అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ వరప్రసాద్‌.. హఠాన్మరణమా? హత్య?

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 02:34 AM IST
అగ్రిగోల్డ్‌ వైఎస్‌ చైర్మన్ వరప్రసాద్‌.. హఠాన్మరణమా? హత్య?

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సదాశివ వరప్రసాద్ రావు రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో ఆయన విగత జీవిగా కనిపించారు. దీంతో అక్కడున్న వారు వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వరప్రసాద్‌ మృతిపై సికింద్రాబాద్‌ గోపాలపురం పీఎస్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆయనది హఠాన్మరణమా.. లేక హత్యనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అగ్రిగోల్డ్‌ స్కామ్‌ ఏపీలో రాజకీయ దుమారం రేపింది. ఈ స్కామ్‌ నాలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఖాతాదారులకు సకాలంలో డిపాజిట్లు చెల్లించడంలో ఆ సంస్థ విఫలమైంది. దాదాపు 13 లక్షల మందిని ఈ సంస్థ నట్టేట ముంచింది. అగ్రిగోల్డ్‌ స్కామ్‌ నిందితుల్లో సదాశివ ఒకరు.

తెలంగాణలో నమోదైన అగ్రిగోల్డ్‌ కేసులో డైరెక్టర్లకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు తోటి డైరెక్టర్లతో కలిసి సోమవారం వరప్రసాద్‌ వచ్చాడు. స్టేషన్‌లో సంతకం చేసిన తర్వాత అందరూ కలిసి విజయవాడ వచ్చేందుకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్శిల కౌంటర్‌ దగ్గరకు రాగానే వరప్రసాద్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. అయితే వరప్రసాద్ మృతిపై గోపాలపురం పీఎస్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.