News : తెలుగు రాష్ట్రాలు, జాతీయం..20 వార్తలు, సంక్షిప్తంగా

News : తెలుగు రాష్ట్రాలు, జాతీయం..20 వార్తలు, సంక్షిప్తంగా

News

7 PM News : – 

1. ఆధిక్యంలో సురభీ వాణీదేవి :-
మహబూబ్‌నగర్‌ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్‌ ముగిసే వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్‌రావుపై 2 వేల 613 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 17 వేల732, బీజేపీకి 16,173, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 8,594, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 4,980 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్‌లోనూ 3,375 ఓట్లు చెల్లలేదు. రెండు రౌండ్లలో కలిపి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవికి 35,171 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 32,558 ఓట్లు వచ్చాయి. ఇప్పటికి రెండు రౌండ్ల కౌంటింగ్‌ మాత్రమే పూర్తైంది. ఇంకా ఐదు రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. అప్పటికీ ఎవరికీ మొదటి ప్రాధాన్యతా ఓట్లలో మేజిక్‌ మార్క్ రాకపోతే రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే రేపు సాయంత్రానికి కానీ ఫలితం వచ్చేలా కనిపించడం లేదు.

2. ఆధిక్యంలో పల్లా :-
నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి దూసుకెళ్తున్నారు. నాలుగు రౌండ్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 63 వేల 442 ఓట్లు. తీన్మార్‌ మల్లన్నకు 48 వేల 4, కోదండరామ్‌కు 39 వేల615, ప్రేమేందర్‌రెడ్డికి 23 వేల 703, రాములు నాయక్‌కు 15 వేల934 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు 12 వేల 475 చెల్లని ఓట్లను గుర్తించారు.

నాలుగు రౌండ్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 15 వేల 897 మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. రెండోస్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కొనసాగుతున్నారు. ఆయనకు 12 వేల146, ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు 10 వేల 48, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 5 వేల99 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4 వేల 3 ఓట్లు పోలయ్యాయి. 3 వేల 223 ఓట్లు చెల్లకుండా పోయాయి. ప్రస్తుతం ఐదో రౌండ్‌ ఓటింగ్ కొనసాగుతోంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 15 వేల 438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో తీన్మార్‌ మల్లన్న, మూడోస్థానంలో కోదండరామ్‌ కొన‌సాగుతున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొత్తం 7 రౌండ్లను లెక్కించనున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను కౌంట్ చేయనున్నారు. సెకండ్‌ ప్రియారిటీ ఓట్లను కూడా లెక్కించాల్సి వస్తే రేపు సాయంత్రానికి కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

3. తెలంగాణ బడ్జెట్ : –
రైతులకు భరోసా ఇస్తూ.. పేదలకు బాసటగా నిలిచే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సంక్షేమ రంగానికి పెద్దపీట సర్కార్ పెద్దపీట వేసింది. ద‌ళిత అభ్యున్నతికి వ‌రాల వ‌ర్షం కుర‌పించింది. వెయ్యి కోట్ల నిధుల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్ రూపొందించింది. ఎస్సీల ప్రత్యేక ప్రగ‌తి నిధి కోసం రూ. 21 వేల 306 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగ‌తి నిధి కోసం రూ. 12 వేల 304 కోట్లు కేటాయించింది.

2 లక్షల 30 వేల 825 కోట్లతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. రెవెన్యూ వ్యయం లక్షా 69 వేల 383 కోట్లుగా పేర్కొన్నారు. క్యాపిటల్‌ వ్యయం 29 వేల 46.77 కోట్లుగా ఉంది. రెవెన్యూ మిగులు 6 వేల 743.50 కోట్లు, ఆర్థిక లోటు 45 వేల 509 కోట్లుగా బడ్జెట్‌గా ప్రభుత్వం ప్రకటించింది. గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్‌ దాదాపు 25 శాతానికి పైగా పెరిగింది.

వ్యవ‌సాయ రంగానికి 25 వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. రైతు రుణమాఫీకి 5 వేల 225 కోట్లు కేటాయించింది. రైతులకు ఇప్పటికే 25 వేల లోపు ఉన్న రుణాల‌ను మాఫీ చేశామ‌న్న హరీశ్‌రావు… త్వర‌లోనే మిగతా రుణాల‌ను మాఫీ చేస్తామ‌న్నారు. రైతుబంధు ప‌థ‌కం కోసం 14వేల 800 కోట్లు, రైతుబీమాకు రూ. 12 వందల కోట్లు, వ్యవ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు 15 వందల కోట్లు ప్రతిపాదించింది ప్రభుత్వం.

నీటిపారుదల శాఖకు 16 వేల 931 కోట్లు కేటాయించింది సర్కార్. ఆసరా పింఛన్ల కోసం 11 వేల 728 కోట్లు, కళ్యాణలక్ష్మి షాదీముబారక్‌ పథకాలకు 2 వేల 750 కోట్లు కేటాయించింది. బీసీల కల్యాణలక్ష్మీకి అదనంగా 500 కోట్లు.. ఎంబీసీ కార్పొరేషన్‌ కోసం వెయ్యి కోట్లు, బీసీ సంక్షేమం కోసం 5 వేల 522 కోట్లు ప్రకటించారు. మైనార్టీ సంక్షేమశాఖకు వెయ్యి 606 కోట్లు కేటాయించారు.

మహిళా సంఘాలకు ఈ ఏడాది రూ.3 వేల కోట్లు ఇవ్వనుంది. పాఠశాల విద్యకు 11 వేల 735 కోట్లు, ఉన్నత విద్యకు వెయ్యి 873 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల సౌకర్యం, బృహత్తర విద్యా పథకం కోసం ఈ ఏడాది 2 వేల కోట్లతో ప్రతిపాదనలు చేసింది. ఆర్టీసీని నష్టాల్లో నుంచి గట్టెక్కించేందుకు వేయి 276 కోట్లు కేటాయింపులు చేసింది ప్రభుత్వం. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు రూ.11వేల కోట్లు, దేవాదాయశాఖకు 720 కోట్లు, అటవీశాఖకు 12 వందల 76 కోట్లు ప్రతిపాదించింది. వైద్యారోగ్యశాఖకు 6 వేల 295 కోట్లు కేటాయించింది. ఇక సంక్షోభం నుంచి పూర్తిస్థాయిలో గట్టెక్కిన విద్యుత్ రంగానికి 11 వేల 46 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకుగాను… 2500 కోట్లు, పారిశ్రామిక రంగ అభివృద్ధి 3 వేల 77 కోట్లు, అలాగే ఐటీ రంగానికి 360 కోట్ల నిధులు ప్రతిపాదించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29 వేల 271 కోట్లు, మున్సిపల్ శాఖకు 15 వేల 30 కోట్లు, మూసీ ప్రక్షాళన కోసం 200 కోట్లు, హైదరాబాద్‌ తాగునీటికి 250 కేటాయించింది.

4. బడ్జెట్ పై విపక్షాల పెదవి విరుపు :-
తెలంగాణ బడ్జెట్ అంకెల గారడి అన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అరచేతిలో వైకుంఠం చూపెట్టిందన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా ఆర్థిక లోటుని 45 వేల 509కోట్ల రూపాయలు చూపించారన్నారు.అప్పుల భారాన్ని మరింత పెంచుతూ..ప్రజలను భ్రమల్లో ఉంచే బడ్జెట్‌ తప్పితే వాస్తవాలకు దగ్గరలో లేదని మండిపడ్డారు భట్టి. బడ్జెట్‌లో అసలు కొత్తదనమే లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇల్లు, నిరుద్యోగ భృతి అంశాలే లేవని దుయ్యబట్టారు.

2 లక్షల 30 వేల కోట్ల రూపాయలకు పైగా అంచనాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పుస్తకాలకే పరిమితమవుతుందని.. దీన్ని అమలు చేయరన్నారు బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్‌ అన్నారు. మూసీ నదికి కేటాయించిన డబ్బు ఏమూలకు సరిపోదన్నారు. క్రీడా రంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ మేడిపండు చందంగా ఉందంటూ విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుమ ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ చూస్తే కళ్లు తిరిగి కింద పడాల్సిందేనని సెటైర్ వేశారు. గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయిస్తామని హామి ఇచ్చినా ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. విపక్షాల విమర్శలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అన్నారు. అన్నిరంగాలకు.. అన్ని వర్గాలకు పెద్దపీట వేశామన్నారు. వ్యవసాయ రంగానికి, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు కేటాయించామన్నారు.

5. అమరావతి అసైన్డ్ భూములు : –
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహరంపై ఏపీ సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గత ప్రభుత్వంపై కేసుపెట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సీఐడీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపింది. కేసు సంబంధించి ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. సీఐడీ అధికారులకు పూర్తి ఆధారాలను సమర్పించినట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. IAS అధికారుల మాటలను లెక్క చేయకుండా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. రెవెన్యూ యాక్ట్ దెబ్బతింటుందని అధికారులు హెచ్చరించినా పెడచెవిన పెట్టారన్నారు. చంద్రబాబు, నారాయణ చేసిన డిజిటల్‌ సంతకాల నోట్‌ ఫైల్‌ను సీఐడీకి అందించినట్లు చెప్పారు. అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారా అని విమర్శించిన టీడీపీపై ఘాటుగా స్పందించారు రామకృష్ణారెడ్డి. ఎస్సీ వ్యక్తిని కాకపోతే ఫిర్యాదు చేయకూడదు అని రాజ్యాంగంలో రాసి ఉందా? అని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూముల వ్యవహారంలో కీలకంగా మారిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పుడున్న గన్‌మెన్లకు అదనంగా మరో నలుగురు గన్‌మెన్లను కేటాయించింది.

6. బాబు క్వాష్ పిటిషన్..హైకోర్టులో విచారణ : –

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి నారాయణ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి అసైన్డ్‌ల్యాండ్‌ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలంటూ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చిన సీఐడీ అధికారులు… తన నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేయడం చట్టవిరుద్ధమని నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు.

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో… చంద్రబాబు మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఈనెల 22న నారాయణ.. ఈనెల 23న చంద్రబాబు విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీలోని 41(ఏ)(1) కింద సీఐడీ నోటీసులిచ్చింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని వివరించింది. దీంతో సీఐడీ ముందు హాజరుకావొద్దని టీడీపీ నేతలు నిర్ణయించారు. అసలు ఆ కేసే తప్పుడు కేసు అని.. ఆ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అటు హైకోర్టులో తీర్పు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలన్న విషయంపైనా టీడీపీ నేతలు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు.

7. ఏపీలో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీల పాలక మండళ్లు : –
ఆంధ్రప్రదేశ్‌లో 11 కార్పొరేషన్‌లు, 75 మున్సిపాలిటీల పాలకమండళ్లు కొలువుదీరాయి. సభ్యుల ప్రమాణస్వీకరణ అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్ చైర్మన్, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకున్నారు. రెండో డిప్యూటీ మేయర్‌, వైస్‌ చైర్మన్‌ల కోసం ఎస్‌ఈసీ మరోసారి నోటిఫికేషన్ ఇవ్వనుంది. గ్రేటర్ విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌ ప్రమాణస్వీకారం చేశారు. గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌గా డైమండ్‌ బాబు ఎన్నియ్యారు. విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ ఎన్నికయ్యారు. విజయనగరం మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి ప్రమాణం చేశారు.

తిరుపతి మేయర్‌గా డా.శిరీషా, డిప్యూటీ మేయర్‌గా ముద్ర నారాయణ ప్రమాణం చేశారు. చిత్తూరు మేయర్‌గా అముద, డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు. ఒంగోలు కార్పొరేషన్ మేయర్‌గా గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ ప్రమాణం చేశారు. కడప మేయర్‌గా సురేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా షేక్ ముంతాజ్ బేగం ప్రమాణం చేశారు. అనంతపురం కార్పొరేషన్ మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్‌గా దాసరి వాసంతి సాహిత్య ఓథ్ తీసుకున్నారు.

మున్సిపల్ చైర్మన్‌ ల ఎన్నిక రాష్ట్రమంతటా సాఫీగా సాగినప్పటికీ కడప జిల్లా మైదుకూరులో కాస్త టెన్షన్‌ పుట్టించింది. ఎక్స్‌ అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీని వైసీపీ చేజిక్కించుకుంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మాచునూరు చంద్ర ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్‌, జనసేన కౌన్సిలర్‌ గైర్హాజరయ్యారు. దీంతో సులువుగానే మైదుకూ రు మున్సిపాలిటీని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.

8. వైసీపీలో చిచ్చు : –
మేయర్, మున్సిపల్ చైర్మన్‌ల ఎంపిక వైసీపీలో చిచ్చుపెట్టింది. పదవులు రానివారు పార్టీపై ఫైర్‌ అయ్యారు. పార్టీ కోసం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసినా విశాఖ మేయర్‌గా ఎంపిక చేయలేందటూ వంశీకృష్ణ శ్రీనివాస్‌ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మద్దతుదార్లు జీవీఎంసీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. వంశీకృష్ణ శ్రీనివాస్‌కు తప్పకుండా న్యాయం చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. పార్టీ తనకు అన్యాయం చేసిందటూ సభ్యత్వానికి రాజీనామా చేశారు వంశీకృష్ణ శ్రీనివాస్.

అటు విజయవాడ వైసీపీలోనూ మేయర్‌ ఎన్నిక అగ్గిరాజేసింది. తనకు మేయర్‌ పదవి ఇవ్వకపోవడంపై 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ పుణ్యశీల అలకబూనారు. అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి సైతం గైర్హాజరయ్యారు. పుణ్యశీలకు మేయర్‌ పదవి దక్కకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని ఆమె మద్దతుదార్లు ఆరోపించారు. నందికొట్కూరు మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవిని మైనార్టీ వర్గానికి కాకుండా వేరే వ్యక్తికి కట్టబెట్టడంతో ఇద్దరు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. రబ్బానీ, జాకీర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో బైరెడ్డి సిద్దార్థ్‌రెడ్డి వారిని బుజ్జగిస్తున్నారు.

9. తాడిపత్రి మున్సిపల్ టీడీపీ వశం : –
ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలటిలో ఒక్క తాడిపత్రిని మాత్రమే తెలుగుదేశం పార్టీ దక్కించుకోగలిగింది. రాష్ట్రమంతా వైసీపీ హవా సాగినా.. తాడిపత్రిలో మాత్రం టీడీపీని గెలిపించుకుని మున్సిపల్ ఛైర్మన్ అయిపోయారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.
ఫలితాలు వెలువడిన రోజు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వరకు రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులుండగా టీడీపీ 18, వైసీపీ 16, సీపీఐ, స్వతంత్రులు తలొకటి గెలుచుకున్నారు. ముందు నుంచే సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి మద్దతిచ్చారు. ఎక్స్‌అఫీషియో సభ్యులను కలుపుకుంటే వైసీపీకి 18 మంది సభ్యుల బలం ఉంది. దీంతో రెండు పార్టీలు తమ కౌన్సిలర్లను క్యాంప్‌లకు తరలించాయి. టీడీపీ స్వతంత్ర అభ్యర్థి, సీపీఐని కూడా తమ క్యాంప్‌కే తీసుకెళ్లింది. ప్రమాణస్వీకారానికి క్యాంప్‌ నుంచే నేరుగా మున్సిపల్‌ ఆఫీస్‌కి తీసుకువచ్చారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాత.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ ఎంపిక జరిగింది. మున్సిపల్ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌గా పి.సరస్వతి ఎంపికైనట్లు ప్రిసిడింగ్ అధికారి ప్రకటించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాల్టీ అభివృద్ధికి అందరితో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. ప్రలోభాలకు గురిచేయకుండా ..సామరస్యంగా ఎన్నిక జరిగినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాడిపత్రి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు. 180321-289 ఇక తాడిపత్రి మున్సిపాలిటీలో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. గెలిచిన తర్వాత మాజీ ఎమ్మెల్యేకు చైర్మన్ పదవిపై మోజు వచ్చిందని విమర్శించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.

10. ఎస్ఈసీకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు :-
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‍కు ప్రివిలేజ్ కమిటి నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నోటీసులను పంపించారు. ఎన్నికల సమయంలో హౌస్‌ అరెస్ట్ చేయడం, మీడియాతో మాట్లాడొద్దంటూ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేశారు. వీటిపై చర్చించిన కమిటి… నిమ్మగడ్డకు నోటీసులు ఇచ్చింది. విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులో తెలిపింది. అయితే రేపటి నుంచి సెలవుపై వెళ్లడానికి గవర్నర్ అనుమతి కోరారు నిమ్మగడ్డ. దీంతో ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో ఆయన సెలవుపై వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇటు ఏపీలో జరగాల్సిన మిగిలిన ఎన్నికలను కూడా ఎస్‌ఈసీ త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందన్నారు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు పూర్తి అయితే .. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు సీఎం జగన్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. రాజకీయ తతంగం త్వరగా పూర్తైతే సంక్షేమంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నారు సజ్జల. గతంలో నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు జరపొద్దని పట్టుబట్టిన వైసీపీ ఇప్పుడు మనసు మార్చుకోవడం చర్చనీయాంశమైంది. ఎస్‌ఈసీగా రమేశ్‌ కుమార్ నిర్వహించిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అందుకే నిమ్మగడ్డ హయాంలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు వైసీపీ నేతలు చెబుతున్నారు.

11. తిరుపతి ఉప ఎన్నిక పార్టీల ఫోకస్ : –
తిరుపతి ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్‌ చేశాయి. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ ప్రచార వ్యూహాల్లో నిమగ్నమైంది. అటు ప్రతిపక్ష టీడీపీ సైతం బై పోల్‌లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంది. మంగళగిరిలోని పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ నేతలు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాంటివారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు జరిగేలోపు ఇదే పెద్ద ఉప ఎన్నికగా భావించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పది ముఖ్యమైన అంశాలు గుర్తించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు చంద్రబాబు.
తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని నేతలకు సూచించారు. ఐదుగురు సభ్యులతో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు ఖరాకండిగా చెప్పేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతున్నాయని అసహనం వ్యక్తంచేశారు. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికను కసరత్తు ముమ్మరం చేసింది. మాజీ ఐఏఎస్‌ అధికారిని బరిలోకి దించాలని కమలం పార్టీ యోచిస్తుంది

12. భట్టి విక్రమార్కకు తలనొప్పులు : –
మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్కకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. భట్టి విక్రమార్క ఛాంబర్‌లో జేసీ ఎపిసోడ్‌పై హైకమాండ్ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ భట్టిని వివరణ కోరారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుంటే… జేసిని ఎందుకు వారించలేదని భట్టిని నిలదీశారు ఠాగూర్. దీంతో భట్టి విక్రమార్క హైకమాండ్‌కి వివరణ లేఖ పంపారు.
మంగళవారం తెలంగాణ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన దివాకర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌లో భవిష్యత్‌ లేదని, కొత్త మార్గాలు చూసుకోవాలని టీకాంగ్రెస్‌ నేతలకు సూచించారు. కేసీఆర్‌పై పోరాడే సత్తా మీకు లేదని ముఖం మీదే చెప్పేశాడు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎప్పటికీ అధికారంలోకి రాదని కుండ బద్దలు కొట్టాడు. అక్కడితో ఆగకుండా రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఈ కామెంట్స్‌ అధిష్టానానికి కోపం తెప్పించాయి. జేసీ అంతలా మాట్లాడుతుంటే ఎందుకు నిలువరించలేకపోయారంటూ భట్టిపై అధిష్టానం ఫైర్‌ అయింది.

13. కరీంనగర్ జిల్లా నేతలతో షర్మిల సమ్మేళనం : –
తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు షర్మిల. వైఎస్సార్ అభిమానులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వామన్‌రావు దంపతుల హత్యలో అధికార పార్టీ హస్తం ఉండటం దారుణమన్నారు షర్మిల. కాళేశ్వరం గురించి తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని….ఎల్లంపల్లి, మిడ్ మానేర్ కట్టించిన ఘనత వైయస్సార్‌దే అన్నారు.

కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్ పాత్ర చాలా ఉందన్నారు షర్మిల. కరీంనగర్ కమాన్‌ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోందన్నారు. సింగరేణి తెలంగాణకు తలమానికమన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు ఈ జిల్లాలోనే కనిపిస్తారన్నారు షర్మిల. కేసీఆర్ బీడీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. రాజన్న పాలన వస్తేనే కరీంనగర్ జిల్లా సమస్యలు పరిష్కార మవుతాయన్నారు.

ఇటీవల ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన వైఎస్‌ఆర్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఖమ్మం జిల్లాలో జరిగే ఆవిర్భావ సభ కోసం అభిమానులు భారీగా తరలిరావాలన్నారు షర్మిల. తాను ఎవరు వదిలిన బాణం కాదని.. బీజేపీ, టీఆర్ఎస్‌ బీ టీమ్‌ అసలే కాదని క్లారిటీ ఇచ్చారు షర్మిల. ఏప్రిల్‌9న షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

14. పశ్చిమ బెంగాల్ లో మోడీ : –
పశ్చిమబెంగాల్ ప్రచారంలో స్పీడ్ పెంచారు ప్రధాని మోదీ. పురులియా జిల్లాలో క్యాంపెయిన్ చేసిన మోదీ.. దీదీపై నిప్పులు చెరిగారు. టీఎంసీ అంటే ట్రాన్స్‌ఫ‌ర్ మై క‌మీష‌న్ అని ఎద్దేవా చేశారు. క‌మీష‌న్ ఇస్తేనే టీఎంసీ పార్టీ ఏ ప‌నైనా చేస్తోంద‌న్నారు. బీజేపీ ప్రభుత్వం DBT- అంటే డైర‌క్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ అని… తాము నేరుగా ఖాతాల్లో అమౌంట్‌ను జ‌మ చేస్తున్నామ‌న్నారు. రైతుల అకౌంట్లకు కేంద్ర ప్రభుత్వం నేరుగా డ‌బ్బును వేస్తే, ఆ అమౌంట్ వారికి ముట్టకుండా టీఎంసీ కుట్ర చేస్తుందన్నారు.
మమత బెంగాల్ ప‌రిస్థితిని అత్యంత ద‌యనీయంగా మార్చేసారన్నారు మోదీ.

రాష్ట్రంలో నేర‌స్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నార‌ని ఆరోపించారు. క్రైమ్ ఉంది, క్రిమిన‌ళ్లు ఉన్నారు కానీ వాళ్లు ఎవ‌రూ జైళ్లలో లేర‌ని ప్రధాని విమ‌ర్శించారు. మాఫియా ఉంది.. ఉగ్రవాదులున్నారు.. కానీ వాళ్లంతా స్వేచ్ఛగా తిరుగుతున్నార‌న్నారు. సిండికేట్లు ఉన్నాయి, స్కీమ్‌లు ఉన్నాయి.. కానీ ఎక్కడా విచార‌ణ జ‌ర‌గ‌డంలేద‌ని దీదీపై ఫైర్ అయ్యారు. ఈ పరిస్థితులన్నీ మారాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. మే 2న బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని ప్రధాని జోస్యం చెప్పారు. ఇక దీదీ కాలికి గాయ‌మైన‌ప్పుడు తాను కూడా చింతించిన‌ట్లు ప్రధాని మోదీ తెలిపారు. కూతుళ్లను గౌరవించడం మన సంప్రదాయమని..అదే తరహాలో మమతా బెనర్జీ అంటే తనకెంతో గౌరవమన్నారు మోదీ

15. అమ్మాయిలు టోన్డ్ జీన్స్ : –
అమ్మాయిలు టోన్డ్‌ జీన్స్‌ వేసుకోవడంపై ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌ సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తీరథ్ సింగ్ కామెంట్‌కు బిగ్‌ బి అమితా బచ్చన్ మనవరాలు నవ్య ఘాటుగా బదులిచ్చారు. డెహ్రాడూన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తీరథ్‌ సింగ్.. మహిళలు టోన్డ్‌ జీన్స్‌ ధరించి సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? అంటూ కామెంట్ చేశారు.

తీరథ్ సింగ్ రావత్ వ్యాఖ్యలను బిగ్‌బి మనవరాలు నవ్య నవేలి నందా తప్పుబట్టారు. టోన్డ్‌ జీన్స్‌ ధరించిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. అటువంటి దుస్తులు వేసుకోవడాన్ని తాను గర్వంగానే ఫీల్‌ అవుతానన్నారు. మహిళల వస్త్రధారణను మార్చడానికంటే ముందు మీ అభిప్రాయాలు, ఆలోచనా విధానాన్ని మార్చుకోండంటూ పోస్ట్ పెట్టింది. తీరథ్ సింగ్ వ్యాఖ్యల నుంచి సమాజంలోకి వెళ్లే సందేశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని నవ్య ఇన్‌స్టాలో పేర్కొంది. కొద్దిసేపటి తర్వాత దాన్ని డిలీట్‌ చేసినప్పటికీ నవ్య పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

తీరథ్ సింగ్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓసారి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ రిప్డ్‌ జీన్స్‌ ధరించిందన్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారని.. అలాగే ఆమె ఒక NGOని సైతం నడుపుతుందని..ఇలాంటి దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు మరోసారి మహిళల వస్త్రధారణపై కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డారు.

16. కరోనా కేసులు టి.హైకోర్టు ఆగ్రహం : –
కరోనా కేసులు పెరగుతుండటంపై తెలంగాణ హైకోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 7, 11 తేదీల్లో 20 వేల లోపు టెస్టులు మాత్రమే చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అంత్యక్రియలు, పెళ్ళిల్లో 100 మందికి మించారదని తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్‌ కేసులు ఎక్కువ వచ్చే ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని తెలిపింది. నిత్యం 50 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది హైకోర్ట్‌.

తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటి వరకు మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వేదికగా వెలుగు చూసిన వైరస్‌ తాజాగా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, కాలేజీల్లో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్దులకు కరోనా సోకింది. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో 20 మంది విద్యార్థులతో పాటు నాగోల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్‌ కూడా దీని బారిన పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ జెడ్‌పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో 8 మంది ఉపాధ్యాయులకు వైరస్‌ సోకింది. జగిత్యాల జిల్లాలోని స్కూల్స్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులకు వైరస్‌ సోకుతోంది. యాదాద్రి జిల్లా రాజపేట ప్రభుత్వ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులను స్కూల్‌కు పంపాలంటేనే పేరెంట్స్ వణికిపోతున్నారు.

17. భారత్ లో కరోనా : –
భారత్‌ను కరోనా భయపెడుతుంది. రోజరోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. 24 గంటల్లో 35 వేల 871 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 14 లక్షలు దాటింది. కొత్తగా 17 వేల 741 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 96.65శాతం నుంచి 96.56శాతానికి తగ్గింది.

మహారాష్ట్రలో పరిస్థితి నానాటికీ ఆందోళనకరంగా మారుతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 65శాతం కేసులు ఒక్క ఈ రాష్ట్రంలోనే ఉండటం కలవరపెడుతోంది. తాజాగా 23వేల 179 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 172 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 84 మంది మరణించారు. రోజువారీ మరణాల్లో 85శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే చోటుచేసుకుంటాయి. 24 గంటల వ్యవధిలో పంజాబ్‌లో 35, కేరళలో 13, తమిళనాడులో 8, ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు కరోనాకు బలయ్యారు.

ఇప్పటికే పలు నగరాల్లో కర్ఫ్యూ విధించిన మహరాష్ట్ర ప్రభుత్వం ముంబైలోనూ ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ప్రజలు భౌతికదూరం పాటించాలని.. మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తంచేసింది. నిబంధనలు ఉల్లంఘించినవారికి ఫైన్లు విధిస్తుంది. అయినా మార్పు రాకపోతే కఠిన ఆంక్షలు తప్పని హెచ్చరించింది.

18. టోల్ ప్లాజాలకు మంగళం : –
ఇకపై వాహనదారులకు టోల్‌ ప్లాజా దగ్గర వెయిట్ చేయాల్సి అవసరముండదు. వచ్చే ఏడాది నుంచి దేశంలో టోల్ ప్లాజాలను ఎత్తివేయనుంది కేంద్రం. టోల్ ప్లాజాలకు మంగళం పాడుతున్నట్టు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో ప్రకటించారు. వచ్చే ఏడాది లోపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌ ప్లాజాలను తీసివేస్తున్నట్లు తెలిపారు. వాహనాల్లో జీపీఎస్‌ సిస్టం ద్వారా టోల్‌ చార్జీలు వసూలు చేయనున్నారు.

గత ప్రభుత్వాలు అన్యాయంగా పట్టణ ప్రాంతాల్లో టోల్‌ ప్లాజాలను ఏర్పాటు చేశాయని గడ్కరీ అన్నారు. టోల్‌ప్లాజాలను తీసివేయడం ద్వారా జాతీయ రహదారులపై ప్రయాణం సాఫీగా సాగుతుంది. వాహనాలు ఎవ్వరూ ఆపేవారు ఉండరు. దీంతో సమయం ఆదా అవుతుంది. రోడ్డుపై కెమెరాలు ఏర్పాటు చేస్తారు. జీపీఎస్ సిస్టం ఆధారంగా ప్రయాణించిన దూరానికి తగినట్లుగా వాహనదారుల బ్యాంకు అకౌంట్‌ నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని వసూలు చేయనున్నారు. అటు ఫాస్టాగ్‌ ఉపయోగించని వారిపై పోలీస్‌ దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు గడ్కరీ.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 93శాతం వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లిస్తున్నారు. ఈ సిస్టం ద్వారా రోజుకు రూ.100 కోట్లు ఆదాయం వస్తోంది.

19. రితికా ఫోగాట్ ఆత్మహత్య : –
ప్రముఖ రెజ్లర్లు గీతా, బ‌బితా పొగాట్‌ సోద‌రి రితికా ఫోగాట్ ఆత్మహ‌త్య కలకలం సృష్టిస్తోంది. అది హత్యా ఆత్మహత్యా దర్యాప్తు చేయాలంటూ రెజ్లింగ్ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిజానిజాలు వెల్లడించాలన్నారు. రితిక ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినంత మాత్రానే ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె స్నేహితులు చెబుతున్నారు.

భ‌ర‌త్‌పూర్‌లో బుధ‌వారం జరిగిన ఫైన‌ల్లో కేవ‌లం ఒక్క పాయింట్ తేడాతో ఆమె ఓడిపోయింది. ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ద్రోణాచార్య అవార్డు విన్నర్ అయిన ప్రముఖ రెజ్లర్ మ‌హావీర్ సింగ్ ఫోగాట్ ద‌గ్గర ఆమె శిక్షణ పొందింది. గ‌త ఐదేళ్లుగా మ‌హావీర్ ఫోగాట్ స్పోర్ట్స్ అకాడ‌మీలో ఆమె శిక్షణ తీసుకుంటోంది. రితికా ఆత్మహ‌త్యపై విచార‌ణ జ‌రుపుతున్నట్లు హ‌ర్యానా- చ‌ర్ఖి దాద్రి జిల్లా ఎస్పీ తెలిపారు. మ్యాచ్‌లో ఓడిపోవ‌డం కార‌ణంగానే ఆమె ఆత్మహ‌త్య చేసుకొని ఉండొచ్చని ఆయ‌న తెలిపారు. రితికా మృతికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు

20. తిరుమల హుండీ ఆదాయం :-
కరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్‌ ఆదాయం వస్తోంది. ఈ ఒక్కరోజే తిరుమలేశునికి హుండీ ద్వారా 5కోట్ల 21లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. గత 9 ఏళ్లలో ఒక్క రోజులో ఈ స్థాయిలో హుండీ ఆదాయం రావడం ఇదే ప్రథమం. గతంలో 2012 ఏప్రిల్‌ 1న స్వామివారికి అత్యధికంగా 5కోట్ల 73లక్షల హుండీ ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే ప్రథమం.

కరోనా కారణంగా తిరుమలలో భక్తులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. పరిమిత స్థాయిలోనే భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా కంటే ముందు నాటి పరిస్థితి ఇంకా నెలకొనలేదు. ఈ సమయంలో తిరుమలేశునికి 5కోట్లకు పైగా ఆదాయం రావడం ఆసక్తిని రేపుతోంది. భక్తుల సంఖ్య తగ్గినా హుండీ ఆదాయం పెరిగింది. సాధారణంగా కరోనాకు ముందు రోజుల్లో కూడా రోజుకు హుండీ ఆదాయం 2కోట్ల లోపలే ఉండేది. కరోనా కారణంగా తిరుమల హుండీ ఆదాయం ఇటీవల భారీగా తగ్గింది. కొన్ని నెలల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. తర్వాత భక్తులకు ప్రవేశం కల్పించినా ఆంక్షలు కొనసాగించారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించారు. వృద్ధులు, చిన్నారులపై ఆంక్షలు విధించారు. ఇటీవలే వృద్ధులను కూడా అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా అదుపులోకి వస్తే పూర్తిస్థాయిలో భక్తులను అనుమతించాలని టీటీడీ భావిస్తోంది.