ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి ఎంట్రీ ? 

10TV Telugu News

నారా వారి ఇంట మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం పార్టీకి జవజీవాలు కల్పించాలంటే యువరక్తాన్ని రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. బయటి వారు కాకుండా తన ఇంటి నుంచే వారసురాలిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపేందుకు బాబు సిద్ధం అయ్యారట. చంద్రబాబు కోడలు, నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్త ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. 

గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయినా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పార్టీ ఉంది. బలంగా ఉన్న వైసీపీని ఎదురించి, పోరాడాలంటే బలమైన నాయకత్వం అవసరమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీలో చంద్రబాబు మినహా వేరే వారు ఎవరూ వైసీపీని దీటుగా ఎదుర్కొంటున్నట్టుగా కనిపించడం లేదు. రోడ్డెక్కి వైసీపీని నిలదీసే వారు లేకుండాపోయారు. పోరాటాలు, వ్యూహాలు అన్నీ చంద్రబాబే చేయాల్సి వస్తోందట. పార్టీలో సీనియర్లు సైతం ఒకరిద్దరు మినహా అంతగా స్పందించడం లేదు. 

వైసీపీని దీటుగా ఎదుర్కోవాలంటే పార్టీలో బలమైన నాయకత్వం అవసరం. అలాంటి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో ముందుకు రావడం లేదంటున్నారు. నారా లోకేశ్‌ ఉన్నప్పటికీ ఆయన బలం వైసీపీని ఎదుర్కొనేందుకు సరిపోవడం లేదు. దీంతో చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఈ సమయంలో నారా బ్రాహ్మణిని తెర మీదకు తీసుకు రావడమే మంచిదనే ఉద్దేశంలో బాబు ఉన్నారంటున్నారు. వ్యాపారంలో చేయి తిరిగిన బ్రాహ్మణి రాజకీయాలను కూడా సమర్థవంతంగా నడిపించగలరని అంచనా వేస్తున్నారు. 

గత కొంత కాలంగా ప్రత్యక్షంగా కాకపోయినా రాజకీయాలను కూడా బ్రాహ్మణి పరిశీలిస్తున్నారు. పార్టీ తరఫున సోషల్ మీడియా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నివాసంలో నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో సోషల్ మీడియా కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్వహించారట. ఈ సందర్భంగా సోషల్ మీడియా పనితీరుపై ఆమె ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేశారట. తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో కాస్త బలం ఎక్కువగానే ఉంది. చంద్రబాబు చేపడుతోన్న ప్రజా ఉద్యమాలు, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలోనూ సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటోంది.  

తాజాగా విశాఖలో పర్యటించిన చంద్రబాబు యాత్రను వైసీపీ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దానికి టీడీపీ సోషల్ మీడియా విభాగం గట్టిగా కౌంటర్లు ఇచ్చింది. ఈ అంశాలన్నీ పార్టీ బలం పుంజుకోవడానికి దోహదపడతాయని పార్టీ నేతలు నమ్ముతున్నారు. చంద్రబాబు సొంత నివాసంలో కొంతమంది సోషల్ మీడియా టీడీపీ యాక్టివిస్ట్‌లను ఎంపిక చేసి, వారికి విందు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి చిన్న స్థాయి వర్క్‌షాప్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మేలు జరిగేలా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం నిర్వహించాలని సూచించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను కూడా హైలెట్ చేసేలా ఈ వర్క్‌షాప్‌లో సూచనలు చేశారట. త్వరలోనే బ్రాహ్మణి స్వయంగా ప్రజా ఉద్యమాలలో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలుస్తోంది.

Read More : రెండు ఛానళ్లపై నిషేధం..I&B మినిస్ట్రీ శాఖ సంచలన నిర్ణయం

10TV Telugu News