జగన్ ప్రభుత్వంపై ఆ పోస్టులతో నాకెలాంటి సంబంధం లేదు, నటుడు రావు రమేష్

  • Published By: naveen ,Published On : May 31, 2020 / 04:28 AM IST
జగన్ ప్రభుత్వంపై ఆ పోస్టులతో నాకెలాంటి సంబంధం లేదు, నటుడు రావు రమేష్

సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ నటుడు రావు రమేష్ పేరుతో పోస్టుల రావడం సంచలనం రేపింది. రావు రమేష్ ఏంటి? జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటి? అనే చర్చ అటు సినీ, ఇటు రాజకీయవర్గాల్లో మొదలైంది. అవి నిజంగా రావు రమేష్ చేసిన ట్వీట్లేనని భావించి నెటిజన్లు వేల సంఖ్యలో రీట్వీట్లు చేస్తున్నారు. దీంతో రచ్చ రచ్చ జరిగింది. ఈ విషయం రావు రమేష్ ని కూడా చేరింది. వెంటనే ఆయన స్పందించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పేరుతో వచ్చిన సోషల్‌ మీడియా పోస్టులపై వివరణ ఇచ్చారు. 

నాకు ఏ పాపం తెలీదు, పోలీసులకు ఫిర్యాదు చేస్తా:
ఆ పోస్టులు తాను చేయలేదన్నారు. ఆ పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అసలు సోషల్ మీడియాలో తనకు ఎటువంటి అకౌంట్స్ లేవని తేల్చి చెప్పారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్‌ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని రావు రమేష్‌ చెప్పారు. 

నాకసలు సోషల్ మీడియా అకౌంట్లే లేవు:
‘‘మీడియా మిత్రులకు, నన్ను, నా నటనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ.. నాకు సోషల్‌ మీడియాలో ఎటువంటి ఖాతాలూ లేవు. ఫేస్‌బుక్ కాని, ట్విటర్ కాని, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏమీ లేవు. ఈ రోజు నా పేరు మీద ఎవరో ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. దయచేసి వాటిని నమ్మకండి. ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద త్వరలోనే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టబోతున్నా’’ అని రావు రమేష్ తెలిపారు.

రావు రమేష్ పేరుతో కలకలం రేపిన పోస్టులు ఇవే:
‘‘మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ – మీ రావు రమేష్’’ అంటూ ప్రజావేదిక కూల్చివేత గురించి రావు రమేష్ పేరు మీదుగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే ‘‘పోలవరం ప్రాజెక్ట్ వైసీపీ ప్రభుత్వం ఏడాదిలో ఎంత పని చేశారో చెప్పండి?’’ అంటూ చేసిన ట్వీట్ సైతం చక్కర్లు కొడుతోంది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను హైకోర్టు తిరిగి నియమించడంపై కూడా జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్న ట్వీట్ సైతం వైరల్ అయింది.

రావు రమేష్‌ పేరుతో ట్విటర్‌లో వస్తున్న పోస్టింగ్ ల నేపథ్యంలో.. సదరు ట్విటర్‌ ఖాతాకు అఫీషియల్ గుర్తింపు లేకపోవడంతో పలువురు ఆయనను సంప్రదించారు. ఇది తెలుసుకుని రావు రమేష్ కంగుతిన్నారు. వ్యవహారం మరింత ముదరకముందే రంగంలోకి దిగారు. తాను ఎలాంటి ట్వీట్లు చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ వెల్లడించారు.