కార్యకర్తల కొంప ముంచుతున్న వాలంటీర్ వ్యవస్థ

కార్యకర్తల కొంప ముంచుతున్న వాలంటీర్ వ్యవస్థ

2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఘన విజయం వెనుక అధినేత జగన్ కష్టంతో పాటు.. పార్టీలో క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తల కష్టం కూడా ఎక్కువగానే ఉంది. దాని వల్లే బంపర్‌ మెజారిటీతో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే పార్టీ అధికారంలోకి రాగానే తమని పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. వీరి ఆవేదనకు ప్రధాన కారణం వాలంటీర్లేనని అంటున్నారు. సీఎం జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వాలంటీర్‌ వ్యవస్థపై పార్టీ గ్రామ స్థాయి నేతలు గరంగరంగా ఉన్నారు. దీనికి చాలా బలమైన కారణమే చెబుతున్నారు.



సాధారణంగా అధికార పార్టీ నేతల దగ్గరకు గ్రామాల్లో ప్రజలు నిత్యం వస్తుంటారు. ఏ పథకం అమలు కావాలన్నా.. గ్రామాల్లో సమస్యల విషయంలోనూ ఆయా గ్రామ స్థాయి లీడర్స్ దగ్గరకు వస్తుంటారు ప్రజలు. ప్రస్తుతం వాలంటీర్లు అత్యంత కీలకంగా ఉన్నారు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రజా సమస్యల వరకూ వారి ద్వారానే జరుగుతున్నాయి. దీంతో తమకు ఎలాంటి గుర్తింపు ఉండటం లేదని తెగ మధన పడిపోతున్నారట.



వాలంటీర్ల విషయంలో ఎమ్మెల్యేలు సైతం కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షన్‌తో పాటు ఏ పథకాలకు సంబంధించిన చెక్కులు, డబ్బులు ఇలా ఏవైనా వారి ద్వారానే ఇప్పించడం ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదంటున్నారు. అన్నీ వాలంటీర్లే చేసేస్తుంటే మనకు ప్రజలతో కలిసే సందర్భంగా ఉండటం లేదంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.



సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ మంచి ఫలితాలు ఇస్తున్నా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ నేతలు మాత్రం వీరిపై అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. మరోపక్క కొన్ని చోట్ల వాలంటీర్ల ఆగడాలు మితిమీరుతుండడంతో పార్టీకి తలనొప్పులు వస్తున్నాయి. లబ్ధిదారులపై దాడులకు పాల్పడడం, కొందరిని ఇబ్బందులు పెట్టడం.. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలను కూడా పట్టించుకోనందున తమకు ఇక విలువ ఏముంటుందని వాపోతున్నారు.