All The Best : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు

  • Published By: madhu ,Published On : March 4, 2020 / 01:22 AM IST
All The Best : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు

తెలుగు రాష్ట్రాల్లో 2020, మార్చి 04వ తేదీ బుధవారం నుంచే ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం 1750 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక నిమిషం ఆలస్యం నిబంధనను ఇంటర్‌ అధికారులు అమలు చేస్తున్నారు

తెలంగాణలో : –
తెలంగాణలో మార్చి 04వ తేదీ నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి.. మొత్తంగా 9 లక్షల 65వేల 839 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4లక్షల 75వేల 832 మందికాగా.. 5 లక్షల 799 మంది సెకండియర్ విద్యార్థులు.  ఇంటర్‌ పరీక్షల కోసం అధికారులు 1339 ఎగ్జామ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు.  ఉదయం 9 గంటల  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.  విద్యార్థులను  అరగంట ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్‌ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో : –

ఆంధ్రప్రదేశ్‌లోనూ నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్‌ ఈనెల 23 వరకు కొనసాగనున్నాయి. ఇంటర్‌ పరీక్షలకు ఏపీలో మొత్తంగా 10 లక్షల 65వేల 156 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 411 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ను నియమించారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఉన్న అన్ని జీరాక్స్‌ కేంద్రాలను మూసివేయాలని ఇంటర్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

Read More : వైసీపీ – టీడీపీ డిష్యూం..డిష్యూం : తమ జోలికి వస్తే..తన్ని తరిమి కొడుతాం – లోకేష్