SVBCని ముంచెత్తిన వరుస వివాదాలు…మంట కలుస్తోన్న TTD ప్రతిష్ట

  • Published By: bheemraj ,Published On : November 13, 2020 / 08:34 AM IST
SVBCని ముంచెత్తిన వరుస వివాదాలు…మంట కలుస్తోన్న TTD ప్రతిష్ట

SVBC controversies : శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీ భక్తి ఛానల్ గతి తప్పుతోంది. వరుస వివాదాలతో SVBC… TTD ప్రతిష్టను దిగజారుతోంది. నాసిరకం ప్రసారాలు మొదలు నిధుల దుర్వినియోగం, సిబ్బంది నిర్లక్ష్యం.. చివరకు అశ్లీల దృశ్యాల వరకు అనేక ఘటనలతో భక్తి ఛానల్ పరువు మంట కలుస్తోంది. అటు ఛానల్‌ను గాడిన పెట్టడం TTD కి రానురానూ క్లిష్టంగా మారుతుంది.



శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్.. తిరుమల వెంకన్న వైభవాన్ని నలుదిక్కులా వ్యాప్తి చేసే లక్ష్యంతో టీటీడీ ఈ ఛానల్‌ను 2008లో నెలకొల్పింది. అయితే ఇప్పటివరకు ఈ ఛానెల్ నుంచి TTD ఒక్క రూపాయి కూడా ఆర్జించలేదు. తెల్ల ఏనుగులా మారిన ఈ ఛానల్‌ను భరిస్తున్నా.. పైపెచ్చు వరుస వివాదాలు ఛానల్ ను ముంచెత్తడం TTDకి తలనొప్పిగా మారింది. థార్మిక ప్రచారం సంగతి దేవుడెరుగు… తీరా ఈ ఛానెల్ కారణంగా టీటీడీ ప్రతిష్ట మంట కలుస్తోంది.



SVBCకి తిరుపతి, తిరుమలతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో స్టూడియోలు, కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఛానెల్ లో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఛానెల్‌కు ప్రతీ బడ్జెట్‌లో టీటీడీ నిధులు పెంచుతూ వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో నిధుల వినియోగంపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు SVBC చైర్మన్‌గా కొనసాగిన కాలంలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సీరియల్స్ పేరిట హిందూ ధార్మిక ప్రచార ముసుగులో స్వామి నిధులు గోల్ మాల్ జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.



గత ఏడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని వివాదాలు కలకలం రేపాయి. అప్పట్లో SVBC ఛైర్మన్‌గా ఉన్న నటుడు పృథ్వీరాజ్.. ఓ మహిళా ఉద్యోగితో మాట్లాడిన ఆడియో టేప్‌లు TTDకి మాయని మచ్చగా మారింది. ఈ వ్యవహారంలో ఆయన భక్తి ఛానల్ చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అలాగే రామజన్మభూమి శంకుస్థాపన కార్యక్రమాన్ని SVBC ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంతో బిజెపి నేతలు భగ్గుమన్నారు.



ఇక తాజాగా భక్తుడికి పంపిన అశ్లీల వెబ్‌సైట్ లింక్.. మరింత వివాదం రాజుకుంది. ఛానెల్‌లో పనిచేస్తున్న ఉద్యోగే లింక్ పంపడంతో TTD ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీంతో భక్తి ఛానెల్ తిరుపతి కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. వీరికి దిమ్మతిరిగే దృశ్యాలు కనిపించాయి. చాలామంది ఉద్యోగులు కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలు చూస్తున్నారని.. ఇంకొందరు ఆన్‌లైన్ పేకాట ఆడుతున్నట్లు గమనించారు. వెంటనే అలర్ట్ అయిన టీటీడీ.. అశ్లీల లింకు పంపిన ఉద్యోగిని సస్పెండ్ చేసి.. మరో పాతిక మంది ఉద్యోగులపై విచారణ కొనసాగిస్తుంది.

SVBCని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్న TTD ప్రయత్నానికి ఇలాంటి ఘటనలు విఘాతం కలిగిస్తున్నాయి. స్వయంగా సిబ్బంది ఛానల్ పరువు తీస్తున్నారు. ఇకనైనా భక్తి ఛానల్ గాడిన పెట్టేందుకు ఇటు పాలకమండలి, అటు ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ పెరుగుతోంది.