గోవిందా.. గోవిందా: శ్రీవారి దర్శనం మొదలైంది.. తిరుమల గిరుల్లో భక్తుల ఫోటోలు

  • Published By: vamsi ,Published On : June 8, 2020 / 04:24 AM IST
గోవిందా.. గోవిందా:  శ్రీవారి దర్శనం మొదలైంది.. తిరుమల గిరుల్లో భక్తుల ఫోటోలు

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు ఇవాళ(8 జూన్ 2020) నుంచి ప్రయోగాత్మకంగా తిరుమ‌ల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం మొదలైంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు దాదాపు 80రోజులుగా భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం నిలిపివేయగా.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తి మేర‌కు ముందు జాగ్రత్త చర్యలు అమలు చేస్తూ నేటి నుండి తిరుమ‌లలో ప్రయోగాత్మకంగా ద‌ర్శ‌నం ప్రారంభించారు.

ttd

లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న కేంద్రప్రభుత్వం ఆలయాలను తెరవటానికి అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు క్యూలైన్లలో భౌతికదూరం పాటిస్తూ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సుమారు రెండున్నర నెలల తర్వాత తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో ఉదయం 6.30 గంటల నుంచి తిరుపతి వెంకన్న భక్తులకు దర్శనమిచ్చాడు.

ttd

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తొలి రెండు రోజుల పాటు దర్శనాల ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దర్శనాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.

ttd

జూన్ 10వ తేదీ నుంచి స్థానికులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనుండగా.. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 వరకు దర్శనాలకు ఏర్పాట్లు చేసింది. గంటకు ఐదు వందల మంది చొప్పున, రోజుకు ఆరు వేల మందికి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం, మరో మూడు వేల మందికి సాధారణ దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. 

ttd

భక్తులు మధ్య భౌతిక దూరం, శుభ్రత పాటించేలా ఏర్పాట్లు చేశారు. బౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లను ధరించిన ఉద్యోగులు, క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు. కాగా, దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ, స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలు, పండ్లతో ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులకు దర్శనాలు కల్పించేందుకు మార్కింగ్ లైన్స్, భౌతిక దూరాన్ని పాటిస్తూ, నిలబడేందుకు ప్రత్యేక బాక్స్ లు, ఎక్కడికక్కడ శానిటైజర్లు అమర్చారు అధికారులు.

Read: సీన్ రివర్స్ : ఆ ఆలయం తలుపులు తెరుచుకోవు