Ongole Aditya Hospital : బాబోయ్.. ఏడాదిగా ఆసుపత్రి నడిపిస్తూ కోవిడ్ చికిత్స కూడా అందిస్తున్న నకిలీ డాక్టర్.. చదివింది బీఫార్మసీ ఫస్టియర్

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. ఆ నకిలీ డాక్టర్ ఏడాది కాలంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అంతేకాదు కొవిడ్‌ చికిత్సను సైతం చేస్తున్నాడని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గురువారం(మే 13,2021) నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం వెలుగుచూసింది.

Ongole Aditya Hospital : బాబోయ్.. ఏడాదిగా ఆసుపత్రి నడిపిస్తూ కోవిడ్ చికిత్స కూడా అందిస్తున్న నకిలీ డాక్టర్.. చదివింది బీఫార్మసీ ఫస్టియర్

Ongole Aditya Hospital

Ongole Aditya Hospital : ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘరానా మోసం వెలుగుచూసింది. నకిలీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. ఆ నకిలీ డాక్టర్ ఏడాది కాలంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అంతేకాదు కొవిడ్‌ చికిత్సను సైతం చేస్తున్నాడని తెలుసుకుని అధికారులు విస్తుపోయారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గురువారం(మే 13,2021) నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం వెలుగుచూసింది.

ఒంగోలు సుందరయ్య భవన్‌ రోడ్డులోని ఆదిత్య జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ వైద్యంతో పాటు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు భారీగా వసూలు చేస్తున్నారనే సమాచారం అందింది. దీంతో జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తనిఖీలకు ఆదేశించారు. ప్రాంతీయ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె.ఎస్‌.ఎస్‌.వి.సుబ్బారెడ్డి పర్యవేక్షణలో అధికార బృందం పరిశీలించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు కొవిడ్‌ బాధితులు ఇక్కడ వైద్యం పొందుతున్నట్లు గుర్తించారు.

విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కొవిడ్‌ చికిత్సకు అనుమతులు లేవని తేలింది. అంతేకాదు, అసలక్కడ అర్హులైన డాక్టర్లే లేరని బయటపడింది. కనిగిరి మండలం చినఇర్లపాడు గ్రామానికి చెందిన ఆవుల శ్రీనివాసరెడ్డి దీన్ని నిర్వహిస్తూ అన్ని రకాల రోగాలకు చికిత్సనందిస్తున్నాడు. బీఫార్మసీ ఫస్టియర్ లోనే అతడు చదువు ఆపేయడం గమనార్హం. తొలుత కొందరు నిపుణులైన వైద్యులు పనిచేసినా ఆ తర్వాత వారంతా బయటకు వెళ్లిపోయారు. అప్పటినుంచి శ్రీనివాసరెడ్డే చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు.

తాము గుర్తించిన అంశాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు విజిలెన్స్‌ డీఎస్పీ తెలిపారు. ఇక్కడ వైద్యులు లేనందున ప్రస్తుతమున్న రోగులను నగరంలోని కొవిడ్‌ ఆసుపత్రులకు పంపేందుకు సిఫారసు చేశారు. నకిలీ డాక్టర్ బాగోతం ఒంగోలులో కలకలం రేపింది. స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇన్నాళ్లు తామంతా నకిలీ డాక్టర్ దగ్గర చికిత్స పొందామనే నిజం తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఇలాంటి నకిలీ డాక్టర్లు ఎంత మంది ఉన్నారో అనే కంగారు మొదలైంది.