పార్టీలన్ని డైవర్ట్‌.. వైసీపీ నేతలంతా ఫుల్‌ హ్యాపీస్‌!

  • Edited By: sreehari , December 31, 2019 / 01:07 PM IST
పార్టీలన్ని డైవర్ట్‌.. వైసీపీ నేతలంతా ఫుల్‌ హ్యాపీస్‌!

ఏపీలో మూడు రాజధానుల అంశం ఒక పక్క మంటలు రేపుతున్నా.. అధికార పక్షమైన వైసీపీ నేతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా.. వైసీపీలో మాత్రం ఒకటే మాట వినిపిస్తున్నారు. జగన్‌ నిర్ణయమే తమ నిర్ణయమంటున్నారు. అమరావతిని తరలించడం వల్ల రెండు జిల్లాల్లో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని తెలిసినా లైట్‌ తీసుకుంటున్నారట. జగన్‌ ఈ విషయంలో చాలా ముందు ఆలోచనతోనే ఉన్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది కాబట్టి జనం దృష్టి మరల్చాలంటే ఏదో ఒకటి జరగాలి. అది రాజధాని అంశంతో సాధ్యమైందనే ఉద్దేశంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు ఉన్నారని జనాలు అనుకుంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందంటున్నారు. రాజధాని నిర్మాణానికి అప్పులు పుట్టే పరిస్థితి లేదు. అంతర్జాతీయ సంస్థలు కూడా అప్పులిచ్చేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో జగన్‌ ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు గత ప్రభుత్వ హయాం నుంచి అమలవుతున్న పథకాలకు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులకు జీతాల చెల్లింపులు జరగలేదు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులదీ అదే పరిస్థితి. వివిధ పథకాలు, ప్రాజెక్టుల అమలు కోసం లక్షల కోట్ల రూపాయలకు పైగానే అవసరం అవుతాయి. కానీ, ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. 

విశాఖపైనే వైసీపీ యోచన: 
రాజధాని కోసం పెద్ద నగరాలేవీ అవసరం లేదని వైసీపీ సర్కారు భావిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి జరిగిన విశాఖపట్నంలో అయితే పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని భావిస్తోందట. ఇప్పుడు ఒకవేళ పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అమరావతిలోనే రాజధాని నిర్మించినా ఆ క్రెడిట్‌ అంతా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోతుందని వైసీపీ అనుకుంటోందట. అందుకే దానిని పక్కన పెట్టి విశాఖ అయితే ఏ సమస్య ఉండకపోగా ఆ ప్రాంతంలో గంపగుత్తగా ఓట్లు తమకే పడతాయని వైసీపీ ఆశిస్తోందని జనాలు అంటున్నారు. 

రాజధాని వ్యవహారం తెరమీదకు రావడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇసుక కొరత, ఇంకా చాలా అంశాలను జనాలు పూర్తిగా మరచిపోయారని వైసీపీ నేతలే అంటున్నారు. ఇప్పటి వరకూ ఊపిరి సలపకుండా చేసిన వివిధ రాజకీయ అంశాలు రాజధాని దెబ్బతో పక్కకు పోయాయని చెబుతున్నారు. ఇక అమరావతి ప్రాంతంలోని ప్రధానమైన సామాజిక వర్గం టీడీపీకే మద్దతుగా నిలుస్తోంది. వారిలో కొంతమంది మొన్నటి ఎన్నికల్లో టీడీపీపై అక్కసుతో వైసీపీకి ఓట్లు వేసినా.. భవిష్యత్తులో మళ్లీ టీడీపీకే మద్దతుగా నిలుస్తారని జగన్‌ లెక్కలేశారని పార్టీ సీనియర్లు అంటున్నారు. కాబట్టి రెండు జిల్లాల్లో ఒక వర్గం దూరమైనంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదన్నది జగన్‌ అంచనాగా ఉందట. 

జగన్ వల్లే సాధ్యమైందని :
ఈ ఎన్నికల్లో తమ గెలుపు కూడా జగన్‌ వల్లే సాధ్యమైందని వైసీపీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా జగన్‌ను చూసే ఓటేస్తారని, ఒకవేళ తాము ఓడినా, గెలిచినా.. జగన్‌దే బాధ్యత అని అంటున్నారు. ఈ విషయంలో ఊరికే ఆందోళన చెందాల్సిన పని లేదని అనుకుంటున్నారట. అంతేకాకుండా ఆ 29 గ్రామాల వారే తప్ప.. పక్కనున్న గుంటూరు జిల్లా నుంచి గానీ.. ఇటు పక్క కృష్ణా జిల్లా నుంచి దీనిపై జనాలు ఆందోళనలు చేయడం లేదని లాజిక్కులు చూపిస్తున్నారు వైసీపీ నేతలు. కాబట్టి జనాల్లో ఈ విషయం మీద అంత పట్టింపు లేదనే ఒక నిర్ణయానికి జగన్‌ వచ్చేశారట. అందుకే ఉత్తరాంధ్ర మొత్తం గుప్పెట్లో పెట్టుకొనే నిర్ణయం తీసుకున్నారట. 

మరోపక్క.. అసలు జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అన్నీ ఆలోచించాకే ముందడుగు వేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ నష్టం వాటిల్లే పరిస్థితులు ఏమీ ఉండవని అంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా ఇతరత్రా సమస్యలు, అంశాల నుంచి ప్రస్తుతానికైతే ప్రజల దృష్టంతా రాజధాని చుట్టూనే ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభుత్వం ఊపిరి పీల్చుకోవడానికి వీలవుతుందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారట. రాజధాని అంశంతో మిగిలిన అంశాలను జనాలు మరచిపోవడంతో వైసీపీ నేతలంతా హ్యాపీగా ఉన్నారని చెబుతున్నారు. ఏదైనా జనాల దృష్టిని పక్కకు మరల్చేయడం చాలా ఈజీ కదా.