు కిషన్‌రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు.

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్‌కు లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ముందు ఇచ్చిన మాట ప్రకారం అజంజాహీ మిల్లు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు రివర్స్‌ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఏపీకి కష్టం వచ్చింది కదా.. మాకేంటి సబంధం అని నోరు మెదపకుండా ఉంటే రేపు తెలంగాణ మీద పడుతారనప్నారు. దేశంలో ఎక్కడ తప్పు జరిగినా అందరూ ఖండించాలన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తానని.. విశాఖ ఉక్కును తుక్కుతుక్కు చేసి అమ్మేస్తున్నారంటూ మోదీపై మండిపడ్డారు. ఇవాళ ఏపీలో ప్లాంట్‌ను అమ్ముతున్న కేంద్రం…రేపు సింగరేణి, బీహెచ్‌ఈఎల్‌ జోలికి వస్తుందన్నారు. అందుకే అన్యాయం ఎక్కడ జరిగినా తాము అండగా ఉంటామన్నారు.

5. ఏప్రిల్ 15 నాటికి యాదాద్రి క్యూ లైన్ : –
ఏప్రిల్ 15 నాటికి యాదాద్రిలో క్యూలైన్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. 350 సీట్ల క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని సూచించారు. ప్రపంచ దేవాలయాల్లో యాదాద్రి తన ప్రత్యేకతను చాటుకోబోతోందని అన్నారు. మే నెలలో యాదాద్రి ఆలయాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. గడువులోగా తుదిమెరుగులు దిద్దాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి పుణ్యక్షేత్ర పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

కొద్దిరోజుల క్రితమే యాదాద్రిలో పర్యటించి క్షేత్రస్థాయిలో దేవాలయ ప్రాంగణాన్ని పరిసర ప్రాంతాలను కలియదిరిగిన సీఎం కేసీఆర్.. అధికారులకు పలు సూచనలు చేశారు. దీప స్థంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్ది పెడస్టల్ కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలని అన్నారు. శివాలయ నిర్మాణం గురించి తెలుసుకున్న సీఎం, ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో సుదర్శన చక్రం ఏర్పాటు చేసినట్టు గానే, శివాలయం చుట్టూ త్రిశూలం దర్శనమీయాలన్నారు. రథశాలను టెంపుల్ ఎలివేషన్‌తో తీర్చిదిద్దాలన్నారు.

విష్ణు పుష్కరిణీ కొండపై చుట్టూ నిర్మించే ప్రహరీ గోడలమీద రెండు వైపులా వెలుగులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలను అలంకరించాలని సీఎం కేసీఆర్ అన్నారు. 80 ఫీట్ల పొడవు వున్న దీప స్థంభాన్ని లాన్ నడుమ ఏర్పాటు చేయాలని తెలిపారు. అద్దాల మండపం అత్యంత సుందరంగా తయారు చేస్తున్నారంటూ సిఎం కేసీఆర్ కితాబిచ్చారు.

6. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక : –
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దింపే విషయంలో బీజేపీ – జనసేన మధ్య ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. జనసేన మద్దతుతో బీజేపీ బరిలోకి దిగాలని నిర్ణయం జరిగింది. సోము వీర్రాజు, పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ మురళీధరన్‌ ట్వీట్‌ చేశారు. తిరుపతి నుంచే బీజేపీ విజయయాత్ర ప్రారంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల నమ్మకాలతో ఆడుకుంటున్న వైసీపీ, టీడీపీ ముసుగులను బీజేపీ, జనసేన తొలగిస్తాయని ప్రకటించారు.

తిరుపతిలో తమకు బలం ఉందని జనసేన బరిలోకి దిగుతుందని మొదటి నుంచి పవన్ కల్యాణ్‌ బీజేపీ చెప్పారు. జాతీయ నేతలతోనూ పలుమార్లు భేటీ అయ్యారు. పలు దఫాల చర్చల అనంతరం జనసేన తిరుపతి బై పోల్ నుంచి తప్పుకుంది. ఇవాళ పవన్‌తో సమావేశమైన సునీల్ దియోధర్‌, సోము వీర్రాజులు.. బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి పవన్ అంగీకరించారు. ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ప్రకటించింది. ఎన్నికల్లో గెలుపు వ్యూభహంపై చంద్రబాబు క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు వైసీపీ డాక్టర్ గురుమూర్తి పేరును పరిశీలిస్తుంది. దివంగత ఎంపీ దుర్గాప్రసాద్‌ కుటుంబం సైతం పార్టీ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా సహకరిస్తామని స్పష్టం చేసింది.

7. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ : –
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుతుంది. దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహింస్తొంది. గుజరాత్ అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రధాని మోదీ. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్ర ప్రారంభమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి నవసారిలోని దండి వరకు 81 మంది 241 మైళ్ల దూరం 25 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట స్వాతంత్ర్య సంబరాలు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య చరిత్ర ఒక మహోజ్వల ఘట్టమన్నారు సీఎం కేసీఆర్. ఉప్పు సత్యగ్రహం స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేపట్టి.. ప్రత్యేక రాష్ట్రాన్ని్ సాధించుకున్నామన్నారు కేసీఆర్. ఉద్యమ సమయంలో గాంధీ మార్గంలో పయనించామన్నారు. హన్మకొండలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య సంబురాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించారు.

8. ఏపీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ : –
ఏపీలోనూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ ఘనంగా జరిగింది. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం జగన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75వ ఏండ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు నిర్వహిస్తున్న వేళ పింగళికి భారతరత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందనన్నారు.

గుంటూరు జిల్లా మాచర్లలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె.. సీతామహాలక్ష్మిని సీఎం జగన్‌ సత్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని సీఎం జగన్‌తో కలిసి పంచుకున్నారు. సీతామహాలక్ష్మి యోగక్షేమాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. సీఎంను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. పింగళికి భారతరత్న ఇచ్చేలా కృషి చేయాలని పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు కోరడంతో సీఎం వెంటనే పీఎంకు లేఖ రాశారు. తాము కోరిన వెంటనే భారత రత్న విషయమై కేంద్రానికి సీఎం జగన్ లెటర్ రాయడంపై పింగళి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అటు పింగళి కుంటుంబానికి 75 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. పింగళి కుటుంబం ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం జగన్.

9. హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అరెస్టు : –
హత్య కేసులో అరెస్ట్ అయిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు పోలీసులు. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావమరిది సత్తిరాజురెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. రామకృష్ణారెడ్డే తన భర్తను హత్య చేశారంటూ ఆయన రెండో భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నల్లమిల్లిని ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ.. టీడీపీ నేతలు పోలీసులను అడ్డుకోవడంతో.. అనపర్తిలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని పోలీసులతో వాదనకు దిగారు టీడీపీ నేతలు.

పోలీసుల తీరును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు టీడీపీ నేత చంద్రబాబు . టీడీపీ నేతలపై సీఎం జగన్‌ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం విధానాలతో ప్రజాస్వామ్యం పతనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వైసీపీ అవినీతిని నిరూపిస్తే టీడీపీపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని, అధికారం శాశ్వతం కాదని జగన్‌ గుర్తుంచుకోవాలన్నారు చంద్రబాబు.

10. ఏపీలో మున్సిపల్ ఎన్నికల బెట్టింగ్ : –
ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు టైమ్ దగ్గర పడుతుంటే.. ఫలితాలపై బెట్టింగుల జోరు పెరుగుతోంది. ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న బ్యాలెట్ బాక్సుల దగ్గర సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు అధికారులు. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపు తమదంటే తమదంటూ అధికార -విపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా విజయవాడ మేయర్ అభ్యర్థి ఎవరన్నదానిపై బెట్టింగ్‌ రాయుళ్లు పందాలు కాస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఫలితాలపై ఉత్కంఠ ఆపుకోలేకపోతున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు.. మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది.. డివిజన్లలో ఎవరికి ఎంతెంత మెజారిటీ వస్తుంది. ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కుతాయన్న కేటగిరీల్లో బెట్టింగులు కాస్తున్నారు.

10 లక్షలు కడితే 12 లక్షలు ఇస్తామంటూ నిర్వాహకులు ఎర వేస్తున్నారు. కొన్ని డివిజన్లలో బెట్టింగ్‌ 20 లక్షల నుంచి 30 లక్షల వరకు వెళ్లింది. పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్‌ నుంచి టీడీపీ నుంచి విజయలక్ష్మి, వైసీపీ నుంచి పుణ్యశీల పోటీపడ్డారు. ఇక్కడ పుణ్యశీల సిట్టింగ్ కార్పొరేటర్‌. పైగా వైసీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. అయితే టీడీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పేరును టీడీపీ ప్రకటించింది. కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి పోటీ చేశారు. ఇద్దరిలో మేయర్ పీఠం టీడీపీ దక్కించుకుంటుందని 10 లక్షలు కడితే… 12 లక్షల ఇస్తామని టీడీపీ శ్రేణులు పందెం వేస్తున్నాయి. అదే స్ధాయిలో వైసీపీ శ్రేణులు కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. బెట్టింగ్‌లో నెగ్గేదెవరో.. డబ్బులు పోగొట్టుకునేదెవరో ఎల్లుండి తేలనుంది.

11. తమిళనాడులో పొలిటికల్ హీట్ : –
తమిళనాడులో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తున్నాయి. మక్కల్‌ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హసన్‌ సౌత్‌ కోయంబత్తూర్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీ మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను 154 సీట్లలో పోటీ చేస్తోంది. మిగతా 80 స్థానాలను కూటమిలోని రెండు పార్టీలకు కేటాయించింది. ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి, ఇండియా జననాయక కచ్చి పార్టీలు చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మక్కల్‌ నీది మయ్యం ఈ రెండు పార్టీలతో కలిసి మూడో కూటమిగా బరిలోకి దిగింది.

డీఎంకే నుంచి మరో వారసుడు ప్రత్యక్ష ఎన్నికల పోరులోకి అడుగుపెడుతున్నారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక స్టాలిన్‌ ఎప్పటిలాగే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. మార్చి 15న స్టాలిన్‌ నామినేషన్‌ వేయనున్నారు. డీఎంకే 173 మందితో జాబితా విడుదల చేసింది. చాలా మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు డీఎంకే మరోసారి అవకాశమిచ్చింది. బొడినాయకనూర్‌లో ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు పోటీగా తంగా తమిళ్‌సెల్వన్‌ను నిలబెట్టింది. 50 మందికి పైగా కొత్త వారికీ పోటీచేసే అవకాశం కల్పించింది డీఎంకే. మిత్రపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకే సహా ఇతర చిన్న పార్టీలకు మొత్తం 61 సీట్లను వదలిపెట్టింది.

12. దేశంలో మళ్లీ కరోనా కోరలు : –
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫిబ్రవరి 11న 10 వేల కేసుల నమోదవ్వగా.. ఇప్పుడు డైలీ కేసుల సంఖ్య 20 వేలు దాటేసింది. నెల రోజుల వ్యవధిలోనే రెండు రెట్లు అధికంగా కేసులు రికార్డయ్యాయి. దేశంలో ఒక్కరోజులోనే 23 వేల 285 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 117 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ కేసులు నిన్నటి కంటే 2 శాతం అధికం. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 13 లక్షల 8 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 58 వేల మందికి పైగా మరణించారు. ప్రస్తుతం దేశంలో లక్షా 97 వేల 237 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 15 వేల మంది కరోనా నుంచి కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 96.92 శాతం కాగా… మరణాల రేటు 1.40 శాతం, యాక్టీవ్ కేసులు 1.68 శాతం ఉందని కేంద్రమంత్రిత్వ శాఖ తెలిపింది.

కొత్త కేసుల్లో 85.6 శాతం కేసులు మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి. ఆ ఆరు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వేగంగా విస్తరిస్తోంది. నాగ్‌పుర్‌లో లాక్‌డౌన్‌ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 21 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ముంబయి, నాసిక్‌, పుణె, అకోలా, నాగ్‌పుర్‌లో కేసుల ఉద్ధృతి అధికంగా ఉంది.

13. తెలంగాణలో కరోనా పంజా : –
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ 181 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 44 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 3లక్షల 717 కు చేరింది. జగిత్యాల జిల్లాలో కరోనా స్ట్రెయిన్ కలకలం రేపింది. బ్రిటన్‌ నుంచి జగిత్యాల జిల్లాకు వచ్చిన నలుగురికి కొత్త స్ట్రెయిన్‌ లక్షణాలను అధికారులు గుర్తించారు. ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న 16 మందిని నిమ్స్‌కి తరలించారు. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, వెంకటాపూర్, ముత్యంపేట, తక్కళ్లపల్లి గ్రామంలోని పలువురికి న్యూ స్ట్రెయిన్‌ వేరియంట్‌గా గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల్లో భయాందోళన నెలకొంది. ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామాల్లో బ్లీచింగ్ చేపడుతున్నారు.

కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు రోజుకి 20 నుంచి 30 వేల పరీక్షలు నిర్వహిస్తుండగా .. ఇకనుంచి రోజుకి 50వేల టెస్టులు చేయాలని ఆదేశించారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్,ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల DMHO లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి ఈటెల

14. యాదాద్రిలో రేవ్ పార్టీ : –
యాదాద్రి జిల్లాలో రేవ్‌ పార్టీ దుమారం రేపింది. ఆల్కహాల్‌తో పాటు డ్రగ్స్‌ను కూడా అందించేలా పార్టీకి ప్లాన్ చేశారు. సంస్థాన్‌ నారాయణపురంలోని ఓ పార్టీ నేత జక్కిడి ధన్వంతరెడ్డి ఫామ్‌హౌజ్‌లో శివరాత్రి వేళ ఈ పార్టీ చేసుకున్నారు. ధన్వంతరెడ్డి కుమారుడు మరి కొందరితో కలిసి ఈ పార్టీని నిర్వహించాడని తెలుస్తోంది. యువతీ యువకులను ఆకర్శించేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. పార్టీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో అడ్వర్‌టైజ్‌ చేశారు.. పోస్టులు, రీపోస్టులతో జగ్‌నేకీ రాత్‌ అంటూ అట్రాక్ట్‌ చేశారు.
ఎంట్రీ టికెట్‌ 5 వందలు… ఇక లోపలికి వెళ్లాక.. కావాల్సిన వాళ్లకి కావాల్సినంత.. అంటూ వంద మంది నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. ముందే ఆర్డర్‌ తీసుకొని ఎవరికి ఏం కావాలో అవి అరేంజ్‌ చేశారు. తాగడానికి లోకల్‌ నుంచి ఫారిన్‌ వరకు అన్ని రకాల బ్రాండ్ల విస్కీ, బీర్లు.. బిర్యానీలు తెప్పించారు.. ఢిల్లీ నుంచి డీజే సయ్యద్‌ అర్మాన్‌ రప్పించారు.. గంజాయి, డ్రగ్స్‌.. కూడా ఏర్పాటు చేశారు. దీంతో మందేస్తూ చిందేస్తూ మత్తులో మునిగితేలారు.

ఖాకీల రాకను గమనించిన కొందరు పరారు కాగా.. మరో 90 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. మొత్తం 60 బైకులు, 14 కార్లను సీజ్‌ చేశారు. అలాగే మందుబాటిళ్లు, మత్తు మందులను కూడా సీజ్‌ చేసి నార్కోటిక్‌ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ రేవ్‌ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ధృవీకరించారు. రేవ్‌ పార్టీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో నగర శివారుల్లో రేవ్‌ పార్టీలపై పోలీసులు దృష్టి సారించారు.

15. మమత దాడి వెనుక కుట్ర : –
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై దాడి వెనుక కుట్ర దాగుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. దీదీపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈసీని కలిసిన ఆరుగురు టీఎంసీ నేతల బృందం.. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను అందించింది. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ గాయపడటం దురదృష్టకర ఘటన కాదని, ఇది కచ్చితంగా కుట్రేనని తెలిపింది. దేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడిన ఉదంతంపై అందరూ ఆందోళన చెందినా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రకటన రాలేదని టీఎంసీ విమర్శించింది. మరోవైపు బీజేపీ .. టీఎంసీపై ఎదురుదాడి మొదలు పెట్టింది. మమతవన్నీ నాటకాలేనని.. టీఎంసీ నేతలు ఎన్నికల కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నాని విమర్శించింది. మరోవైపు బీజేపీ నేతలు కూడా సీఈసీని కలిసి తృణమూల్‌పై ఫిర్యాదు చేశారు.

నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరపున సువేందు అధికారి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు బీజేపీ ర్యాలీలో దీదీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తృణమూల్‌ పార్టీ ఓ ప్రయివేట్‌ పార్టీగా మారిందన్నారు. మమత, ఆమె అల్లుడికి మాత్రమే పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉందని విమర్శించారు. బెంగాల్‌లో మార్పు కోసం టీఎంసీని గద్దె దింపాలని పిలుపునిచ్చారు సువేందు. తాను కేవలం పార్టీ మాత్రమే మారానన్నారు. నందిగ్రామ్ ప్రజలతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, సీఎం మమతకు మాత్రం ఎన్నికల సందర్భంలోనే నందిగ్రామ్ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. మమతను నందిగ్రామ్ ప్రజలను ఓడిస్తారని జోస్యం చెప్పారు.

16. అంబానీ కేసు..అనుమానాలు : –
అంబానీ కేసులో అందరి అనుమానాలే నిజయమయ్యాయి. స్కార్పియో వ్యవహారంలో ఉగ్రలింకులు బయటపడ్డాయి. ఈ కుట్ర వెనుక జైష్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు విచారణలో తేలింది. తీహార్ జైలు నుంచే ఉగ్రవాద చర్యలుకు, బెదిరింపులకు ఈ సంస్థ పాల్పడుతున్నట్లు తేలింది. టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా ఉగ్రవాదులు ఈ చర్యలకు దిగుతున్నట్లు ఢిల్లీ స్పెషల్‌ సెల్ పోలీసులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన మొబైల్‌ ఫోన్‌తో పాటు ఒక సిమ్‌ను తీహార్‌ జైల్‌లో పోలీసులు సీజ్‌ చేశారు. ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నింపిన వాహనాన్ని నిలిపింది తమ మనుషులేనని జైష్-ఉల్-హింద్ సంస్థ గత వారమే ప్రకటించింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, పెద్ద ముప్పు ముందుందని ఈ సంస్థ టెలిగ్రామ్ యాప్ మెసేజ్‌లో హెచ్చరించింది. అయితే దీని వెనుక జైష్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని జరుగుతోన్న ప్రచారాన్ని ముంబై పోలీసులు అప్పట్లో తోసిపుచ్చారు.

మరోవైపు జైష్-ఉల్-హింద్ సంస్థ పేరుతో వచ్చిన మెసేజ్‌ లోకేషన్‌ తీహార్ జైల్లో ఉన్నట్లు ముంబై సైబర్ పోలీసులు గుర్తించారు. దీంతో ఢిల్లీ స్పెషల్‌ పోలీసులు తీహార్‌ జైలులోని 8వ నంబర్‌ సబ్‌ జైల్లో తనిఖీలు చేశారు. అక్కడ నిజంగానే ఉగ్రవాదులు మొబైల్‌ వాడుతున్నట్లు నిర్థారించుకున్నారు. ఇంకా ఆ సబ్‌ జైల్లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది తెహసీన్ అక్తర్ కూడా ఉన్నాడు. హైదరాబాద్ బ్లాస్ట్ కేసులో అక్తర్‌ కూడా నిందితుడే. అతడికి అండర్‌ వరల్డ్‌తో కూడా దగ్గర సంబంధాలున్నాయి. తీహార్ జైలు అధికారుల నుంచి సమాచారం స్వీకరించిన తర్వాత తదుపరి దర్యాప్తు చేయనున్నారు.

17. అదానీకి ఊహించనంత డబ్బు : –
ఇండియన్‌ బిజినెస్‌ టైకూన్‌ గౌతమ్‌ అదానీ… ఒక్క ఏడాదిలోనే ఊహించనంత డబ్బు సంపాదించి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. ఏడాది కాలంలో ఆయన సంపద.. ఏకంగా 16.2 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన సంపద 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ కుబేరులైన అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ కూడా ఒక్క ఏడాది ఆర్జనలో ఇంత వృద్ధి సాధించ లేదని బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెలువరించింది. దీంతో వారి రికార్డ్‌ను కూడా గౌతమ్‌ అదానీ బీట్‌ చేశారు.

అదానీ గ్రూప్‌లోని పవర్‌ ప్లాంట్స్‌, పోర్టులు, ఎయిర్‌పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, డాటా సెంటర్లు, బొగ్గు గనుల ద్వారా ఇంత ఎక్కువ స్థాయిలో లాభాలు గడించారు. గడిచిన ఏడాది కాలంలో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 96 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజేస్‌ 90 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 79 శాతం, అదానీ పవర్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ SEZ లిమిటెడ్‌ 52 శాతం వృద్ధిని సాధించాయి.. ఇక అన్నింటికంటే ఎక్కువగా అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ గతేడాది 500 శాతం వృద్ధిని సాధించింది.. వీటన్నింటిని ఎఫెక్ట్‌ అయన సంపద పెరుగుదలపై భారీగా పడటమే గాక.. సంపదను ఆర్జించడంలో మస్క్‌ను బీట్ చేసేందుకు ఉపయోగపడ్డాయి.

అదానీ ఎంటర్‌ప్రైజేస్ ఇటీవలే వన్‌ గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఇది కూడా ఆయనకు ఖజానాకు కలిసొచ్చేదే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. అదే సమయంలో ఆసియా కుబేరుడు ముఖేశ్‌ అంబానీ ఆదాయం 8.1 బిలియన్‌ డాలర్లు పెరిగినట్టు తెలిపింది బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌.

18. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సంచలన నిర్ణయం : –
అఖిల భారత సాంకేతిక విద్యామండలి సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంజనీరింగ్ లో చేరాలంటే ఇంటర్ లో తప్పనిసరిగా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరిగా చదవాలన్న నిబంధనను రద్దు చేయనుంది. ఇంటర్ లో ఫిజిక్స్, మాథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజీ, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంట్రప్రెన్యూర్ షిప్ తదితర సబ్జెక్టుల్లో ఏమైనా మూడు పాసైన వారు ఇక మీదట ఇంజనీరింగ్ లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది.

2021-22కు గాను తాజాగా హ్యాండ్ బుక్ ను విడుదల చేసింది AICTE. ఈ మూడు సబ్జెక్టులు కలిపి కనీసం 45 శాతం మార్కులు సాధించిన వారు ఇంజనీరింగ్ లో ప్రవేశానికి అర్హులని స్పష్టం చేసింది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో 40 మార్కులు సాధిస్తే ఇంజనీరింగ్ లో అడ్మిషన్ పొందొచ్చు.

ఇంజనీరింగ్ కు మాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు అత్యంత కీలకమైన పునాదులని.. వాటిపై అవగాహన లేని అభ్యర్థులకు ఇంజనీరింగ్ లో ప్రవేశాలు కల్పించడం సరికాదని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీటీఈ తాజా నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. అలాంటి విద్యార్థులకు ఇంజనీరింగ్ లో ప్రవేశాలు కల్పిస్తే రానున్న రోజుల్లో నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఏఐసీటీఈ ఇంజనీరింగ్ కు అవసరమైన మాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను ఇంటర్ లో చదవని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామని తెలిపింది.

19. పాకిస్తాన్ వంకర బుద్ధి : –
పాకిస్తాన్‌ పాలకుల బుద్ధి వంకర అని మరోసారి రుజువైంది. మనపైకి సరిహద్దుల్లో డ్రోన్‌ కెమెరాలు ప్రయోగిస్తున్న పాక్‌ ఆ దేశ ఎగువసభలో స్పై కెమెరాలు వాడింది. ఏకంగా ఆదేశ ఎగువసభ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ పదవుల కోసం జరిగిన రహస్య ఓటింగ్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి అడ్డంగా దొరికిపోయింది. ఓటింగ్ వేసే సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఈ స్పై కెమెరాలను గుర్తించారు.

మార్చ్‌ 3న సెనెట్‌కు ఎన్నికలు జరిగాయి. గెలిచిన ఎంపీలు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఓటింగ్ జరిగింది. ఇందులో ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారో తెలుసుకునేందుకు స్పై కెమెరాల ద్వారా రికార్డ్‌ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

స్పె కెమెరాలు ఇన్‌స్టాల్‌ చేశారని PPP నేత ముస్తఫా నవాజ్‌ ఆరోపించారు. అలాగే స్పై కెమెరాలు బిగించడం చట్టవిరుద్ధం అని మండిపడ్డారు సెనెటర్ రజా రబ్బాని. పోలింగ్‌ బూత్‌లో బిగించిన కెమెరాలను సభలో చూపిస్తూ నినాదాలు చేశారు PPP నేతలు. అయితే PPP నేతల ఆరోపణలపై ప్పాకిస్తాన్ ఫెడరల్ మినిస్టర్‌ ఫవాడ్‌ చౌదరి వివరణ ఇచ్చారు. స్పై కెమెరాలు ఎక్కడా బిగించినట్టు వెలుగులోకి రాలేదన్నారు. అయితే ఈ విషయంపై పలువురు ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. చైనా రహస్య కెమరాలను బయటకు తీసి చూపించారు. సభలో ఎంపీల నిరసన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి.

20. మిథాలీ అరుదైన ఘనత : –
ప్రపంచ మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్‌ అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఈ ఫీట్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనతను అందుకున్నారు. ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌లో అన్నే బోస్క్‌ వేసిన బంతిని బౌండరీగా మలిచిన మిథాలీ ఈ ఫీట్‌ను చేరుకున్నారు. 35 పరుగులు వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఆమె ఈ మైలురాయిని దాటారు.

సుమారు 22 ఏళ్లుగా భారతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మిథాలీరాజ్. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ 1999లో జాతీయ ఉమెన్ క్రికెట్ జట్టులో తొలిసారి స్థానం సంపాదించారు. 25 జూన్ 1999లో ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశారు. మిథాలీ రాజ్‌ వచ్చిన తర్వాత భారత మహిళల క్రికెట్‌లో పెను మార్పులు వచ్చాయి. ఈమె సారథ్యంలోనే భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది. అంతేకాక బలమైన జట్లను మట్టి కరిపించింది. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత మహిళల జట్టుకి రెండు సార్లు కెప్టెన్సీ వహించిన ఏకైక క్రికెటర్‌గా మిథాలీకి అనేక రికార్డులున్నాయి. ప్రస్తుతం టీ-20, టెస్టుల నుంచి రిటైర్ అయిన 38 ఏళ్ల మిథాలి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మెట్లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్న మిథాలీ త్వరలోనే ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంటారని ఎనలిస్టులు చెబుతున్నారు.