Tirupati by election: రేపే ఎన్నికలు.. తిరుపతిలో ఎవరి లెక్క ఏంటీ?

Tirupati by election: రేపే ఎన్నికలు.. తిరుపతిలో ఎవరి లెక్క ఏంటీ?

Tirupati By Elections

Tirupati by election: టెంపుల్ సిటీలో హోరాహోరీ ప్రచారానికి శుభం కార్డు పడింది. రేపు(17వ తేదీ) తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. సాయంత్రం ఏడు గంటలకు మైకులు బంద్ కానున్నాయి. నెలరోజులుగా తిరుపతి చుట్టూ తరిగిన ఏపీ రాజకీయం.. హోరెత్తిన విమర్శలు.. సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. సిట్టింగ్ సీటులో గెలుపు సులువే అనే ధీమాలో వైసీపీ.. తిరుపతి దక్కించుకుని.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోయిన పరువును నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష టీడీపీ.. కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-జనసేన.. అన్నీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గెలుపు కోసం తాపత్రయపడుతుంటే.. వైసీపీ మాత్రం మెజారిటీ కోసం చూస్తోంది.

Image

కరోనా సమయంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో పోలింగ్‌ శాతమే విజేతను నిర్ణయించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా.. పోలింగ్ శాతం, చివరి నిమిషం ప్రలోభాలు.. ఇలా ఎన్నో అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎక్కువగా పోలింగ్ శాతమే అభ్యర్థుల గెలుపు ఓటములను డిసైడ్ చేయనుంది. కరోనా ప్రభావంతో ఓటింగ్ శాతం మందకొడిగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా..

Chandrababu

ఇదిలా ఉంటే.. ప్రచారం సమయంలో నేతల మధ్య మాటల తూటాలు.. మతాల ప్రస్తావనలు, రాళ్ల దాడులు, అభివృద్ధి ఎజెండా అంటూ పలు అంశాలు ప్రభావం చూపగా.. వైసీపీ సిట్టింగ్ స్థానం నుంచి డాక్టర్ గురుమూర్తి.. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ పోటీ పడుతున్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో జోష్‌లో ఉన్న వైసీపీ తిరుపతిలో విజయం చాలా ఈజీ అని భావిస్తోంది. మరోసారి ఓటర్లు తమవైపే ఉన్నారని ఈ గెలుపుతో నిరూపిస్తామని అంటున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే నిరాశలో ఉన్న టీడీపీ నేతలు గెలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ -జనసేన వ్యూహాలు పనిచేస్తాయని ఆ పార్టీ కూడా అంటుంది. తమ అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి అంటూ బీజేపీ ముమ్మర ప్రచారం చెయ్యగా.. గతం కంటే మెరుగ్గా ఆ పార్టీ ఓట్లు రాబట్టుకుంటుందా? అనేది అసలైన ప్రశ్న.

Ratna Prabha

తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో… మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటిలో చిత్తూరు జిల్లాలో మూడు.. నెల్లూరు జిల్లా పరిధిలో నాలుగు ఉన్నాయి. రెండు జిల్లాల్లోనూ రాజకీయం రసవత్తరంగా సాగుతోండగా.. సిట్టింగ్ సీటులో భారీ మెజారిటీ లక్ష్యంగా వైసీపీ ప్రచారం చేస్తుంది.

Janasena

వైసీపీ.. 22 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రస్తావిస్తూ.. డాక్టర్ గురుమూర్తి విజయం ఖాయమనే ధీమాతో వైసీపీ ఉంది. మెజారిటీ వస్తుందా అనే విషయమే టెన్షన్ పెడుతోంది. వైసీపీ అధినేత జగన్‌ ప్రచారానికి రాలేదు. కానీ.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడా తగ్గలేదు. ఇంటింటికీ వెళ్లి జగన్‌ రాసిన లేఖలను ఇస్తూ ప్రచారం చేశారు. జగన్‌ క్యాబినెట్‌లోని మంత్రులు చాలామంది తిరుపతి ఎన్నికల ప్రచారంలోనే తిరిగారు.


టీడీపీ విషయానికి వస్తే… అందరికంటే ముందే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా.. కీలక నేతలంతా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చుట్టేశారు. తమ అభ్యర్థికే ఎందుకు వేయాలో ఓటర్లకు వివరిస్తూ డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ ఫోకస్ చేయగా.. 22మందిని ఎంపీలుగా గెలిపిస్తే ఏం చేశారంటూ నిలదీశారు. వైఎస్ వివేకా మర్డర్ కేసు.. నారా లోకేశ్ ప్రమాణం.. జగన్‌కు సవాల్ చేయడం.. పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌.. వీటితోపాటు.. ప్రచార సమయంలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందంటూ టీడీపీ హైలెట్ చేసుకుంది.


బీజేపీ-జనసేన విషయానికి వస్తే.. ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభను ప్రకటించగా.. ప్రచారంలో దూకుడుగానే వ్యవహరించారు. ఆధ్యాత్మికం, నైపుణ్యం, ఉపాధి కల్పన, సంపూర్ణ ఆరోగ్యం, విద్య, రహదారులు, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, మత్స్యరంగం ఇలా అన్ని రంగాలను టచ్ చేస్తూ ఉప ఎన్నికలకు కూడా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయాధ్యక్షులు నడ్డా, జనసేన అధినేత పవన్ ప్రచారం ప్లస్ అవుతుందని ఈ కూటమి భావిస్తోంది. ప్రచారం చివరి నాటికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మతాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేసింది. ఈ పరిస్థితిలో ఎటువంటి ప్రభావం బీజేపీ చూపుతుంది అనేది ఆసక్తికరమే.


కాంగ్రెస్ విషయానికి వస్తే.. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ బరిలో ఉండగా.. ఆరుసార్లు ఎంపీగా గెల్చిన ఆయన.. తనని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ప్రజల్లో తిరిగారు. తాను ఎంపీగా పనిచేసినప్పడు చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. జగన్ కేసుల అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ప్రచారం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమని మక్తకంఠంతో చెప్పుకొచ్చారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సాయంత్రం ఏడు గంటలతో ముగుస్తోండగా.. 17న పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు రానున్నాయి.

తిరుపతిలో.. 2019లో..
వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు 7లక్షల 22వేల 877ఓట్లు రాగా..
టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 4లక్షల 94వేల 501ఓట్లు..
నోటాకు.. 25,781 ఓట్లు వచ్చా..
నాల్గవ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు
ఐదవ స్థానంలో బీఎస్‌పీ అభ్యర్థికి దగ్గుమాటి శ్రీహరిరావుకు 20వేల 971ఓట్లు..
ఆరో స్థానంలో బీజేపీ అభ్యర్థి బొమ్మి శ్రీహరికి.. 16,125ఓట్లు వచ్చాయి.

2019లో తిరుపతి లోక్‌సభ ఓట్ల శాతం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. : 55.03%
తెలుగుదేశం పార్టీ.. : 37.65%
నోటా.. : 1.96%
కాంగ్రెస్..: 1.83%
బీఎస్‌పీ..: 1.60%
బీజేపీ..: 1.23%