పోలవరం.. కాఫర్ డ్యామ్ నిర్మాణం 85 శాతం పూర్తి

  • Published By: sreehari ,Published On : November 6, 2020 / 02:28 PM IST
పోలవరం.. కాఫర్ డ్యామ్ నిర్మాణం 85 శాతం పూర్తి

Polavaram project of Coffer Dam report : పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైనది కాఫర్ డ్యామ్ నిర్మాణం. ఇప్పటికే.. ఎగువ కాఫర్ డ్యామ్ 85 శాతం పూర్తి అయింది. రెండు కాఫర్ డ్యామ్‌లకు మధ్యలో గోదావరి అడుగున ఉన్న డయాఫ్రాం వాల్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తైంది.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైపు నిర్మాణం చేపడుతున్న పవర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా.. రెండు కొండల మధ్య గ్యాప్ వన్‌లో ప్లాస్టిక్ కాంక్రీట్‌తో డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడుతున్నారు.



ఇలా.. ప్లాస్టిక్ కాంక్రీట్‌తో మూడు చోట్ల గ్యాప్‌లను అనుసంధానం చేస్తూ.. ప్రధాన డ్యామ్‌కు డయాఫ్రాం వాల్‌ను కలుపుతారు. మట్టి, రాళ్ల తవ్వకం పనులు దాదాపు 96 శాతం పూర్తయ్యాయి.

ప్రాజెక్టులోని స్పిల్ వే, స్పిల్ చానల్‌ పనులతో కలిపి.. ఇప్పటివరకు 90 శాతం కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా.. 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా.. 33.88 లక్షల క్యూబిక్ మీటర్ల పనులూ పూర్తిచేశారు.

ఇంకా.. 5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంది. కుడి కాలువ పనులు 100 శాతం పూర్తయ్యాయి. ఎడమ కాలువ పనులు 80 శాతం పూర్తయ్యాయి.

రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 82 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు 85 శాతం, ట్విన్ టన్నెల్ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇప్పటికే డయాఫ్రాం వాల్ నిర్మాణం, జెట్ గ్రౌటింగ్ పనులు 100 శాతం పూర్తవడంతో.. వీటిపైనే ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం పూర్తిచేయనున్నారు.



ఈ ఏడాది అక్టోబర్ 20న కేంద్రప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నాటికి మొత్తం పోలవరం ప్రాజెక్టు.. 41 శాతం పూర్తైంది. అందులో నిర్మాణ పనుల 72 శాతం పూర్తి కాగా.. భూసేకరణ, పునరావాసం మాత్రం 20 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
Polavaram project పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన స్పిల్ వే నిర్మాణంలో.. 52 పిల్లర్ల నిర్మాణం వంద శాతం పూర్తైంది. 52 పిల్లర్లను.. 52 మీటర్లకు పైగా నిర్మించారు. ఇప్పుడు వీటిపై.. బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది.

ఓ వైపు ప్రతిపక్షాలు పోలవరం పనులు ముందుకు సాగడం లేదని విమర్శిస్తున్నా.. కేంద్రంప్రభుత్వం నిధుల విషయంలో కోతలు విధిస్తున్నా.. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మాత్రం నిరాటంకంగా కొనసాగుతున్నాయి.