అబ్దుల్ సలాం కేసు : తెల్లకాగితంపై సంతకం పెట్టాలని ఒత్తిడి, తగ్గని పోలీసుల ఓవరాక్షన్

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 10:30 AM IST
అబ్దుల్ సలాం కేసు : తెల్లకాగితంపై సంతకం పెట్టాలని ఒత్తిడి, తగ్గని పోలీసుల ఓవరాక్షన్

Abdul Salam case : నంద్యాల అబ్దుల్‌ సలాం కేసులో పోలీసులు ఓవరాక్షన్ ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసు అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబంపై ఇంకా ఒత్తిడి తెస్తునట్లు తెలుస్తోంది. అర్థరాత్రి అబ్దుల్‌ సలాం అత్త ఇంటికి ఓ మహిళా ఎస్సై, కానిస్టేబుల్‌ వెళ్లడం అలజడి రేపింది. తెల్లకాగితంపై సంతకం పెట్టాలని వారిపై ఒత్తిడి తీసుకు వచ్చారు. అయితే అబ్దుల్‌ సలాం అత్త వెంటనే సబ్ ‌కలెక్టర్‌ కల్పన కుమారికి ఫోన్‌ చేశారు. సబ్‌ కలెక్టర్‌ జోక్యంతో పోలీసులు వెనక్కు తిరిగి వెళ్లిపోయారు.



నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో 2020, నవంబర్ 08వ తేదీ ఆదివారం నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కానీ..వీరికి నంద్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిద్దరిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. నిందితులు సోమశేఖర్‌రెడ్డి, గంగాధర్‌కు నంద్యాల ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఏడు రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే నిందితులు బెయిల్ కోసం ఆశ్రయించగా, నంద్యాల కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.



ఈ ఘటనపై సీఎం జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే న్యాయపరంగా చర్యలు తీసుకున్నామని, ఆత్మహత్యకు కారణమైన పోలీసులను అరెస్ట్ చేయించామని తెలిపారు. అయితే.. టీడీపీకి చెందిన రామచంద్రరావు అనే లాయర్ బెయిల్ పిటిషన్ వేసి వాదించారని జగన్ చెప్పారు. వాళ్ల పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదన్నారు. వారి బెయిల్‌ను రద్దు చేయాలని సెషన్స్ కోర్టుని ఆశ్రయించినట్టు చెప్పారు.



కాసేపటికే…కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు న్యాయవాది రామచంద్రారావు ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తరపున ఈయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. అనూహ్యంగా…2020, నవంబర్ 11వ తేదీ బుధవారం సాయంత్రం..సంచలన నిర్ణయం తీసుకున్నారు. విచారణ నుంచి తప్పుకోవడమే కాకుండా..టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. నిందితుల బెయిల్ రద్దుపై 2020, నవంబర్ 12వ తేదీ గురువారం కోర్టులో విచారణ జరుగనుంది.